డీఎల్ఎఫ్కు ఊరట
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. చండీఘడ్ లోని పంచకుల ప్రాజెక్టులోని అపార్ట్ మెంట్ల కేటాయింపు వివాదాన్ని శుక్రవారం విచారించిన సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డీఎల్ఎఫ్‌కు గతంలో ఎన్ సీడీఆర్ సీ విధించిన 12 శాతం వడ్డీని 9 శాతానికి తగ్గించింది. ఆయా కొనుగోలు దార్లకు నవంబర్30 లోపు స్వాధీనం చేయాలని తీర్పు చెప్పింది. లేదంటే పెనాల్టీ కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఫ్లాట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యానికి గాను 2014 నుంచి 9 శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. దాదాపు 50 మంది కొనుగోలుదారులకు ఈ చెల్లింపులు చేయాలని డీఎల్ఎఫ్ ను కోరింది.
పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. 2013లో తమ చేతికి రావాల్సిన ఫ్లాట్స్ రాలేదని ఆరోపిస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును విచారించిన కమిషన్ రియల్ సంస్థపై చీటింగ్ వ్యవహారం కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డీఎల్ ఎఫ్ ను సుప్రీం ను ఆశ్రయించింది. మరోవైపు ఢిల్లీ శివారుల్లో ఘజియాబాద్ ఒక నివాస ప్రాజెక్ట్ కు సంబంధించి 70మంది ఫ్లాట్ కొనుగోలుదారులకు ఇళ్లను కేటాయించడంలో విఫలమైన మరో రియల్ సంస్థ పార్వ్శనాధ్ డెవలపర్స్ ను , వారికి తిరిగి డబ్బులు చెల్లించే ప్రక్రియపై సమాధానం చెప్పాల్సిందిగా కోరింది.