1నుంచి 5వ తరగతి వరకు 350 మంది విద్యార్థులు
అదనపు గదులు నిర్మిస్తే చదువు చెపుతాం
స్టేషన్‌ఘన్‌పూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక బడులను మూసివేసియడం లేదా మా పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటూ ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరగడం చూశాం. కానీ వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చిన్నపెండ్యాల ఎస్సీ, బీసీ కాలనీ పాఠశాలలో మాత్రం 'మా పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు రావద్దు' అంటూ ప్లెక్సీనీ ఏర్పాటు చేశారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రధానోపాధ్యాయుడు చలపతి ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ తాళ్లపల్లి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరిగి పిల్లలు బడిలో చేరే విధంగా చేశారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 350 మంది పిల్లలు ఉన్నారు.
ఇంకా పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు వస్తుండడంతో.. గదుల కొరతతో పిల్లలను కూర్చోబెట్టే స్థలం లేక అడ్మిషన్‌లు పూర్తి అయినట్లు ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అదనపు గదులు ఉంటే ఎంతమంది పిల్లలకైనా తాము చదువు చెప్పేందుకు సిద్ధమేనని ప్రధానోపాధ్యాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇంకా పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలంటూ వస్తున్నారని ఆయన తెలిపారు. అయితే తాము ఏమీచేయలేక పోతున్నామని ప్రధానోపాధ్యాయుడు చలపతి చెప్పారు.