సదాశివపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో రాత్రి స్టడీ అవర్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు(ఫైల్)
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ, వెనుకబడిన(బీసీ) తరగతుల అభివృద్ధి శాఖల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక మెనూ తయారు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
సదాశివపేట(సంగారెడ్డి): జిల్లాలో అన్ని శాఖల బాలుర, బాలికల వసతి గృహాలు ఎస్సీ 37, ఎస్టీ 10, బీసీ 22 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 713 మంది, ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాల్లో 170 మంది, బీసీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 362 మంది ఉన్నారు. విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలపై జిల్లా అధికారులు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అంతే కాకుండా తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక తరగతులు.. అల్పాహారం
పదో తరగతి విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద శాతం ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వసతి గృహాల సంక్షేమ అధికారులు పదోతరగతి విద్యార్ధుల కోసం రాత్రి 12 గంటల వరకు స్టడీ అవర్లను నిర్వహిస్తున్నారు. నీరస పడకుండా ఉండటానికి రాత్రి 10.30 అల్పాహారం, టీ అందజేస్తున్నారు. వీటీ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. సబ్జెక్టు నిపుణులను అందుబాటులో ఉంచారు. రాత్రి సమయంలో విద్యార్థులతో పాటు అధికారులు వసతి గృహాల్లో నిద్రించాలని నిర్ణయించారు.
విద్యార్థులపై పర్యవేక్షణ
మార్చి 19న పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులపై పర్యవేక్షణ పెంచడానికి వసతి గృహాల సంక్షేమ అధికారులు వారంలో రెండు సార్లు వసతి గృహంలో విద్యార్థులతో కలసి భోజనం చేసి అక్కడే నిద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వసతి గృహాల సంక్షేమాధికారులను సంబంధిత అధికారులు 100 శాతం ఫలితాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి సీ, డీ విభాగాలపై సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ఎక్కువ సమయం కేటాయించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
పదికి పది జీపీఏ సాధిస్తా
ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులకు వసతి గృహంలోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు చదివిస్తున్నారు. మధ్యలో స్నాక్స్, టీ ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధిస్తానని నమ్మకుముంది. – బి.రమేశ్, ఎస్సీ వసతి గృహం, సదాశివపేట
Comments
Please login to add a commentAdd a comment