బీజేపీకి తిరుగులేదు | BJP Win 2019, Rule For 50 Years | Sakshi
Sakshi News home page

బీజేపీకి తిరుగులేదు

Published Mon, Sep 10 2018 2:28 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

BJP Win 2019, Rule For 50 Years - Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ, అమిత్‌ షా

న్యూఢిల్లీ:  2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. బీజేపీకి ఎదురు లేదని, ‘అజేయ భారత్‌.. సుదృఢ బీజేపీ’ తమ నినాదమని స్పష్టం చేశారు. ‘విపక్షానికి ఒక నాయకుడు లేడు.. ఒక సిద్ధాంతం లేదు.. వాళ్ల విధానాలు అస్పష్టం. ఆలోచనలు అవినీతి మయం’ అంటూ విపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కూటమిగా ఏర్పడాలనుకున్న విపక్ష పార్టీల్లోనే ఐక్యత లేదని, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదని విమర్శించారు. ‘విజయంపై విశ్వాసంతో మన ప్రయాణం ప్రారంభించాం. 125 కోట్ల భారతీయుల నమ్మకం మనపై ఉంది’ అని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పార్టీ శ్రేణులనుద్దేశించి మోదీ ప్రసంగించారు.

అందుకే రోజుకో అబద్ధం
‘కాంగ్రెస్‌ పార్టీకి సిద్ధాంతం లేదు. ఓ నాయకుడు లేడు. అవినీతి ఆలోచనలు, అస్పష్ట విధానాలతో ఉన్న కాంగ్రెస్‌లో సమన్వయం అంతకన్నా లేదు’ అని ప్రధాని అన్నారు. ‘2019 ఎన్నికల్లో విపక్షాల నుంచి మనకు ఎలాంటి ఎదురూ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు విపక్షంగానూ విఫలమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వస్తున్న ఆదరణ, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ నినాదంతో జరుగుతున్న పనులు బీజేపీకి మరోసారి ఘన విజయాన్ని కట్టబెడతాయి’ అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

విపక్షాలు, ఆ పార్టీల సిద్ధాంతాలు, విధానాలు ఎప్పుడూ బీజేపీకి సవాల్‌ విసరలేవని.. అందుకే రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘అభివృద్ధిపై చర్చకు వస్తే.. ఆ కుటుంబం 48 ఏళ్ల పాలనలో ఏం చేసింది? 48 నెలల పాలనలో బీజేపీ ఏంచేసిందనే విషయం తేలిపోతుంది. బీజేపీ కార్యకర్తలారా.. వాస్తవాలను ప్రజల ముందుంచుతూ విపక్షాల కుట్రలను తిప్పికొట్టండి’ అని మోదీ పిలుపునిచ్చారు. బ్యాంకులు, గనుల జాతీయీకరణ చేశామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌.. సంస్కరణల పేరుతో దోపిడీకి పాల్పడిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ చేపట్టిన పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను మోదీ ప్రస్తావించారు.  

విపక్షాలవి పగటి కలలు
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే.. పగటి కలలుకంటున్న విపక్షాల మధ్య వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని బీజేపీ పేర్కొంది. మోదీ నేతృత్వానికి దేశంలో 70% మంది ఆమోదం తెలిపారని.. 2022 కల్లా నవభారత నిర్మాణం తథ్యమని అభిప్రాయపడింది.  ‘పేదరిక నిర్మూలన, ఇళ్లు లేనివారే ఉండకూడదనే సంకల్పంతోపాటు కుల, మత, అవినీతి, ఉగ్రవాద రహిత దేశంతోపాటు సుస్థిర భారత్‌ నిర్మాణానికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు’ అని రాజకీయ తీర్మానంలో పేర్కొంది.

అంతర్గత భద్రతపై చేసిన తీర్మానంలో బీజేపీ పాలన కారణంగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలాచోట్ల సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేసిన విషయాన్ని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొల్పడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని.. పార్టీ ప్రయోజనాలకన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని ఈ రాష్ట్రంపై చేసిన మరో తీర్మానంలో పేర్కొన్నారు. జీఎస్టీతో ఆదాయం పెరిగిందని, ప్రజల ఇబ్బందులు కూడా రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆర్థిక తీర్మానంలో పేర్కొన్నారు. భారత్‌ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయాన్ని ప్రస్తావించారు.

కార్యకర్తలే బలం: షా
2019 ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని పార్టీ చీఫ్‌ అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మరో 50 ఏళ్లపాటు దేశంలో బీజేపీ పాలనే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలే తమకు అఖండ విజయాన్ని కట్టబెడతాయన్నారు. 9 కోట్ల మంది కార్యకర్తలే బీజేపీ బలమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాటి సమావేశం వివరాలను మోదీ, అమిత్‌ షాల ప్రసంగం విశేషాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. బీజేపీ విజయానికి కార్యకర్తలు కష్టించి పనిచేయాలని.. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని షా పేర్కొన్నట్లు ప్రసాద్‌ తెలిపారు. 2014 నుంచి 300కు పైగా నియోజకవర్గాల్లో మోదీ పర్యటించారని.. మిగిలిన వాటినీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే పూర్తిచేస్తారని షా వెల్లడించారు. దేశాన్ని అక్రమ చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement