![SC ST Sub Plan Officials Negligence In Prakasam - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/27/sub-plan.jpg.webp?itok=fscYzfVh)
అర్థవీడు మండలంలోని ఓ గిరిజన తండా
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అమలుకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నోడల్ ఏజెన్సీ ద్వారా వివిధ శాఖల నుంచి జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులను రాబట్టి వాటిని సకాలంలో ఖర్చు చేయడంతోపాటు ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు లేకుండా చూడాల్సిన జిల్లా మానిటరింగ్ కమిటీ అందుకు తగినంతగా పనిచేయడం లేదన్న విమర్శలు దళిత, గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
చట్టం ఏర్పాటు ఇలా..
దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరంపై అనేక పోరాటల ఫలితంగా జనవరి 1, 2013లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం వచ్చింది. దేశంలో దళితులు 17.08 శాతం, గిరిజనులు 6 శాతం ఉన్నారు. ఈ చట్ట ప్రకారం దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాధికన బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరగాలి. కేటాయించిన నిధులను ఈ రెండు సామాజిక వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలి.
చట్టం ఏం చెబుతోంది..?
ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో ఏటా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవో నంబర్ 8, 23.12.2013 ప్రకారం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీకి చీఫ్ మినిస్టర్ చైర్మన్ కాగా 35 మందిని మెంబర్లుగా నియమిస్తారు. కన్వీనర్‌గా ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ నోడల్ ఏజెన్సీకి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
జిల్లాలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు..
జీవో నంబర్ 34 ప్రకారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటిలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటికి జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని జీవో చెబుతుంది. ఈ జీవోని 01.11.2013న ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులపై సమీక్షించిన దఖాలాలు ఏ మాత్రం కనిపించడంలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం జీవో నంబర్ 6 ని 2014లో విడుదల చేసింది. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఐటీడీఏ ఉన్న ప్రాంతాలలో ఆ శాఖ జిల్లా అధికారి కన్వీనర్‌గా ఉండగా మిగిలిన శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారని స్పష్టం చేసింది. ఐటీడీఏ లేని ప్రాంతాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
ఈ నోడల్ ఏజెన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వం శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలు, నిధుల సమీకరణ, వాటికి ఖర్చుకు సంబంధించిన మానిటరింగ్‌ను చేయాల్సి ఉంది. అంతే కాకుండా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అభివృద్ధి పథకాల అమలలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంది. అలాంటి పనులు జిల్లాలో ఏమాత్రం జరగటం లేదు. ఇంకా జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఉప ప్రణాళిక అమల తీరును పర్యవేక్షించాల్సి ఉంది. రెండు నెలలకొకసారి సమావేశాలు జరపాల్సి ఉందని జీవ 34 చెబుతుంది.
మౌలిక సదుపాయలు లేక దళిత, గిరిజన గ్రామాలు విలవిల..
జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లుగా పరిపాలన సాగుతుంది. మొత్తం 1028 గ్రామపంచాయితీలు వీటి పరిధిలో ఉన్నాయి. 33 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అత్యధిక శాతం దళిత, గిరిజనులే ఉన్నారు. వీరిలో 50 శాతానికి పైగా భూములు లేని కుటుంబాలు ఉండి, కేవలం దినసరి కూలీపైనే ఆధారి పడి జీవిస్తున్నాయి. మట్టి రోడ్లకు నోచుకోని పల్లెలతో పాటు, తాగునీరు, వీధిలైట్లు ఇలాకనీస మౌళిక సదుపాయాలు లేని గ్రామాలు దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇంకా స్మశానాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉపప్రణాళిక నిధుల జమఖర్చులపై ప్రశ్నించిన నాధుడు లేడు. చట్టం రాకముందు దళిత, గిరిజన నిధులు దారిమళ్లుతున్నాయని ఘోషించిన దళిత, గిరిజన నాయకులు చట్టం వచ్చిన తరువాత నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కలెక్టర్, జేసీలకు ఫిర్యాదులు..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ సమావేశాలు, నిధుల ఖర్చు, సమావేశాలు ఏమి జరగటం లేదని అంబేద్కర్ ఫీపుల్స్ జేఏసీ నాయకులు ఎం.కిషోర్‌కుమార్, మిట్నసల బెంజిమెన్ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. తరువాత జాయింట్ కలెక్టర్–2 మార్కెండేయులకు పిర్యాదు చేశారు. సంబధిత నోడల్ ఏజెన్సీ కన్వీనర్‌ని పిలిపించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment