రేపే వైఎస్సార్‌ చేయూత, మారనున్న అక్కచెల్లెమ్మల భవిత | YS Jagan Starts YSR Cheyutha On Wednesday: Full Details About Scheme | Sakshi
Sakshi News home page

రేపే వైఎస్సార్‌ చేయూత, మారనున్న అక్కచెల్లెమ్మల భవిత

Published Tue, Aug 11 2020 8:53 PM | Last Updated on Tue, Aug 11 2020 9:23 PM

YS Jagan Starts YSR Cheyutha On Wednesday: Full Details About Scheme - Sakshi

సాక్షి, అమరావతి: మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ( వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురేష్ బాబు) 

పథకం అమలు ఎలా?
మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందించేలా ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుకు మూడు నాలుగు రెట్లు వివిధ పథకాలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు అందించి, ప్రఖ్యాత కంపెనీలు అందించే వ్యాపార నమూనాలతో వారి జీవనోపాథి మార్గాలను పెంచడమే కాకుండా, ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆదాయ మార్గాలను బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత.. తదితర రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి ఈ చర్యలు తోడ్పాటునందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. (‘వైద్య సదుపాయాలకు కేంద్రం సహాయం అందించాలి’)

‘చేయూత’ ఆవిర్భావం వెనుక:
2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ సమయంలో వివిధ వర్గాలకు చెందిన వేలాది మహిళలు ఆయన్ను కలుసుకున్నారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. కుటుంబం బరువు బాధ్యతలను మోస్తున్నామని, ఇన్ని రోజులుగా పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. కుటుంబ అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, పిల్లల పెళ్లిళ్లు లాంటి బాధ్యతలూ మోస్తున్నామని వైఎస్‌ జగన్‌కు పలు సందర్భాల్లో విన్నపించుకున్నారు. ఒక్కరోజు పనికి వెళ్లకపోయినా కుటుంబాన్ని నెట్టుకురాలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమస్యలు చెప్పుకున్న వారిలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యనున్న మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు స్థిరమైన ఆదాయమార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి  వైఎస్‌ జగన్, వైయస్సార్‌ చేయూత పథకాన్ని వర్తింప చేస్తామంటూ నాడు హామీ ఇచ్చారు. దీన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. (రేపే ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ప్రారంభం: మంత్రి)

చేయూత పథకం:

  • ఆగస్టు 12న వైయస్సార్‌ చేయూత పథకం (రేపు ప్రారంభం)
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు వర్తింపు
  • ఏడాదికి రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో రూ.75 వేలు
  • మహిళ స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు వేస్తున్న ప్రభుత్వం
  • ఇప్పటికే అమూల్, పీ అండ్‌ జీ, హెచ్‌యూఎల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు
  • చేయూత కింద డబ్బు చేతికి అందగానే దేని కోసం వినియోగించాలన్నది మహిళల ఇష్టం
  • దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు 
  • జీవనోపాధి కోసం చేసుకుంటున్న కార్యక్రమాలకూ వాడుకోవచ్చు
  • చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ నడుపుకోవచ్చు
  • సంక్షేమంతో పాటు మహిళలకు ఆర్థిక సుస్థిరత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 
  • జీవనోపాధి పొందే మార్గాలపై ఈ డబ్బును వినియోగిస్తే, లబ్ధిదారులైన మహిళల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం చూస్తుంది. 

ఎంఓయూలు :
చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్‌ జీ, జియోమార్ట్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్‌ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాథి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక  కార్యకలాపాలు పుంజుకుంటాయి. 

నాలుగేళ్ల కాలంలో చేయూత కింద దాదాపు రూ.18,000 కోట్లు:
ఒక్క చేయూత ద్వారానే నాలుగేళ్ల కాలంలో నేరుగా దాదాపు రూ.18,000 కోట్లు నేరుగా మహిళల చేతికే ఉచితంగా అందుతాయి. దీనికి అదనంగా 3–4 రెట్ల ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా లబ్ధిదారులైన మహిళలు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మహిళలు పెట్టే పెట్టుబడులు రూ.54 వేల నుంచి రూ.75 వేల కోట్ల వరకూ ఉంటుంది. (జగనన్న పథకాలకు ఆకర్షితుడై.. భూమి దానం)

చేయూత కింద లబ్ధి పొందుతున్న మహిళల్లో వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు చేసే మహిళలను గుర్తిస్తారు.
వారి జీవనోపాధి కోసం మంచి ఆదాయ మార్గాలను గుర్తిస్తారు.
చేయూత కింద ఉచితంగా అందే డబ్బుతోపాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి, మెప్మా, సెర్ప్‌ పథకాల నుంచి ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తారు.
లబ్దిదారులైన మహిళలు ఉన్న రంగంలో వ్యాపార నమూనాను వర్తింప చేయడం ద్వారా వారికి సుస్థిరంగా జీవనోపాధి కల్పిస్తారు.
ఇలాంటి మహిళలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వివిధ సంస్థలు, కార్పొరేట్లకు అనుసంధానం చేస్తారు. వారిలో సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి సహకారం అందిస్తాయి. 
ఈ కార్యక్రమంలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పన కోసం భాగస్వాములను గుర్తిస్తారు.

ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..
రిటైల్‌ రంగంలో దుకాణాలు నడుపుకుంటున్న చేయూత కింద లబ్ధిదారులైన మహిళలను గుర్తిస్తారు.
హెచ్‌యూల్, ఐటీసీ, పీ అండ్‌ జీ కంపెనీల సర్వీసు లొకేషన్లలో ఉన్న వీరిని గుర్తించి మ్యాపింగ్‌ చేస్తారు. 
ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, స్టాకింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వారికి శిక్షణ ఇస్తారు. 
స్థిర వ్యాపార నమూనాలను అవలంబించేలా చూస్తారు. తద్వారా స్థిరమైన ఆదాయాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. 

సెర్ప్, మెప్మాలు ఏం చేస్తాయంటే...?
♦ లబ్ధిదారులను సెర్ప్, మెప్మాలతో కూడిన నోడల్‌ ఏజెన్సీ గుర్తిస్తుంది.
♦చేయూత నుంచి అందే డబ్బుకు అదనంగా బ్యాంకులనుంచి రుణాలు వచ్చేలా సెర్ప్, మెప్మాలుచూస్తాయి. 
♦సంబంధిత శాఖల భాగస్వామ్యంతో మహిళలకు మరింత మేలు జరిగేలా చూస్తాయి. వివిధ శాఖల్లోని మిగిలిన పథకాలు కూడా వీరికి వర్తింపు చేయడం ద్వారా ఆర్థికంగా   మరింత తోడ్పాటు అందేలా చూస్తాయి. 

భాగస్వామ్యులైనకంపెనీలు ఏం చేస్తాయంటే..?
మహిళకు చేయూతనిచ్చే కార్యక్రమాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తాయి. 
లబ్ధిదారులైన మహిళలు ఉన్న ప్రాంతాల్లో తమ సర్వీసు పాయింట్లను గుర్తిస్తాయి.
ఉత్పత్తుల కొనుగోలులో వారికి తోడ్పాటునందిస్తాయి.
కిరణా వ్యాపారం చేసే వారికి శిక్షణ ఇస్తాయి. వారిలో వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతాయి.
గుర్తించిన క్లస్టర్లలో కార్పొరేట్‌ కార్యక్రమాలతో సుస్థిర ఆదాయాలకు ప్రణాళికను అమలు చేస్తాయి. 

వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సెప్టెంబరులో ప్రారంభిస్తోంది. ఏటా రూ.6,700 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 9 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మందికి ఈ డబ్బును ఉచితంగా ఇవ్వనున్నారు. ఎన్నికలయ్యే నాటికి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు బకాయిపడ్డ డబ్బును నేరుగా చెల్లిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. చేయూత మాదిరిగానే ఆసరా ద్వారా కూడా మహిళల జీవితాలను మార్చాలని ప్రభుత్వం యత్నిస్తోంది. చేయూత కింద ఎంపికైన చాలా మంది లబ్ధిదారులు ఆసరా కింద కూడా లబ్ధి పొందనున్న నేపథ్యంలో ఈ రెండు పథకాల ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో అందించనున్న దాదాపు రూ.44 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం చేయూత కింద వివిధ ప్రఖ్యాత కంపెనీలతో అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను ఆసరాకూ అమలు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement