కేంద్రం ఇస్తే గందరగోళమే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకిచ్చే స్కాలర్‌షిప్‌ను నేరుగా అందించాలనే కేంద్ర ఆలోచనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్కాలర్‌షిప్‌లకు సంబంధించి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లలో జాతీయస్థాయిలో అనుసంధానం కష్టమని, దీంతో మంజూరులో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని రాష్ర్ట అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ (శాచ్యురేషన్ మోడ్‌లో) స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయి. అయితే కేంద్ర మాత్రం దాదాపు 40 శాతం వరకే స్కాలర్‌షిప్‌లు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుండడంపై విద్యార్థుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ పథకాల ద్వారా ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకే పేరు వస్తోందని కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్న తనకు మాత్రం ఏమీ ప్రయోజనం ఉండడం లేదని కేంద్రం భావిస్తోంది. తాను చేస్తున్న సహాయానికి సంబంధించి తగిన ప్రచారం రాకపోవడంతో నేరుగా విద్యార్థులు, కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలాకేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను, మళ్లీ జిల్లా స్థాయిల్లోనూ నోడల్ అధికారులను నియమించి వారి ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలించి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి నగదును బదిలీ చేస్తామని చెబుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.
నేషనల్ పోర్టల్‌లోకి మారాలి...
ఎస్సీ విద్యార్థులు, కాలేజీల స్కాలర్‌షిప్‌లను కేంద్రమే నేరుగా చెల్లిస్తుందని, అందుకోసం నేషనల్ ఈ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెన్నైలో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల సంక్షేమశాఖల సమీక్షా సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సూచిం చారు. దీనిపై రాష్ట అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ విధానం ద్వారా అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేనివిధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, ఆదాయ, కులధృవీకరణ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో విద్యార్థులు, కళాశాలల అకౌంట్ నంబర్లు అనుసంధానం వంటివి నేషనల్ పోర్టల్‌లో లేవని, అందువల్ల బోగస్‌ల నివారణ, నిజమైన లబ్ధిదారుల గుర్తింపు వంటివి పూర్తిస్థాయిలో సాధ్యం కాదని పేర్కొన్నారు.
అయితే, ఈ విషయమై అభ్యంతరాలను రాతపూర్వకం గా అందిస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాదాపు మూడునెలల క్రితం ఢిల్లీలో జరిగిన కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ నిర్వహిం చిన వివిధ రాష్ట్రాల ఎస్సీ సంక్షేమ శాఖల సమావేశంలోనూ రాష్ట్ర ఎస్టీశాఖ అధికారులు ఈ విషయంపై తమ అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాము అవలంభిస్తున్న విధానం, ఆన్‌లైన్‌లో ఈ-పాస్ ద్వారా విద్యార్థులు, కాలేజీలకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గురించి వివరించారు.
జాతీయస్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లోని విధానాల కంటే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఈ విధానం బాగుందనే అభిప్రాయాన్ని కూడా కేంద్ర ఎస్టీశాఖ ఉన్నతాధికారులు వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, తాము ఇంత మంది విద్యార్థులకు ఇస్తాం, రాష్ట్రం ఇంతమందికి ఇవ్వాలన్న విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఆదేశాలు అందలేదు.