బతుకు బుగ్గిపాలు | fire accident in SC colony rajam city | Sakshi
Sakshi News home page

బతుకు బుగ్గిపాలు

Published Wed, Oct 11 2017 7:35 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

fire accident in SC colony rajam city - Sakshi

మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అగ్నిదేవుని ఆగ్రహానికి నిరుపేదల ఇళ్లు బూడిదయ్యాయి. కాయకష్టంతో నిర్మించుకున్న పూరిగుడెసెలు కళ్లముందే మంటల్లో కాలిపోయాయి. తిండిగింజలు, కాస్తో కూస్తో సంపాదన, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. రాజాం నగరపంచాయతీ పరిధిలోని మెంటిపేట ఎస్సీకాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ నష్టం సంభవించింది.

శ్రీకాకుళం ,రాజాం సిటీ/రూరల్‌:  రాజాం నగరపంచాయతీ పరిధిలోని మెంటిపేట ఎస్సీకాలనీలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించడంతో 15 పూరిళ్లు చూస్తుండగా అగ్నికి ఆహుతయ్యాయి. ముందుగా రాగోలు మహేష్‌ ఇంటి వద్ద మంటలు చెలరేగినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో మహేష్‌ ఇంట్లో ఆయన భార్య విమలతో పాటు పిల్లలు ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన విమల ప్రమాదాన్ని గుర్తించి ఇంట్లో ఉన్న తన పిల్లలతో సహా బయటకు వచ్చేసింది. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయి మంటలు పెద్దవయ్యాయి. వీటికి గాలి తోడవడంతో పక్కనున్న మరో 14 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. మంటలను అదుపుచేసేందుకు ఎవరూ ప్రయత్నించలేని పరిస్థితి సంఘటనా స్థలం వద్ద చోటుచేసుకుంది.

పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ ఘటనలో తోలేటి దుర్గారావు, బెనెల ప్రభ, మాణిక్యం రమణ, తోట పోలయ్య, ఎర్రవరపు రత్న, మర్రి కుమార్, యందవ రమేష్, చల్లా కళావతి, తోట చిన్న, యందవ మారతమ్మ, రాగోలు మహేష్, కుప్పిలి రాజారావు, సిరిపురపు వెంకటి, యందవ ప్రతాప్, కుప్పిలి శంకరరావుకు చెందిన పూరిళ్లు మొత్తం కాలిపోయాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇళ్లన్నీ బూడిదయ్యాయి.

ఎమ్మెల్యే జోగులు ఆరా
ఈ సంఘటనపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరాతీశారు. హైదరాబాద్‌ వెళుతున్న ఆయన ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, యూత్‌ కన్వీనర్‌ వంజరాపు విజయ్‌కుమార్‌ ద్వారా వివరాలు సేకరించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. మరోవైపు రాజాం తహసీల్దార్‌ వై.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల ఒక్కో ఇంటికి రూ. 10 కిలోల బియ్యాన్ని అందించారు. నగరపంచాయతీ కమిషనర్‌ బి.రాముతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.

పెళ్లైన మూడోరోజునే...
ఇదిలా ఉండగా తోట పోలయ్య తన కుమార్తె సీతకు రాజాంకు చెందిన యందవ గణపతితో ఈ నెల 8వ తేదీన పెళ్లిచేశాడు. పెళ్లి సందడి ఇంకా ముగియకముందే సారె సామగ్రి అత్తారింటికి సిద్ధం చేసే సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో మొత్తం కాలిబూడిదైందని పోలయ్య లబోదిబోమంటున్నాడు. అల్లుడు మొదటిసారిగా ఇంటికి వచ్చిన ఆనందం కూడా వారిలో మిగలకుండా ఆవిరైపోయింది. అలాగే తోలేటి కుమారి కుమార్తె వివాహ నిమిత్తం సిద్ధం చేసిన రూ. 40 వేలు నగదు కాలిపోవడంతో వారి ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఇలా ప్రతి ఇంట్లోను నష్టం తీవ్రంగా జరగడంతో బాధితుల రోదన మిన్నంటింది.

బాధితులంతా కూలీలే
అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన వారంతా రోజు కూలీలే. ఉదయాన్నే రాజాంలోని పలు ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుతుంటారు. వచ్చిన కాస్తోకూస్తో కూలి డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా పనులకు వెళ్లిన వీరు తమ ఇళ్లు కాలిపోతున్నాయని తెలుసుకుని పరుగులంకెంచుకుంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే వీరి గుడిసెలు మొత్తం కాలిపోయి బుగ్గిమాత్రమే మిగిలింది. నగరపంచాయతీలో పక్కా ఇళ్ల నిర్మాణాలు లేకపోవడంతో పూరిగుడెసెలే వీరికి గత్యంతరంగా మారాయి. తొమ్మిది నెలల క్రితం రాజాం వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు రాజాంలో ఇళ్ల నిర్మాణాలు జరిపి పేదలకు ఇస్తామని హామీ ఇవ్వగా ఆశతో చూసిన వీరికి నిరాశే మిగిలింది. కనీసం ఎన్‌టీఆర్‌ స్వగృహ కూడా వీరికి మంజూరు కాలేదు.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోవడంతో బాధితులు నిలువ నీడలేక బిక్కమొహాలతో దిక్కులు చూస్తున్నారు. ఆదుకునే నాథుడు కోసం అర్రులు చాస్తున్నారు. ఎవరి పంచలో తలదాచుకునేదిరా దేవుడా అంటూ రోదిస్తున్నారు. అగ్నిదేవుడు మాపై ఎందుకింత కక్షసాధించాడో అర్ధంకావడంలేదంటూ నిందిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు  స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement