
ఏఎంయూలో జిన్నా చిత్రపటం వివాదంపై వీసీ వివరణ
లక్నో: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో రగడపై వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ వివరణ ఇచ్చారు. వర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం ఓ అంశం కాదని, 1938 నుంచి ఏఎంయూలో జిన్నా ఫోటో ఉందని స్పష్టం చేశారు. ఈ వివాదంతో యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మే 2న వర్సిటీ క్యాంపస్‌లోకి ఇతరులు వచ్చి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసినందుకే విద్యార్థులు నిరసనలు చేపట్టారన్నారు.
క్యాంపస్‌లోకి ఇతరులు ప్రవేశించి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో ఆయన కార్యక్రమం రద్దయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని చెప్పారు. విద్యార్థులు ఈ అంశాల మీద దృష్టిసారించకుండా పరీక్షలకు సంసిద్ధం కావాలని వీసీ సూచించారు. యూనివర్సిటీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను సాకుగా తీసుకుని కొన్ని న్యూస్ ఛానెల్స్ అర్థ సత్యాలతో వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వర్సిటీ వర్గాలు ఆరోపించాయి.