అనంతపురం సిటీ: జిల్లాలో దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎదుట వందల మంది బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా ఉన్నతాధికారి మొదలు ఆయా శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలోని సమావేశ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక గ్రీవెన్స్‌కు వేలాది మంది దళితులు, గిరిజనులతో పాటు ఆయా కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీతో పాటు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, కమిషన్ సభ్యులు రవీంద్ర, సుబ్బరావులు ప్రజలనుంచి వినతులు స్వీకరించారు.
మాదిగలకే అధిక ప్రాధాన్యత
ప్రతి ప్రభుత్వ పథకంలోనూ మాదిగలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నేతలు ఓబులేసు, మరిదయ్యలు కమిషన్‌కు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే రుణాలు కూడా 82 యూనిట్లకుగాను 73 మాదిగలకే ఇచ్చారన్నారు. 2017లో ఎన్‌ఎస్‌కెఎఫ్‌డీసీ పథకం కింద 6 కార్లు వస్తే...అన్నీ మాదిగలకే ఇచ్చారన్నారు. ఇలా ప్రతి పథకంలో మాదిగలకే ప్రా«ధాన్యతనివ్వడం బాధాకరమని తెలిపారు. తక్షణం అధికారులతో చర్చించి మాలల హక్కులను కూడా కాపాడాలని కోరారు.
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
ఆరోగ్యశాఖలో పనిచేసే కాంట్రాక్టు, పార్టుటైం కింద చేస్తున్న 353 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రగత శీల పారిశుద్ధ్య కార్మికుల సంఘం నేతలు కల్లూరి చంగయ్య కమిషన్‌ను కోరారు.
అనారోగ్యమే శాపమైంది
2007లో ఆర్టీసీలో కండెక్టర్‌గా చేరిన తాను పక్షవాతముతో మంచాన పడ్డాననీ, ఆరోగ్యం కుదుట పడ్డా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవయవాలు సహకరించడం లేదని గుత్తికి చెందిన ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్ కమిషన్ ఎదుట వాపోయారు. అతికష్టమ్మీద ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాననీ, అయినా 13 నెలలుగా తనకు డ్యూటీ వేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని రెగ్యులర్‌గా డ్యూటీ వేయించాలని కోరారు. స్పందించిన కమిషన్ సభ్యులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీసీలుగా చిత్రీకరించారు
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో తనకున్న ఇంటిని బీడీల ఫ్యాక్టరీ యజమానికి తాకట్టు పెడితే... అతను మరొకరికి విక్రయించాడని తాడిపత్రికి చెందిన కాంతమ్మ వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే దాడి చేశారని కన్నీటిపర్యంతమైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే స్థానిక ఎమ్మార్వోకు డబ్బు ఆశ చూపి మేము ఎస్సీలము కాదని, బీసీలమని సర్టిఫికెట్లు పుట్టించారని కమిషన్ సభ్యులకు విన్నవించింది. స్పందించిన కమిషన్ సభ్యులు తహశీల్దార్‌తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
∙ఇక ఆర్టీసీలో 20 మంది నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఓబులేసు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదన్నారు. స్పందించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు.
∙పోలీసు శాఖలో 2003 హెచ్‌సీ, ఏఎస్‌ఐల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారని పోలీసు అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు శివానంద కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment