AMU
-
మ్యూచువల్ ఫండ్ నిధుల్లో 4 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోలి్చతే 4% వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్ స్కీమ్‌లలో పెట్టుబడుల జోరుతో ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. దీనిలో లిక్విడ్ ఫండ్స్ వాటా రూ.79,000 కోట్లు. ఓపెన్–ఎండ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.9,152 కోట్లు చేరినట్లు తెలిపింది. అయితే, క్లోజ్–ఎండ్ ఈక్విటీ పథకాల నుంచి రూ.62 కోట్ల ఉపసంహరణ నమోదైంది. -
మోదీపై అభ్యంతరకర పోస్ట్ : విద్యార్థి అరెస్ట్
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై ఫేస్బుక్ పేజ్‌లో అభ్యంతరకర పోస్టర్‌ను ప్రదర్శించిన అలీగఢ్ ముస్లిం వర్సిటీ (ఏఎంయూ) విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఎఫ్బీలో పోస్ట్ చేసిన ఏఎంయూ విద్యార్థి మహ్మద్ జైద్ రషీద్ (20)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రషీద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఏఎంయూ పూర్వ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారులు, పోలీసులు ఈ ఉదంతంపై ఆరా తీయగా సదరు విద్యార్థి బిహార్‌లోని వర్సిటీ స్టడీ సెంటర్లో ఇటీవల అడ్మిషన్ తీసుకున్నట్టు వెల్లడైంది. అలీగఢ్ క్యాంపస్‌తో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఏఎంయూ ప్రతినిధి షైఫీ కిద్వాయ్ స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే దీనిపై తాము తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, నిందితుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని సీనియర్ ఎస్పీ ఆకాష్ కుల్హరి తెలిపారు. -
యోగా వద్దంటున్న ఏఎంయూ విద్యార్థులు
లక్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశమంతా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే యూపీలో మాత్రం ఇందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు యోగా వేడుకలను వ్యతిరేకిస్తున్నారు. ఒక్కరోజు యోగా చేసినంత మాత్రాన ప్రజలు ఆరోగ్యవంతులైపోతారా అంటూ విమర్శించారు. అలాగే అబ్బాయిలు, అమ్మాయిలకు విడివిడిగా కాకుండా ఒకే చోట యోగా చేసేలా ఏర్పాట్లు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఫైజల్ హస్సన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం యోగా చేసేందుకు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇస్లాంలో మేము ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తామని, అది కూడా యోగాలాంటిదేనని అన్నారు. నిజంగా యాజమాన్యానికి అంత శ్రద్ధ ఉండుంటే యోగా తరగతులను సంవత్సరం పాటు పెట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. ఏఎంయూ కోర్ట్ మెంబర్ షఫికుర్‌మాన్ ఖాన్ మాట్లాడుతూ .. యోగా పాఠ్యాంశాల్లో భాగమైతే దాన్ని స్వాగతిస్తామని.. ఇలా బలవంతంగా వేడుకలు జరిపితే దానికి తాము ఒప్పుకోమన్నారు. యోగా దినోత్సవానికి కూడా మతం రంగు పులమడం దురదృష్టకరమన్నారు. వర్సిటీ ప్రతినిధి షపీ కిద్వాయ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో వారం రోజలుపాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. యోగాడే కోసం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోగా లేనిది.. యోగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ వివాదంపై ఏఎంయూ అధికారులు స్పందిస్తూ యోగా వేడుకలు ఇప్పుడు కొత్తగా జరగట్లేదని, 2015 నుంచి వేడుకలను కొనసాగిస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థులకు యోగా నిపుణులతో పాఠాలు చెప్పించడమే కాక వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. -
ఉగ్రదాడిపై అభ్యంతరకర ట్వీట్
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్లో చేసిన పోస్ట్‌పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఏఎంయూలో దళితుల కోటాపై..
