లక్నో : అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనారిటీ సంస్థ కాదని, అడ్మిషన్లలో ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్ధులకు ఎందుకు రిజర్వేషన్లు వర్తింపచేయడం లేదని యూపీ ఎస్‌సీ,ఎస్‌టీ కమిషన్ బుధవారం వర్సిటీని ప్రశ్నించింది. దీనిపై వివరణను కోరుతూ ఆగస్ట్ 8లోగా బదులివ్వాలని ఏఎంయూకు కమిషన్ నోటీసు జారీ చేసింది. ఏఎంయూలో ప్రవేశాలకు దళితుల కోటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ వర్సిటీకి తాను నోటీసు జారీ చేశానని యూపీ ఎస్‌సీ,ఎస్‌టి కమిషన్ బ్రిజల్ వెల్లడించారు.
వచ్చేనెల 8లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోరానని తెలిపారు. ఏ ప్రాతిపదికన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రయోజనాలను అందించడం లేదని తాము కోరామని, రిజర్వేషన్ల ప్రయోజనాలకు నిరాకరించాలని ఏఎంయూను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇప్పటివరకూ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని అన్నారు.
ఏఎంయూ ఇతర వర్సిటీల తరహాలోనే కేంద్ర చట్టం కింద సెంట్రల్ యూనివర్సిటీయేనని, కోటాను వర్సిటీ అమలుపరచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఏఎంయూ తమ నోటీసుకు స్పందించని పక్షంలో తమ అధికారాలను ఉపయోగించి చర్యలు చేపడతామని, అవసరమైతే సమన్లు జారీ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment