'ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన' | ysrcp mlas dharna at nellore corporation office over sc sub plan | Sakshi
Sakshi News home page

'ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన'

Published Tue, Sep 27 2016 12:44 PM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM

'ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన' - Sakshi

'ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన'

ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నా చేపట్టింది.

► కార్పొరేషన్‌ను ముట్టడించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు  
► మంత్రి నారాయణ తీరుపై అనిల్, కోటంరెడ్డిల ఆగ్రహం
 
నెల్లూరు, సిటీ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ డౌన్‌ డౌన్‌ అనే నినాదాలతో నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. కార్పొరేషన్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.42 కోట్లకు 10 నెలలుగా టెండర్లు కూడా కాలయాపన చేస్తున్న వైనాన్ని నిరసిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ముట్టడించారు.

ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ నిధులకు టెండర్లు పిలవకుండా మేయర్, అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ సొంత కార్పొరేషన్‌లో ఈ పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. రూ.42 కోట్లను ప్యాకేజీలుగా చేసి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటంలేదన్నారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేషన్‌లలో సబ్‌ప్లాన్‌ నిధులతో పనులు పూర్తిచేయడం కూడా జరుగుతుందన్నారు. గతంలోనే కమిషనర్‌ను కలిసి టెండర్లు వెంటనే పిలవాలని కోరామని, ఆయన వారంరోజుల్లో పిలుస్తామని చెప్పారన్నారు. 25 రోజులు గడుస్తున్నా టెండర్లు పిలవకపోవడం దారుణమన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో అనిల్‌ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పిలకపోతే కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
 
నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
కార్యాలయంలో కమిషనర్‌ను కలిసేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్‌ వెంకటేశ్వర్లు కార్యాలయం బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సబ్‌ప్లాన్‌ నిధులతో పనులు ప్రారంభించకపోవడంలో జాప్యం జరిగింది వాస్తవమేనన్నారు. వచ్చే సోమవారం (వారం రోజుల్లో) టెండర్లు తప్పనిసరిగా పిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కమిషనర్‌తో మాట్లాడుతూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు చేపట్టే దీక్షలో నేనూ కూడా కూర్చుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, విప్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement