Social welfare programs
-
సామాజిక సంక్షేమానికి వాట్సప్ సాయం
భారతీయ వినియోగదారుల జీవితాల్లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తూ నివేదిక విడుదలైంది. ‘ఫాస్ట్ లేన్ టు సోషల్ ఇంపాక్ట్’ పేరుతో వాట్సప్ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సహాయంతో ఈ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్న చిన్న వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలకు వాట్సప్ ఎలా దోహదపడుతోందో తెలిపింది.ఈ నివేదికపై మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ స్పందిస్తూ..‘వ్యక్తులు, వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించేందుకు వాట్సాప్ కీలక సాధనంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం నుంచి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిని అందించడం, తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యపై ఆసక్తి పెంచేలా చేయడం వరకు ఎన్నో విధాలుగా వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. సానుకూల సామాజిక మార్పు కోసం ఇదో వేదికగా మారింది. టెక్నాలజీ పరంగా దేశం ఎంతో వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు జరుగుతోంది. సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇదో సాధనంగా మారింది. చిన్న వ్యాపారులకు గుర్తింపు లభించడంలో వాట్సప్ పాత్ర కీలకం’ అన్నారు.నివేదికలోని వివరాల ప్రకారం.. చిన్న వ్యాపారాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఆన్లైన్లో ఆర్డర్లను సులభంగా స్వీకరించడానికి వాట్సప్ వీలు కల్పిస్తోంది. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతోంది. వ్యాపార పరిధిని విస్తరించడంలో సహాయపడుతోంది. రానున్న రోజుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ), మెటా సంయుక్తంగా ‘వాట్సప్ సే వ్యాపార్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా వాట్సప్ బిజినెస్ యాప్‌లో ఒక కోటి మంది వ్యాపారులకు డిజిటల్ శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ మొత్తం 29 రాష్ట్రాల్లో 11 భారతీయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన 25,000 మంది ప్రతిభ ఉన్న వ్యాపారులకు మెటా స్మాల్ బిజినెస్ అకాడమీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ధ్రువీకరణను అందిస్తారు. ఇది తమ వ్యాపార విస్తరణ కోసం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీదేశంలోని అనేక సామాజిక సంక్షేమ సంస్థలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సానుకూల సామాజిక మార్పు వంటి విభాగాల్లో సమస్యల పరిష్కారాలను అందించడానికి వాట్సాప్ వీలు కల్పించింది. ‘మన్ దేశీ ఫౌండేషన్’ అనే సంస్థ తన వాట్సప్ చాట్‌బాట్ ద్వారా లక్ష మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా ఆ సంస్థ 15,000 మంది మహిళలకు డిజిటల్ శిక్షణ ఇచ్చింది. వారిలో 85% మంది గ్రామీణ లబ్ధిదారులే కావడం విశేషం. వాట్సప్ గ్రూప్‌ల్లో సమాచారం అందించి పేదరికాన్ని తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ, మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, సమగ్ర పౌర సేవలపై అవగాహన, డిజిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం..వంటి ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నట్లు నివేదిక తెలియజేసింది. -
ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట
సాక్షి, అమరావాతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ► వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు ► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు ► వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ► జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు ► జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు ► వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు ► డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు ► రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు ► వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు ► జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు ► వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు ► వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు ► వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు ► మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు ► రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు ► లా నేస్తం రూ.17 కోట్లు ► జగనన్న తోడు రూ.35 కోట్లు ► ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు ► వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు ► వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు ► వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు ► అమ్మఒడి రూ.6,500 కోట్లు ► జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు -
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
ఉచితహామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దుపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు, సంక్షేమ చర్యల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ క్రిష్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో నెరవేర్చలేని ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయటం అనేది అప్రజాస్వామికమని పేర్కొంది ధర్మాసనం. ‘రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అనే అంశంలోకి వెళ్లదలుచుకోలేదు. అది అప్రజాస్వామికమైన ఆలోచన. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే, ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటం తీవ్రమైన అంశం. కానీ, చట్టపరమైన అడ్డుకట్ట పడేవరకు జోక్యం చేసుకోలేము.’ అని పేర్కొన్నారు సీజేఐ ఎన్వీ రమణ. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులు పలు సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని కోరారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ‘ ఉచితాలు, సంక్షేమ పథకాలు అనేవి వేరు వేరు. ఆర్థిక వ్యవస్థ నష్టం, ప్రజల సంక్షేమం మధ్య సమతుల్యత అవసరం. అందుకే ఈ చర్చ. ఆ దిశగా ఆలోచనలు, సూచనలను నా రిటైర్మెంట్లోపు చెప్పండి.’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
రేపే వైఎస్సార్ చేయూత, మారనున్న అక్కచెల్లెమ్మల భవిత
సాక్షి, అమరావతి: మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ( వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురేష్ బాబు) పథకం అమలు ఎలా? మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందించేలా ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుకు మూడు నాలుగు రెట్లు వివిధ పథకాలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు అందించి, ప్రఖ్యాత కంపెనీలు అందించే వ్యాపార నమూనాలతో వారి జీవనోపాథి మార్గాలను పెంచడమే కాకుండా, ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆదాయ మార్గాలను బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత.. తదితర రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి ఈ చర్యలు తోడ్పాటునందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. (‘వైద్య సదుపాయాలకు కేంద్రం సహాయం అందించాలి’) ‘చేయూత’ ఆవిర్భావం వెనుక: 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ సమయంలో వివిధ వర్గాలకు చెందిన వేలాది మహిళలు ఆయన్ను కలుసుకున్నారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. కుటుంబం బరువు బాధ్యతలను మోస్తున్నామని, ఇన్ని రోజులుగా పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. కుటుంబ అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, పిల్లల పెళ్లిళ్లు లాంటి బాధ్యతలూ మోస్తున్నామని వైఎస్ జగన్‌కు పలు సందర్భాల్లో విన్నపించుకున్నారు. ఒక్కరోజు పనికి వెళ్లకపోయినా కుటుంబాన్ని నెట్టుకురాలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమస్యలు చెప్పుకున్న వారిలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యనున్న మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు స్థిరమైన ఆదాయమార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వైఎస్ జగన్, వైయస్సార్ చేయూత పథకాన్ని వర్తింప చేస్తామంటూ నాడు హామీ ఇచ్చారు. దీన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. (రేపే ‘వైఎస్సార్ చేయూత’ పథకం ప్రారంభం: మంత్రి) చేయూత పథకం: ఆగస్టు 12న వైయస్సార్ చేయూత పథకం (రేపు ప్రారంభం) 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు వర్తింపు ఏడాదికి రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో రూ.75 వేలు మహిళ స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అమూల్, పీ అండ్ జీ, హెచ్‌యూఎల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు చేయూత కింద డబ్బు చేతికి అందగానే దేని కోసం వినియోగించాలన్నది మహిళల ఇష్టం దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు జీవనోపాధి కోసం చేసుకుంటున్న కార్యక్రమాలకూ వాడుకోవచ్చు చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ నడుపుకోవచ్చు సంక్షేమంతో పాటు మహిళలకు ఆర్థిక సుస్థిరత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. జీవనోపాధి పొందే మార్గాలపై ఈ డబ్బును వినియోగిస్తే, లబ్ధిదారులైన మహిళల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం చూస్తుంది. ఎంఓయూలు : చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాథి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. నాలుగేళ్ల కాలంలో చేయూత కింద దాదాపు రూ.18,000 కోట్లు: ఒక్క చేయూత ద్వారానే నాలుగేళ్ల కాలంలో నేరుగా దాదాపు రూ.18,000 కోట్లు నేరుగా మహిళల చేతికే ఉచితంగా అందుతాయి. దీనికి అదనంగా 3–4 రెట్ల ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా లబ్ధిదారులైన మహిళలు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మహిళలు పెట్టే పెట్టుబడులు రూ.54 వేల నుంచి రూ.75 వేల కోట్ల వరకూ ఉంటుంది. (జగనన్న పథకాలకు ఆకర్షితుడై.. భూమి దానం) ► చేయూత కింద లబ్ధి పొందుతున్న మహిళల్లో వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు చేసే మహిళలను గుర్తిస్తారు. ►వారి జీవనోపాధి కోసం మంచి ఆదాయ మార్గాలను గుర్తిస్తారు. ►చేయూత కింద ఉచితంగా అందే డబ్బుతోపాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి, మెప్మా, సెర్ప్ పథకాల నుంచి ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తారు. ►లబ్దిదారులైన మహిళలు ఉన్న రంగంలో వ్యాపార నమూనాను వర్తింప చేయడం ద్వారా వారికి సుస్థిరంగా జీవనోపాధి కల్పిస్తారు. ►ఇలాంటి మహిళలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వివిధ సంస్థలు, కార్పొరేట్లకు అనుసంధానం చేస్తారు. వారిలో సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి సహకారం అందిస్తాయి. ►ఈ కార్యక్రమంలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పన కోసం భాగస్వాములను గుర్తిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. ►రిటైల్ రంగంలో దుకాణాలు నడుపుకుంటున్న చేయూత కింద లబ్ధిదారులైన మహిళలను గుర్తిస్తారు. ► హెచ్‌యూల్, ఐటీసీ, పీ అండ్ జీ కంపెనీల సర్వీసు లొకేషన్లలో ఉన్న వీరిని గుర్తించి మ్యాపింగ్ చేస్తారు. ►ఇన్వెంటరీ మేనేజ్మెంట్, స్టాకింగ్ మేనేజ్మెంట్లో వారికి శిక్షణ ఇస్తారు. ►స్థిర వ్యాపార నమూనాలను అవలంబించేలా చూస్తారు. తద్వారా స్థిరమైన ఆదాయాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. సెర్ప్, మెప్మాలు ఏం చేస్తాయంటే...? ♦ లబ్ధిదారులను సెర్ప్, మెప్మాలతో కూడిన నోడల్ ఏజెన్సీ గుర్తిస్తుంది. ♦చేయూత నుంచి అందే డబ్బుకు అదనంగా బ్యాంకులనుంచి రుణాలు వచ్చేలా సెర్ప్, మెప్మాలుచూస్తాయి. ♦సంబంధిత శాఖల భాగస్వామ్యంతో మహిళలకు మరింత మేలు జరిగేలా చూస్తాయి. వివిధ శాఖల్లోని మిగిలిన పథకాలు కూడా వీరికి వర్తింపు చేయడం ద్వారా ఆర్థికంగా మరింత తోడ్పాటు అందేలా చూస్తాయి. భాగస్వామ్యులైనకంపెనీలు ఏం చేస్తాయంటే..? ⇒ మహిళకు చేయూతనిచ్చే కార్యక్రమాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తాయి. ⇒లబ్ధిదారులైన మహిళలు ఉన్న ప్రాంతాల్లో తమ సర్వీసు పాయింట్లను గుర్తిస్తాయి. ⇒ఉత్పత్తుల కొనుగోలులో వారికి తోడ్పాటునందిస్తాయి. ⇒కిరణా వ్యాపారం చేసే వారికి శిక్షణ ఇస్తాయి. వారిలో వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతాయి. ⇒గుర్తించిన క్లస్టర్లలో కార్పొరేట్ కార్యక్రమాలతో సుస్థిర ఆదాయాలకు ప్రణాళికను అమలు చేస్తాయి. వైఎస్సార్ ఆసరా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సెప్టెంబరులో ప్రారంభిస్తోంది. ఏటా రూ.6,700 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 9 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మందికి ఈ డబ్బును ఉచితంగా ఇవ్వనున్నారు. ఎన్నికలయ్యే నాటికి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు బకాయిపడ్డ డబ్బును నేరుగా చెల్లిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. చేయూత మాదిరిగానే ఆసరా ద్వారా కూడా మహిళల జీవితాలను మార్చాలని ప్రభుత్వం యత్నిస్తోంది. చేయూత కింద ఎంపికైన చాలా మంది లబ్ధిదారులు ఆసరా కింద కూడా లబ్ధి పొందనున్న నేపథ్యంలో ఈ రెండు పథకాల ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో అందించనున్న దాదాపు రూ.44 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం చేయూత కింద వివిధ ప్రఖ్యాత కంపెనీలతో అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను ఆసరాకూ అమలు చేయనున్నారు. -
ఎవరికి ఏమిచ్చాం
సాక్షి, హైదరాబాద్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతున్న అధికార పార్టీ దానికి తగినట్లుగానే వివరాలన్నీ సేకరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను, ఆ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. సమగ్ర సమాచార నిధి.. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలవారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాలవారీగా, గ్రామ స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య, వారి వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వివరాలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నాయి. మిగిలిన వివరాలను సేకరించడంతోపాటు, ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పులు లేని విధంగా సంక్షేమ సమాచార నిధి ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఉన్నతాధికారులు ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే కాక రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను పొందుపరిచే లక్ష్యంతో అధికారులు ఈ పని చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖాల వారీగా వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ శాఖల్లో అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్కే జోషి ఆయా శాఖల అధికారులను ఇటీవల ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి డాటాబేస్‌ను రూపొందించాలని సూచించారు. డాటాబేస్ రూపకల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక పేజీలో ఈ వివరాలు అందిరికీ తెలిసేలా ఉంచనున్నారు. వంద శాతం స్పష్టత.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా సంక్షేమ శాఖల ఆధర్యంలోనే అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థిక చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు సబ్సిడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేజీటు పీజీ కార్యక్రమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి 2.5 లక్షల మంది పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖ లక్షలాది మందికి ఆసరా పింఛన్లు ఇస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ కేసీఆర్ కిట్లు, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆపద్భంధు, ఫ్యామిలీ బెనిఫిట్ పథకాలు రెవెన్యూ శాఖ అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, మత్సశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ.. ఇలా పెద్ద సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. అయితే అన్ని పథకాల సమగ్ర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీన్ని సరి చేసేందుకు శాఖల వారీగా పథకాలు, కార్యక్రమాలు.. వీటి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. వంద శాతం సరైన గణాంకాలు, వివరాలు ఉండేలా ఈ ప్రక్రియ సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల నమోదు పక్కా ప్రణాళికతో సాగుతోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నమోదు చేయడంతోపాటు సామాజిక వర్గాల వారీ వివరాలనూ సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబాల వారీగానూ క్రోడీకరిస్తున్నారు. పథకాల వారీగా చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్లో ఈ వివరాలను అందుబాటులో పెట్టనున్నారు. కచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పారదర్శకతతోపాటు, ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ ఉంటుందనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు ఇప్పటికే దాదాపుగా నమోదయ్యాయి. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంర్ధక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు వివరాలను సేకరిస్తున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా : 54 లక్షలు కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు : 88,786 చేసిన ఖర్చు : రూ.504 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 8,74,443 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 2.50 లక్షలు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు : 2.67 లక్షలు ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకం లబ్ధిదారులు : 1,04,980 ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకానికి మంజూరు : రూ.1,136 కోట్లు ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు : 57,500 -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
టీమిండియా స్ఫూర్తితో కలిసి పనిచేద్దాం: అరుణ్ జైట్లీ ♦ అధిక వృద్ధిని సాధిద్దాం ♦ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీలో ఆర్థిక మంత్రి ♦ సాగుపై దృష్టి పెట్టాలన్న రాష్ట్రాలు ♦ అధిక నిధులకు డిమాండ్ న్యూఢిల్లీ: దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కేంద్రం రాష్ట్రాలు కలసి పని చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. దేశం అధిక వృద్ధిరేటును సాధించాలంటే టీమిండియా స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం జరిగిన సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను జైట్లీ ముందుంచాయి. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలంటే తమకు అధిక నిధుల కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా గత రెండేళ్లుగా వర్షాభావం వల్ల కునారిల్లిన వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాయి. ఇటీవల కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల దేశం అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తోందని జైట్లీ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాలు మరింతగా పెంచాలని, పేదరిక నిర్మూలన పథకాల అమలుపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించారు. 