కొత్త గురుకులాలకు ఓకే | state governament ok to sc gurukuls | Sakshi
Sakshi News home page

కొత్త గురుకులాలకు ఓకే

Published Sat, Jun 4 2016 2:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

కొత్త గురుకులాలకు ఓకే - Sakshi

కొత్త గురుకులాలకు ఓకే

103 ఎస్‌సీ గురుకులాలు, 30 మహిళా రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు
పాలనాపరమైన మంజూరుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ప్రారంభించనున్న కొత్త ఎస్సీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 103 ఎస్సీ గురుకుల పాఠశాలలు(బాలురు, బాలికలు), 30 ఎస్సీ మహిళా రెసిడెన్షి యల్ డిగ్రీ కాలేజీలకు పాలనాపరమైన మం జూరునిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శకాలను కూడా పొందుపరిచింది. ప్రవేశాల సరళి, రిజర్వేషన్ల విధానం, కావాల్సిన బడ్జెట్, ఏయే జిల్లాల్లో ఎన్ని పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్న అంశాలపై స్పష్టతనిచ్చింది. ఇప్పటికే 134 విద్యాసంస్థలను విజ యవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలోనే కొత్త గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలను నిర్వహించనున్నట్లు పేర్కొం ది. ఈ మేరకు జూన్ 2న ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేదత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అణగారిన వర్గాల కోసం ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 ప్రవేశాలు ఇలా...
ముందుగా 2016-17లో ఒక్కో పాఠశాలలో 5, 6, 7 తరగతుల్లో (రెండు సెక్షన్ల చొప్పున), ఒక్కో క్లాసులో 40మంది చొప్పున 240మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 103 స్కూళ్లు కలుపుకుని 24,720 మందికి ప్రవేశం ఉంటుంది. 2017-18 నుంచి ఒక్కో క్లాస్ అంటే 8వ తరగతి, ఆ తర్వాతి ఏడాది 9వ తరగతి, ఆ తర్వాత 10, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 2019-20 నాటికి ఈ విద్యార్థుల సంఖ్య 65,920 కు చేరుకుంటుంది.

 రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలు ఇలా...
ఈ పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 12 శాతం, మైనారిటీలకు 3 శాతం, ఓసీ/ఈబీసీలకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. గురుకులాల్లో కేటరింగ్ సర్వీసెస్, ఊడ్వడం, శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసులను ఔట్‌సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. 103 రెసిడెన్షియల్ స్కూళ్లకు జీతాలు, భవనాల అద్దెలు, విద్యార్థుల ఖర్చులు, మెయింటెనెన్స్, సివిల్ వర్క్స్, మౌలిక సదుపాయాల కోసం 2016-17లో రూ.605కోట్లు, ఆ తర్వా త మూడేళ్లకు కలుపుకుని రూ.3,090 కోట్లు ఖర్చు అవుతుందనేది అధికారుల అంచనా.

 రెసిడెన్షియల్ పద్ధతిలో డిగ్రీ కాలేజీలు
ఎస్సీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే 116 విద్యాసంస్థలను ఇంటర్మీడియట్ కోసం అప్‌గ్రేడ్ చేశారు. వీటిల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, కొన్ని వొకేషనల్ కోర్సులను ప్రతి ఏడాది 9 వేల మంది విద్యార్థులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివించేందుకు పేద తల్లితండ్రులకు ఆర్థికస్థోమత లేకపోవడంతో వారు డిగ్రీ కోర్సులు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం ఎస్సీ డిగ్రీ కాలేజీలను పూర్తి రెసిడెన్షియల్ పద్ధతిలో ఉచిత వసతి, భోజనం, ఇతర వసతులు కల్పిస్తూ నిర్వహించనున్నారు.

ఈ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థినుల చొప్పున 7 కోర్సులను ప్రారంభించాలని ప్రతిపాదించారు. బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(ఎంఎస్‌సీఎస్), బీఎస్సీ(బీజెడ్‌సీ), బీఎస్సీ(జెడ్‌ఎంసీ), బీఏ (హెచ్‌ఈపీ), బి.కాం(జనరల్), బి.కాం (కంప్యూటర్స్) కోర్సుల్లో 2016-17లో ఒక్కో కాలేజీలో 280 మంది చొప్పున 30 కాలేజీల్లో 8,400 మందికి ప్రవేశం కల్పిస్తారు. 2017-18లో 16,800 మంది, 2018-19 నాటికి మొత్తం విద్యార్థినుల సంఖ్య 25,200కు చేరుకుంటుందని వివరించారు. ఈ కాలేజీల కోసం జీతాలు, ఇతర అంశాలను కలుపుకుని 2016-17లో రూ.258.54 కోట్లు, 2017-19 లకు దాదాపు రూ.1118.10 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

ఎస్సీ గురుకుల పాఠశాలలివే...
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో బాలికలకు 57,బాలురకు46ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement