- బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రతినిధి బృందం
- బృందంలో కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి, కాకి మాధవరావు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పద్దు కింద కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూసేందుకు కేంద్రం తగిన చట్టాన్ని రూపొందించేలా చూడాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీఎస్) ప్రతినిధి బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లను వేర్వేరుగా కలసి విన్నవించింది. సీడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, సలహాదారులు ప్రముఖ పాత్రికేయులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కొండుభట్ల రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, కేంద్ర మాజీ కార్యదర్శి పి.ఎస్.కృష్ణన్‌లతో కూడిన బృందం అమిత్‌షా, రాంమాధవ్‌లకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయని, వాటిని ఆచరణలో పెట్టేలా చట్టం చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మేరకు చట్టం చేశాయని, కేంద్రం కూడా ఇదే తరహా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇటీవలి బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించాల్సిన నిధుల్లో దాదాపు 60 శాతం కోత పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమిత్‌షా బదులిస్తూ పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇస్తున్నామని, ఈ నిధుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 25 శాతం మేర నిధులను పక్కాగా ఖర్చు చేయాలని రాష్ట్రాలకు త్వరలోనే కేంద్రం తగిన సూచనలు జారీ చేస్తుందని వివరించారు. ప్రధానంగా ప్రాథమిక, ఉన్నత విద్యకు, ఉపాధికి ఖర్చు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధికి నోచుకుంటారని ఈ బృందం వివరించింది. ఇది సాకారం కావాలంటే ఉప ప్రణాళిక నిధులు కచ్చితంగా ఖర్చయ్యేలా, నిధుల మళ్లింపు లేకుండా చేసేలా ఒక చట్టం తేవాలని కోరింది. తమ అభ్యర్థనపై వారు సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం మీడియాకు వివరించింది.