
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో మరింత పారదర్శకత కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానంపై సంక్షేమ శాఖలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని అధికారులు భావించినప్పటికీ... గతంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు తీరుతో పాటు గతంలో నమోదైన హాజరు విధానంపైన విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బయోమెట్రిక్ హాజరు విశ్లేషణ కోసం వసతిగృహ సంక్షేమాధికారులకు అవగాహన కల్పించనుంది. మూడు రోజుల పాటు శిక్షణను నిర్వహించి 2019–20 విద్యా సంవత్సరంలో నమోదయ్యే రికార్డును... 2018–19 సంవత్సరంతో పాటు 2017–18 విద్యా సంవత్సరంలో నమోదైన రికార్డును సరిపోలుస్తూ విశ్లేషణ చేపట్టనుంది.
వసతిగృహం వారీగా అధ్యయనం..: రాష్ట్రవ్యాప్తంగా 674 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 50వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బయోమెట్రిక్ హాజరు విశ్లేషణతో విద్యార్థుల హాజరు తీరెలా ఉందనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో వసతిగృహాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రస్తుత హాజరు, గతంలో నమోదైన హాజరును సరిపోలుస్తారు. దీంతో హాజరులో వ్యత్యాసం స్పష్టం కానుంది. వరుసగా ఏడాది పాటు హాజరు శాతాన్ని పరిశీలిస్తే గతంలో హాజరు శాతాల వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దీంతో అక్రమాలపై స్పష్టత వస్తే సదరు అధికారిపై చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment