
ఎస్సీ శాఖ కార్యదర్శి పీఎస్ వేధిస్తున్నారు
ఎస్సీ శాఖ కార్యదర్శి పీఎస్ తమను వేధిస్తున్నారంటూ నాలుగో తరగతి, ఇతర ఉద్యోగులు ఆందోళనకు దిగడం బుధవారం సచివాలయంలో
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ శాఖ కార్యదర్శి పీఎస్ తమను వేధిస్తున్నారంటూ నాలుగో తరగతి, ఇతర ఉద్యోగులు ఆందోళనకు దిగడం బుధవారం సచివాలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయం డి-బ్లాక్‌లోని ఎసీసీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా చాంబర్‌కు వెళ్లిన పలువురు ఎస్సీ,ఇతర సచివాలయ శాఖల ఉద్యోగులు ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారు. శ్రీనివాసరావును కుర్చీలోంచి లాగేసి, తమ వెంట బలవంతంగా ఎస్సీ శాఖ అదనపు కార్యదర్శి రాజసులోచన దగ్గరకు తీసుకెళ్లారు. పీఎస్‌ది ఏపీ అయినందువల్లే తమను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.
6 నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. అటెండెన్స్ రిజిస్టర్, సెలవులు, జీపీఎఫ్ దరఖాస్తులు వంటి వాటిపై త్వరగా చర్యలు తీసుకోకుండా, మహిళా ఉద్యోగులు, అటెండర్లు, ఆ పైస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. పీఎస్‌పై వెంటనే చర్య తీసుకోవాలని, ఆయనను అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే శుక్రవారం తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ సమస్య..
సచివాలయంలో విధులకు కొందరు ఆలస్యంగా హాజరవుతున్నారని, అందువల్ల అటెండెన్స్ రిజిస్టర్‌ను కార్యదర్శి పేషీలో పెట్టుకోవాలని 3 రోజుల క్రితం అదనపు కార్యద ర్శి కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఆలస్యంగా వచ్చిన వారు సంతకాలు పెట్టి వెళ్లాక, 12 గంటల సమయంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు, మరికొం దరు వచ్చి తనపై దౌర్జన్యం చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు శ్రీనివాసరావుకు సంఘీభావం తెలిపారు.
నివేదిక వచ్చాక తదుపరి చర్యలు..
ఘటనపై అదనపు కార్యదర్శి రాజసులోచనను నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఎస్సీ శాఖ కార్యదర్శి ఎక్కా ‘సాక్షి’కి తెలిపారు. 6 నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నా.. అలాంటిదేదీ తన దృష్టికి రాలేదన్నారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.