రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌తో కలిసి నివేదిక విడుదల
భారతీయ వినియోగదారుల జీవితాల్లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తూ నివేదిక విడుదలైంది. ‘ఫాస్ట్ లేన్ టు సోషల్ ఇంపాక్ట్’ పేరుతో వాట్సప్ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సహాయంతో ఈ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్న చిన్న వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలకు వాట్సప్ ఎలా దోహదపడుతోందో తెలిపింది.
ఈ నివేదికపై మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ స్పందిస్తూ..‘వ్యక్తులు, వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించేందుకు వాట్సాప్ కీలక సాధనంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం నుంచి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిని అందించడం, తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యపై ఆసక్తి పెంచేలా చేయడం వరకు ఎన్నో విధాలుగా వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. సానుకూల సామాజిక మార్పు కోసం ఇదో వేదికగా మారింది. టెక్నాలజీ పరంగా దేశం ఎంతో వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా ఎంఎస్‌ఎంఈలకు ఎంతో మేలు జరుగుతోంది. సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇదో సాధనంగా మారింది. చిన్న వ్యాపారులకు గుర్తింపు లభించడంలో వాట్సప్ పాత్ర కీలకం’ అన్నారు.
నివేదికలోని వివరాల ప్రకారం.. చిన్న వ్యాపారాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లను సులభంగా స్వీకరించడానికి వాట్సప్ వీలు కల్పిస్తోంది. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతోంది. వ్యాపార పరిధిని విస్తరించడంలో సహాయపడుతోంది. రానున్న రోజుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ), మెటా సంయుక్తంగా ‘వాట్సప్ సే వ్యాపార్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా వాట్సప్ బిజినెస్ యాప్‌లో ఒక కోటి మంది వ్యాపారులకు డిజిటల్ శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ మొత్తం 29 రాష్ట్రాల్లో 11 భారతీయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన 25,000 మంది ప్రతిభ ఉన్న వ్యాపారులకు మెటా స్మాల్ బిజినెస్ అకాడమీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ధ్రువీకరణను అందిస్తారు. ఇది తమ వ్యాపార విస్తరణ కోసం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీ
దేశంలోని అనేక సామాజిక సంక్షేమ సంస్థలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సానుకూల సామాజిక మార్పు వంటి విభాగాల్లో సమస్యల పరిష్కారాలను అందించడానికి వాట్సాప్ వీలు కల్పించింది. ‘మన్ దేశీ ఫౌండేషన్’ అనే సంస్థ తన వాట్సప్ చాట్‌బాట్ ద్వారా లక్ష మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా ఆ సంస్థ 15,000 మంది మహిళలకు డిజిటల్ శిక్షణ ఇచ్చింది. వారిలో 85% మంది గ్రామీణ లబ్ధిదారులే కావడం విశేషం. వాట్సప్ గ్రూప్‌ల్లో సమాచారం అందించి పేదరికాన్ని తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ, మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, సమగ్ర పౌర సేవలపై అవగాహన, డిజిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం..వంటి ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నట్లు నివేదిక తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment