
సాక్షి, లక్నో : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. గతంలో ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే తమ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాలంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) యూనియన్‌కు చెందిన ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ డిమాండ్ చేశారు. 'గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడమో లేకుంటే కాన్వకేషన్ కార్యక్రమానికి గైర్హాజరు కావడమో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ నిర్ణయించుకోవాలి. గతంలో ఆయన అన్నమాటలు ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి ఇంకా గుర్తున్నాయి. మా మాటలు లెక్కచేయకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత మాది కాదు' అని సజ్జాద్ అన్నారు.
2010లో రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ సమయంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మతాల వారికి, భాషలపరంగా మైనార్టీలుగా ఉన్నవారికి 15శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీల్లో కలపాలని సలహా ఇచ్చారు. అయితే, దీనిపై బీజేపీ తరుపున స్పందించిన రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలను, క్రిస్టియన్లను ఎలా ఎస్సీల్లో చేరుస్తారని, వారంతా భారత్‌కు ఏలియన్స్‌లాంటి వారని అన్నారు. అయితే, ఏఎంయూలో మార్చి7న జరగనున్న కాన్వకేషన్ కార్యక్రమానికి రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను క్షమాపణలు చెప్పాకే రావాలంటూ విద్యార్థి సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.