నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా.. సమావేశం నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
సాక్షి, నెల్లూరు :నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా.. సమావేశం నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇది మరిం త వివాదాస్పదంగా మారుతోంది. సమావేశం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల నుండే కాక అధికారపార్టీ కార్పొరేటర్ల నుండీ డిమాండ్ పెరుగుతోంది. తొలి సమావేశం నిర్వహణపై మేయర్ అబ్దుల్‌అజీజ్ మీనమేషాలు లెక్కిస్తుంటే.. కమిషనర్ జాన్‌శ్యాంసన్ తనకేమీ తెలియదు.. మేయర్‌ను అడగమంటూ తప్పించుకుంటున్నారు.
నిబంధనల మేరకు సెప్టెంబర్ 3వ తేదీలోగా సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులను సైతం ఎన్నుకోవాల్సి ఉంది. కానీ మేయర్ మాత్రం సమావేశం నిర్వహించేందుకు ససేమిరా అనడం.. అధికారులు పట్టించుకోకపోవడంపై కౌన్సిల్ సభ్యుల నుంచే కాకుండా నగర ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీలో ముదిరిన గ్రూపు రాజకీయాలు కూడా కౌన్సిల్ సమావేశం జరగక పోవడానికి కారణంగా తెలుస్తోం ది. మరో వైపు ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తున్నా.. కార్పొరేషన్ పాలన గాడిలో పడలేదు.
ఇప్పటికీ అధికారుల పెత్తనమే సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేటర్ల మాట అధికారులు వినడం లేదు. డివిజన్లలో సమస్యలు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా డివిజన్లలో వీధి లైట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. పారిశుధ్యం పనులు సైతం నామమాత్రంగా చేపడుతున్నా రు. 54 డివిజన్లకు 20 శానిటేషన డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఏ అధికా రి ఏ డివిజన్ శానిటేషన్ అధికారిగా ఉన్నారో కార్పొరేటర్లకే తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం ఒక్క సమావేశమైనా జరిగి ఉంటే అధికారులెవరో తెలిసేదని, సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేదని..కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు. గెలిపించిన ఓటర్లు మాత్రం సమస్యల సంగతేందంటూ కార్పొరేటర్లను నిలదీ స్తుండగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మరో వైపు మేయర్ అజీజ్ అధికార పార్టీ గ్రూపు రాజకీయాల పుణ్యమాని అధిక సమయం హైదరాబాద్‌లోనే గడుపుతుండగా కమిషనర్ మాత్రం బదిలీ నిలుపుకునేందుకు మున్సిపల్ శాఖామంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో నగరపాలన పట్టించుకునేవారే లేకుండా పోయారు. మంత్రి జిల్లా వాసి కావడంతో మిగిలిన అధికారులు సైతం ఆయన అనుచరులతో సంబంధాలు నెరుపుతూ ప్రజాసమస్యలు పట్టించుకోక పోగా కార్పొరేటర్లను సైతం ఖాతరు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.