లక్నో : అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనారిటీ సంస్థ కాదని, అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఎందుకు రిజర్వేషన్లు వర్తింపచేయడం లేదని యూపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ బుధవారం వర్సిటీని ప్రశ్నించింది. దీనిపై వివరణను కోరుతూ ఆగస్ట్ 8లోగా బదులివ్వాలని ఏఎంయూకు కమిషన్ నోటీసు జారీ చేసింది. ఏఎంయూలో ప్రవేశాలకు దళితుల కోటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ వర్సిటీకి తాను నోటీసు జారీ చేశానని యూపీ ఎస్సీ,ఎస్టి కమిషన్ బ్రిజల్ వెల్లడించారు. వచ్చేనెల 8లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోరానని తెలిపారు. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రయోజనాలను అందించడం లేదని తాము కోరామని, రిజర్వేషన్ల ప్రయోజనాలకు నిరాకరించాలని ఏఎంయూను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇప్పటివరకూ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని అన్నారు. ఏఎంయూ ఇతర వర్సిటీల తరహాలోనే కేంద్ర చట్టం కింద సెంట్రల్ యూనివర్సిటీయేనని, కోటాను వర్సిటీ అమలుపరచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఏఎంయూ తమ నోటీసుకు స్పందించని పక్షంలో తమ అధికారాలను ఉపయోగించి చర్యలు చేపడతామని, అవసరమైతే సమన్లు జారీ చేస్తామని తెలిపారు. -
‘జిన్నా ఫోటోతో వివాదానికి సంబంధం లేదు’
లక్నో: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో రగడపై వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ వివరణ ఇచ్చారు. వర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం ఓ అంశం కాదని, 1938 నుంచి ఏఎంయూలో జిన్నా ఫోటో ఉందని స్పష్టం చేశారు. ఈ వివాదంతో యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మే 2న వర్సిటీ క్యాంపస్‌లోకి ఇతరులు వచ్చి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసినందుకే విద్యార్థులు నిరసనలు చేపట్టారన్నారు. క్యాంపస్‌లోకి ఇతరులు ప్రవేశించి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో ఆయన కార్యక్రమం రద్దయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని చెప్పారు. విద్యార్థులు ఈ అంశాల మీద దృష్టిసారించకుండా పరీక్షలకు సంసిద్ధం కావాలని వీసీ సూచించారు. యూనివర్సిటీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను సాకుగా తీసుకుని కొన్ని న్యూస్ ఛానెల్స్ అర్థ సత్యాలతో వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వర్సిటీ వర్గాలు ఆరోపించాయి. -
జిన్నా ఫొటో.. 94 ఏళ్ల పూర్వ విద్యార్థి స్పందన
అలీగఢ్ : మెహమ్మద్ అలీ జిన్నా ఫొటో వివాదంపై అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఒకరు స్పందించారు. 94 ఏళ్ల రియజ్-ఉర్-షర్వాణీ ఏఎంయూలోని జిన్నా వివాదంపై మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ హాల్లో ఉన్న ఫొటోలు విద్యార్థులకు సంబంధించిన విషయమని అందులో ఇతరులు తల దూర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే జిన్నాను, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో షర్వాణీ ముందు వరుసలో ఉంటారు. కానీ యూనివర్సిటీ జీవిత కాల సభ్యుడైన జిన్నా ఫొటోపై పూర్తి అధికారం విద్యార్థులదే అంటున్నారు. 1938లో జిన్నా యూనివర్సిటీ జీవిత కాల సభ్యత్వం పొందారు. జిన్నా ఫొటోను యూనివర్సిటీలోని విద్యార్ధి యూనియన్ హాల్లో పెట్టినప్పుడు దేశంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. యూనియన్ హాల్లో ఏం పెట్టాలనే విషయాన్ని బయటి వ్యక్తులు నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. అప్పటి ప్రో వైస్ ఛాన్స్లర్ ఏబీ హబిబ్ యూనివర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారని, ఆ మీటింగ్‌కు ఆయన హాజరైనట్టు తెలిపారు. ఇది విద్యార్థుల వ్యక్తిగత విషయం అని అభిప్రాయపడ్డారు. 1938లో యూనియన్ నియమ నిబంధనలు వేరేగా ఉండేవని, అప్పటి విద్యార్ధి యూనియన్‌కు అధ్యక్షుడిగా ప్రో వైస్ ఛాన్స్లర్ ఉండేవారని అన్నారు. ఉపాధ్యక్షుడ్ని విద్యార్థులు ఎన్నుకునేవారని తెలిపారు. అప్పుడు జరిగిన అన్ని విషయాలు తనకు గుర్తులేకున్నప్పుటికి కొన్ని మాత్రం బాగా గుర్తున్నాయని అన్నారు. జిన్నా ఎప్పుడు వర్సిటీకి వచ్చిన ఆయన ప్రసంగాలను వినేందుకు చాలా మంది ఆయన చుట్టు చేరేవారని, కానీ అందురూ ఆయన భావాలతో ఏకిభవించేవారు కాదని పేర్కొన్నారు. ఏఎంయూ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన షర్వాణీ, అదే వర్సిటీలో అరబిక్ ప్రొఫెసర్‌గా పని చేసి పదవి విరమణ పొందారు. ఈ వివాదంపై మరో పూర్వ విద్యార్థి 83 ఏళ్ల అమర్జిత్ సింగ్ బింద్రా స్పందిస్తూ.. జిన్నా చిత్రపటంపై కావలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పటి రోజులన్ని నాకు గుర్తున్నాయి. నిజం ఏంటంటే యూనియన్ హాలో చాలా మంది ఫొటోలు ఉన్నాయని అందులో జిన్నా ఫొటొ కూడా ఉందని అందులో తప్పేముందని అన్నారు. నేను దాన్ని చూస్తూ ఉండేవాడ్ని అన్ని అప్పటి రోజులను గుర్తుచేస్తుకున్నారు. -
జిన్నా ఫొటోను కాల్చినా, చించినా లక్ష నజరానా
