భార్య, కుమారుడిని ఊరికి పంపి.. | man died in Kukkadam | Sakshi
Sakshi News home page

భార్య, కుమారుడిని ఊరికి పంపి..

Mar 29 2015 2:16 AM | Updated on Jul 24 2018 2:22 PM

వేములపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన పుట్ట కృష్ణ(42),పద్మ దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

వేములపల్లి : వేములపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన పుట్ట కృష్ణ(42),పద్మ దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు నాగరాజు మిర్యాలగూడలో డిగ్రీ చదువుతుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కాగా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కుక్కడం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున తన భార్య పద్మను పోటీలో నిలిపాడు. ఎన్నికల్లో గెలిచేందుకు అందరి మద్దతు కూడగట్టుకున్నాడు. అందుకోసం తెలిసిన వారి వద్ద రూ. లక్షలు అప్పు చేశాడు. గెలుపే ధ్యేయంగా ముందుకు సాగి ఎన్నికల్లో విజయం సాధించాడు.
 
 కాలం కలిసిరాక..
 కృష్ణ తనకున్న ఐదు ఎకరాల భూమితో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగు చేశాడు. పెట్టుబడుల కోసం కొంత అప్పు చేశాడు. ఎన్నికలకు, వ్యవసాయసాగుకు చేసిన అప్పు మొత్తం రూ. 6 లక్షల వరకు ఉంది. సాగు చేసిన పత్తిపంట దిగుబడి ఆశించిన మేరకు రాలేదు. దీనికి తోడు ఇటీవల అప్పుల వారి వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. తెలిసిన వారి వద్ద మళ్లీ అప్పు చేసి డబ్బులు సర్ధేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ శనివారం డబ్బులు తీసుకురమ్మని పెద్దకుమారుడు నాగరాజును  భార్య పద్మను సూర్యాపేట మండలం రాయినిగూడెం పంపించాడు. అనంతరం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్క యువకుడు సైకిల్ కోసం వెళ్లగా కృష్ణ వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆ యువకుడు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. కృష్ణను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు  ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement