అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనా ?
-
-
ఫైవ్‌మన్ కమిటీలో అనుకూలురికే స్థానం
-
వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్కరికే అవకాశం
-
ఫ్లోర్‌లీడర్లను సంప్రదించకుండానే మేయర్ ఏకపక్ష నిర్ణయాలు
మేయర్ అబ్దుల్ అజీజ్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన నియమించిన ఫైవ్‌మన్ కమిటీలో అనుకూలురికే స్థానం కల్పించడం, కనీసం ఫ్లోర్ లీడర్లను సంప్రదించకుండానే కమిటీని నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర్వులు జారీ చేసిన తేదీని కూడా మార్చేసి ఈ నెల 11నే ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం.
నెల్లూరు, సిటీ: నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గత బడ్జెట్ సమావేశంలో మేయర్ అజీజ్‌ను వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ నిలదీశారు. ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి ఐదుగురు సభ్యుల కమిటీని నియమిస్తామని అప్పట్లో మేయర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం పాత తేదీ వేసి కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ కమిటీలో టీడీపీ నుంచి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ఎం.పెంచలయ్య, పిట్టి సత్యనాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. వీరు మేయర్ అనుకూలురు కావడం గమనార్హం. తాను చెప్పినట్టు నడుచుకుంటారనే ఉద్దేశంతోనే వారిని కమిటీలో నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి పి.శ్రీలక్ష్మి, బీజేపీ నుంచి వై.అపర్ణను నియమించారు.
ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక్కరేనా?
వైఎస్సార్‌సీపీ నగరపాలక సంస్థలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఒక్కరికే అవకాశం ఇస్తూ, ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్న బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. గత కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ నుంచి రూప్‌కుమార్‌ను కమిటీ జాబితాలో నియమిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన కమిటీ జాబితాలో రూప్‌కుమార్ పేరు లేకపోవడంపై మేయర్ తన అవినీతిని ఎక్కడ బయటపెడుతారోనని, రూప్‌కుమార్ పేరులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కమిటీ నియామకం సమయంలో అన్ని పార్టీల నేతలను సంప్రదించాలనే విషయాన్ని మేయర్ విస్మరించారు.
ఫ్లోర్ లీడర్లను సంప్రదించకుండానే..
ఫైవ్‌మన్ కమిటీ నియామకం విషయంలో మేయర్ అజీజ్ ఫ్లోర్ లీడర్లను సంప్రదించకపోవడం, చివరకు సొంత పార్టీ నేతకు కూడా సమాచారం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్వపక్షంలోనే ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
నాకు సమాచారం లేదు: జెడ్ శివప్రసాద్, టీడీపీ ఫ్లోర్ లీడర్
ఫైవ్ మన్ కమిటీ నియామకంపై మేయర్ అజీజ్ తీసుకున్న నిర్ణయం నా దృష్టికి రాలేదు. కమిటీ వేస్తున్నట్లు ముందస్తు సమాచారం కూడా లేదు.
మేయర్‌వి ఏకపక్ష నిర్ణయాలు: పి.రూప్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్
ప్రజారోగ్య విభాగంలో జరిగిన దోపిడీపై బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించాను. తక్షణమే అన్ని పార్టీల నేతలతో చర్చించి సమగ్ర విచారణ జరిపిస్తానని చెప్పారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా కమిటీ వేశారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. అన్ని ఫ్లోర్‌లీడర్‌లను తప్పనిసరిగా సంప్రదించాలి. మేయర్ అవినీతి పాలనకు ఇది ఒక నిదర్శనం.