
హాస్టల్లో అన్నం తినలేకపోతున్నాం
అన్నం ముక్కిపోయిన వాసన వస్తోంది..
ఎస్సీ వసతి గృహ విద్యార్థుల ఆందోళన
నరసరావుపేటటౌన్: అన్నం ముక్కిపోయిన వాసన వస్తోంది.. కూరలూ అంతంత మాత్రమే..రోజూ ఈ సమస్యతో అన్నం తినలేకపోతున్నాం... అధికారులకు ఫిర్యాదు చేసినా.. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు.. ఇలానే ఉంటే చదువు ఆపి ఇళ్ళకు వెళ్సాల్సిందేనని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో పెడుతున్న భోజనం మెరుగు పరచాలంటూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ లింగంగుంట్ల ఎన్ఎస్పీ కార్యాలయ సమీపంలోని నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర హస్టల్ -1లో విద్యార్థులకు పెడుతున్న భోజనం నాసిరకంగా ఉందని తెలిపారు.
పల్నాడు ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాల నుంచి పట్టణంలోని పలు కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఆ హాస్టల్లో సుమారు 100మంది విద్యార్థులు ఉంటున్నారన్నారు. గత నెల జూన్ 22 హాస్టల్ పునఃప్రారంభమైనప్పటి నుంచి పెట్టే భోజనం, కూరలు నాసి రకంగా ఉండటంతో అల్లాడిపోతున్నామని చెప్పారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్, సూపర్వైజర్కు ఫిర్యాదు చేసినా ప్రయోజన ం లేదన్నారు. మెనూపై వార్డెన్ పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని విమర్శిస్తున్నారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు బెడద అధికంగా ఉందని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో మెరుగైన భోజన వసతి కల్పించాలని కోరారు.