
జనం లెక్క.. ధనం పక్కా!
జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఖరారు
♦ జనాభా ప్రాతిపదికన నిధుల ఖర్చు
♦ ఎస్సీ కేటగిరీలో మంచిర్యాల, ఎస్టీ కేటగిరీలో మహబూబాబాద్ జిల్లాకు అధిక నిధులు
సాక్షి, హైదరాబాద్: జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను అధికారులు తేల్చేశారు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించే క్రమంలో జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లోపు చట్ట సవరణలు, కొత్త పథకాలపై నివేదికలు ఇచ్చేందుకు కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలను సేకరించాయి.
2011 జనగ ణన ప్రకారం రాష్ట్రంలో పది జిల్లాలకు సంబం ధించి గణాంకాలు సిద్ధంగా ఉండగా.. కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆ మేరకు జనాభా లెక్కలను తేల్చేందుకు ఉపక్రమించా యి. ఈ నేపథ్యంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లవారీగా ఎస్సీ, ఎస్టీ జనసంఖ్యను అధి కారులు నిర్ధారించారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 3,50,03,674. వీరిలో ఎస్సీలు 54,08,800, ఎస్టీలు 31,77,940 మంది. మొత్తం జనాభా లో ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద జిల్లాలవారీగా ఖర్చు చేయాలని భావిస్తున్నారు.
మహబూబాబాద్, మంచిర్యాలకు..
ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖలు తేల్చిన గణాంకాల ప్రకారం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంచిర్యాల జిల్లాకు అధిక నిధులు రానున్నాయి. ఈ జిల్లా సాధారణ జనాభాలో ఎస్సీలు 24.72 శాతం ఉన్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ (21.32 శాతం), జనగామ(21.15 శాతం), ఖమ్మం (19.93శాతం) జిల్లాలకు అధిక నిధులు అందనున్నాయి. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ జిల్లాల్లో ఎస్సీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీ కేటగిరీలో మహబూబాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించనున్నారు. ఈ జిల్లాలో సగటు జనాభాలో 37.8శాతం గిరిజనులున్నారు. ఆ తర్వాత భద్రాద్రి– కొత్తగుడెం జిల్లా (36.66 శాతం), ఆదిలా బాద్ (31.68శాతం) జిల్లాలున్నాయి. హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అతి తక్కువ సంఖ్యలో గిరిజనులున్నారు.