అలీగఢ్ : మహమ్మద్ అలీ జిన్నా చిత్రపట వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న జిన్నా చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా ముస్లిం మహాసంఘ్ అధ్యక్షుడు ఫర్హత్ అలీఖాన్ డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా జిన్నా ఫొటోలను కాల్చినా, చించినా వారికి ఏకంగా రూ. లక్ష బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. దేశాన్ని పాకిస్తాన్, హిందూస్తాన్‌గా విడగొట్టిన వ్యక్తి ఫొటోలను ఎందుకు ఉంచుకోవాలని అన్నారు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వ కార్యాలయంలోగాని, యూనివర్సిటీల్లోగాని అఖండ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మన నాయకులు గాంధీ, నెహ్రుల చిత్రపటాలను ఉంచారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మనం ఎందుకు జిన్నా చిత్రపటాన్ని ఉంచాలని అన్నారు. దేశంలోని అందరూ జిన్నా ఫొటోను కాల్చినా, చించినా వారికి రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తామని వెల్లడించారు. అయితే ఈ వివాదాన్ని మొదట బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోని సూడెంట్స్ యూనియన్ హాల్లో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీ ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. దీనిపై యూనివర్సిటీ వీసీ వివరణ ఇస్తూ.. యూనివర్సిటీ స్థాపనకు నిధులు దానం చేసిన వారిలో జిన్నా ఒకరని, అందుకే ఆయన చిత్రపటాన్ని ఉంచామని, ఆయనతోపాటు గాంధీ, నెహ్రు లాంటి మహా నాయకుల చిత్రపటాలను కూడా ఉన్నాయని తెలిపారు. -
జిన్హ్నా ఫొటోను కాల్చినా, చించినా భారీ నజరానా
-
ఏఎంయూలో జిన్నా ఫోటోపై రగడ
సాక్షి, లక్నో : అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో మహ్మద్ జిన్నా చిత్రపటంపై వివాదం రాజుకుంది. విద్యార్థి సంఘ కార్యాలయంలో జిన్నా ఫోటో ఉండటంపై వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోను తొలగించేందుకు విద్యార్థి నేతలు అంగీకరించలేదు. తమపై పోలీసుల చర్యకు నిరసనగా తరగతులు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపు ఇచ్చారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో రెండు రోజుల పాటు వర్సిటీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారు. చరిత్రలో భాగం అయినందునే జిన్నా చిత్రపటాన్ని తాము తొలగించబోమని విద్యార్ధులు స్పష్టం చేశారు. జిన్నా తమకు స్ఫూర్తిప్రదాత కాకున్నా భారత చరిత్రలో ఆయన ఒక భాగమని వారు చెబుతున్నారు. అన్సారీ పర్యటన నేపథ్యంలో వర్సిటీలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు అసంతృప్తివవ్యక్తం చేశారు. కాగా జిన్నా చిత్రపటం వివాదంపై జరిగిన ఘర్షణల్లో 40 మంది విద్యార్థులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.ఏఎంయూలో జిన్నా చిత్రపటం ఉంచడాన్ని హిందూ యువ వాహిని కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. -
'మీ తిట్లు మర్చిపోలేదు.. సారీ చెప్పండి'
సాక్షి, లక్నో : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. గతంలో ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే తమ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాలంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) యూనియన్‌కు చెందిన ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ డిమాండ్ చేశారు. 'గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడమో లేకుంటే కాన్వకేషన్ కార్యక్రమానికి గైర్హాజరు కావడమో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ నిర్ణయించుకోవాలి. గతంలో ఆయన అన్నమాటలు ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి ఇంకా గుర్తున్నాయి. మా మాటలు లెక్కచేయకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత మాది కాదు' అని సజ్జాద్ అన్నారు. 2010లో రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ సమయంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మతాల వారికి, భాషలపరంగా మైనార్టీలుగా ఉన్నవారికి 15శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీల్లో కలపాలని సలహా ఇచ్చారు. అయితే, దీనిపై బీజేపీ తరుపున స్పందించిన రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలను, క్రిస్టియన్లను ఎలా ఎస్సీల్లో చేరుస్తారని, వారంతా భారత్‌కు ఏలియన్స్లాంటి వారని అన్నారు. అయితే, ఏఎంయూలో మార్చి7న జరగనున్న కాన్వకేషన్ కార్యక్రమానికి రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను క్షమాపణలు చెప్పాకే రావాలంటూ విద్యార్థి సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతం. యూపీలోని మిగతా జిల్లాల్లో విడుదలైనా.. అలీగఢ్‌లో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇందుకు కారణం ఈ సినిమా టైటిలే కాదు.. ఇందులోని నేపథ్యం కూడా. డైరెక్టర్ హన్సల్ మొహతా వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఈ సినిమా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడనే నెపంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఏడేళ్ల కిందట సస్పెండ్ చేశారు. ఏఎంయూలోని తన నివాసంలో ఓ రిక్షా కార్మికుడితో ఆయన స్వలింగ సంపర్కం జరుపుతుండగా స్థానిక జర్నలిస్టులు అనుమానాస్పద స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తప్పుడు ప్రవర్తన కింద వర్సిటీ ఆయనపై వేటు వేసింది. తన సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సిరాస్ ఆ తర్వాత వారం రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెండితెరకు మీదకు తెచ్చిన ఈ సినిమాపై అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు, కొన్ని సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీని తప్పుడురీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని, ఈ సినిమా టైటిల్ ను వెంటనే మార్చాలని ఏఎంయూ విద్యార్థులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.