సాక్షి, హైదరాబాద్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతున్న అధికార పార్టీ దానికి తగినట్లుగానే వివరాలన్నీ సేకరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను, ఆ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.
సమగ్ర సమాచార నిధి..
రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలవారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాలవారీగా, గ్రామ స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య, వారి వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వివరాలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నాయి. మిగిలిన వివరాలను సేకరించడంతోపాటు, ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పులు లేని విధంగా సంక్షేమ సమాచార నిధి ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఉన్నతాధికారులు ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే కాక రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను పొందుపరిచే లక్ష్యంతో అధికారులు ఈ పని చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖాల వారీగా వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ శాఖల్లో అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్‌కే జోషి ఆయా శాఖల అధికారులను ఇటీవల ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి డాటాబేస్‌ను రూపొందించాలని సూచించారు. డాటాబేస్ రూపకల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక పేజీలో ఈ వివరాలు అందిరికీ తెలిసేలా ఉంచనున్నారు.
వంద శాతం స్పష్టత..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా సంక్షేమ శాఖల ఆధర్యంలోనే అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యానిధి తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థిక చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు సబ్సిడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేజీటు పీజీ కార్యక్రమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి 2.5 లక్షల మంది పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖ లక్షలాది మందికి ఆసరా పింఛన్లు ఇస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ కేసీఆర్ కిట్లు, అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆపద్భంధు, ఫ్యామిలీ బెనిఫిట్ పథకాలు రెవెన్యూ శాఖ అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, మత్సశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ.. ఇలా పెద్ద సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. అయితే అన్ని పథకాల సమగ్ర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీన్ని సరి చేసేందుకు శాఖల వారీగా పథకాలు, కార్యక్రమాలు.. వీటి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. వంద శాతం సరైన గణాంకాలు, వివరాలు ఉండేలా ఈ ప్రక్రియ సాగుతోంది.
సామాజిక వర్గాల వారీగా..
సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల నమోదు పక్కా ప్రణాళికతో సాగుతోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నమోదు చేయడంతోపాటు సామాజిక వర్గాల వారీ వివరాలనూ సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబాల వారీగానూ క్రోడీకరిస్తున్నారు. పథకాల వారీగా చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య తెలిసేలా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను అందుబాటులో పెట్టనున్నారు. కచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పారదర్శకతతోపాటు, ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ ఉంటుందనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు ఇప్పటికే దాదాపుగా నమోదయ్యాయి. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంర్ధక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు వివరాలను సేకరిస్తున్నాయి.
ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు..
రాష్ట్రంలో ఎస్సీ జనాభా : 54 లక్షలు
కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు : 88,786
చేసిన ఖర్చు : రూ.504 కోట్లు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ లబ్ధిదారులు : 8,74,443
ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ లబ్ధిదారులు : 2.50 లక్షలు
ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు : 2.67 లక్షలు
ఆర్థిక చేయూత(ఈఎస్‌ఎస్) పథకం లబ్ధిదారులు : 1,04,980
ఆర్థిక చేయూత(ఈఎస్‌ఎస్) పథకానికి మంజూరు : రూ.1,136 కోట్లు
ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు : 57,500
Comments
Please login to add a commentAdd a comment