14వ ఫైనాన్స్ కమిషన్ అమలుతో మరిన్ని నిధులు దక్కిన రాష్ట్రాలు ఆ మేరకు మౌలిక వనరుల కల్పన, సామాజిక సంక్షేమ పథకాలపై వెచ్చించాలని కేంద్రం ఆశిస్తోందన్నారు. ప్రతి రాష్ట్రమూ తనకున్న ఆర్థిక వనరులను సమర్థంగా వాడుకుంటూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను జైట్లీ ప్రశంసించారు. తద్వారా అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లేలా కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి రాష్ట్రానికీ కేంద్రం తన వంతు తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రాలు పురోగమిస్తే, దేశమూ వృద్ధి చెందుతుందన్నారు. దేశాన్ని అధికవృద్ధి బాటకు మళ్లించేలా.. ‘టీమ్ ఇండియా’ నినాదం స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేయాలన్నారు. కేంద్రానికొచ్చే పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను మరో 10 శాతం పెంచి ఏకంగా 42 శాతానికి చేర్చాలంటూ గతేడాది 14వ ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సూచించింది. దీనికి కేంద్రం కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. ఇక 7వ వేతన సంఘం దాదాపు ఒక కోటి మంది ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు పెంచాలంటూ నవంబర్‌లో సిఫార్సు చేసింది. దీంతో 2016-17లో ఖజానాపై అదనంగా రూ. 1.02 లక్షల కోట్ల మేర భారం పడనుంది. ఈ భారాన్ని అధిగమించేందుకు తమకు అధిక నిధులను కేటాయించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మరిన్ని నిధులివ్వండి... ఏడో వేతనసంఘం సిఫార్సులతో పాటు కేంద్ర పథకాల అమలు కోసం రాబోయే బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలంటూ వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల దారుణంగా దెబ్బతిన్న వ్యవసాయ రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. కేంద్ర పథకాలైన సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, ఐసీడీఎస్, జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం వంటి వాటిని గతంలో మాదిరిగానే అమలు చేయాలని, తమ సొంత ఆర్థిక నిధులతో వాటిని నిర్వహించటం కష్టసాధ్యమని పేర్కొన్నారు. అలాగే కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ)ను దశలవారీగా ఎత్తివేతకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని కూడా సత్వరం విడుదల చేయాలని వారు కోరారు. ఇక 7వ వేతనసంఘం సిఫార్సుల అమలువల్ల పడే భారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రత్యేక సాయం అందించాలని, అటు 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రుణ సమీకరణ పరిమితినీ పెంచాలని కేంద్రానికి రాష్ట్రాలు విన్నవించాయి.నిర్దేశిత పరిమితులకు లోబడే మార్కెట్ నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను సమకూర్చుకునేలా వెసులుబాటు కల్పించాలని తాము కోరినట్లు అస్సాం ప్రతినిధి తెలిపారు. 14వఆర్థిక సంఘం సూచనల ప్రకారం తమ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందున కేంద్రం వెసులుబాటునిస్తే తాము వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించుకునేందుకు సాధ్యపడుతుందని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జయంత్ మలయా చెప్పారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిహారం చెల్లింపునకు తాజా బడ్జెట్లో తగు కేటాయింపులు జరపాలని తెలంగాణ, పంజాబ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలు కోరాయి. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలు దిశగా సీఎస్టీని ఏటా 1 శాతం చొప్పున తగ్గిస్తూ, దశల వారీగా తొలగించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి ప్రతిగా జీఎస్టీ అమల్లోకి వచ్చే దాకా పరిహారాన్ని ఇచ్చేలా ప్రతిపాదనలు చేసింది. దానికి అనుగుణంగానే 2008 జూన్ నుంచి సీఎస్టీని నాలుగు శాతం నుంచి రెండు శాతానికి దశలవారీగా తగ్గించడం జరిగింది. అయితే, 2011-12 నుంచి రాష్ట్రాలకు పరిహారం లభించకపోవడంతో తాము నష్టపోతున్నామంటూ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎస్టీ పరిహారాన్ని సత్వరం విడుదల చేయాలని కోరుతున్నాయి. -
ప్రజల అనుసంధానంలో హిందీ కీలకం: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రజలను అనుసంధానించడంలో హిందీ భాష కీలకమైన పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సామాజిక, సాంస్కృతిక ఐక్యతా చిహ్నంగా హిందీ భాషను అభివర్ణించారు. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించిన రాజభాష అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే వాటిని ప్రజలకు మాతృభాషలో అందించాలని సూచించారు.