సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు నమోదు గడువును నెలరోజుల పాటు పొడిగించాలని సంబంధిత సంక్షేమ శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాయి. ఈ నెల 31తో పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తు గడువు ముగియనుంది. వాస్తవానికి ఈ దరఖాస్తుల ప్రక్రియ జూలై రెండో వారంలో మొదలవ్వగా అక్టోబర్ నెలాఖరుతో గడువు ముగిసింది. కానీ ఆలోపు కేవలం 4.72లక్షల మంది విద్యార్థులు మాత్రమే నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దరఖాస్తు గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని సంక్షేమ శాఖ లు యోచిస్తున్నాయి. ఆ మేరకు గడువు తేదీ పెంపునకు అనుమతులు కోరుతూ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
దరఖాస్తులు 10.45 లక్షలే..
పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 13.5 లక్షల మంది విద్యార్థులుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు కేవలం 10.45 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఆ మేర దరఖాస్తులు వచ్చే అవకాశం లేదు. దీంతో దరఖాస్తు స్వీకరణను మరో నెల పాటు కొనసాగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ మేరకు భావించి ప్రభుత్వానికి నివేదించింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పాస్ సర్వర్‌లో స్వీకరణ గడువును అధికారులు పొడిగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment