అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కడప సెవెన్‌రోడ్స్:
జిల్లాలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అధికారులు శనివారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. పదో తరగతిలోపు విద్యార్హతగా నిర్ణయించిన ఆఫీసు సబార్డినేట్, పీహెచ్ వర్కర్స్, చైన్‌మన్, మెసెంజర్, గార్డనర్స్ వంటి 44 పోస్టులు వివిధ శాఖల్లో ఉన్నాయి. వీటికి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కిందిస్థాయిలో హెడ్మాస్టర్లు, ఎంఈఓలకు లంచాలు ముట్టజెప్పి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి సమర్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని ఇప్పటికే ఒకసారి విద్యాశాఖ అధికారుల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు.
ఇంకా కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉండడంతో మెరిట్ జాబితాలో టాప్‌టెన్‌లో నిలిచిన అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం కలెక్టరేట్‌లో పరిశీలించారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను హెడ్మాస్టర్ల వద్దనున్న రికార్డులతో సరిచూశారు. జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్, కేఆర్‌ఆర్ డెప్యూటీ కలెక్టర్ రోహిణి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఈశ్వరయ్య తదితరులు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.