సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల వైపు తీసుకెళ్లేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చేసిన ప్రయత్నం ఫలించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతిగృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి పాలిసెట్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జిల్లాకో కేంద్రం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,250 మందిని శిక్షణకు ఎంపిక చేసింది. ఈ క్రమంలో 988 మంది విద్యార్థులు పాలిసెట్–2019 పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఏకంగా 949 మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 96 శాతం మంది అర్హత సాధించడం పట్ల ఆ శాఖ సంచాలకులు పి.కరుణాకర్ హర్షం వ్యక్తంచేశారు.
త్వరలో మరిన్ని సెట్‌లకు..
ఎస్సీ అభివృద్ధి శాఖ 2018–19 విద్యా సంవత్సరంలో కొత్తగా పాలిసెట్ శిక్షణ నిర్వహించింది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను ఎంపిక చేసింది. వారితో దాదాపు నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించింది. అదేవిధంగా పాలిసెట్‌కు సంబంధించిన మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేసింది. శిక్షణ సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను సైతం ప్రభుత్వమే కల్పించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.75 లక్షలు ఖర్చు చేసింది. వీటన్నిటి కారణంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో ఇతర ప్రవేశ పరీక్షలకు సైతం శిక్షణ ఇచ్చే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, డిగ్రీ విద్యార్థులకు పీజీసెట్‌పై అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఫలించిన పాలిసెట్ శిక్షణ
Published Wed, May 1 2019 3:12 AM | Last Updated on Wed, May 1 2019 3:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment