CM Jagan Comments At Vinukonda Public Meeting - Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శంగా ఏపీ 

Published Tue, Jan 31 2023 1:53 AM | Last Updated on Tue, Jan 31 2023 9:50 AM

CM Jagan Comments At Vinukonda Public Meeting - Sakshi

పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం

ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే అత్యధిక జీడీపీ 11.43 శాతంతో మొదటి స్థానంలో ఉంది. గ్రోత్‌ రేటులో దేశానికే ఆదర్శంగా పరుగులు తీస్తోంది. జగన్‌ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ మీ బిడ్డ అంటే గిట్టని కొందరు అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ల హయాంలో ఎన్నడూ జరగని విధంగా మీ బిడ్డ హయాంలో రాష్ట్రం పరుగెడుతోందంటే కారణం?.. ప్రతి రంగాన్ని చేయి పట్టుకుని నడిపించగలిగితే పరుగులు పెడతాయి. మంచి గ్రోత్‌ రేట్‌ నమోదు అవుతుంది. ప్రతి కుటుంబం బాగుపడుతుంది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ 11.43 శాతం జీడీపీ గ్రోత్‌రేట్‌ నమోదు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, వృద్ధి రేటు విష­యంలో ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకువెళ్తుండటంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం ద్వారా 3,30,145 మంది లబ్ధిదారులకు రూ.330.15 కోట్ల  ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ..

వెన్నెముక వర్గాలు..    
వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులా­లుగా మారుస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ మూడున్నరేళ్లుగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబానికి మేలు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సొంత షాపులున్న రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా జగనన్న చేదోడు పథకాన్ని తెచ్చాం.

జగనన్న చేదోడు ద్వారా ఈరోజు ప్రయోజనం పొందుతున్న వారిలో నాయీ బ్రాహ్మణులు 47,533, రజకులు 1,14,661, దర్జీలు 1,67,951 మంది కలిపి మొత్తం 3.30 లక్షల కుటుంబాల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ ఇస్తున్న డబ్బులతో కలిపి ఇప్పటివరకు మూడున్నరేళ్లలో రూ.927 కోట్లకుపైగా పారదర్శకంగా అకౌంట్లలో జమ చేశాం. 43 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1,92,938 కోట్లను అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఇక గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం.
జగనన్న చేదోడు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

వారంతా.. నావాళ్లు
మీ జగన్‌ మొట్టమొదట చెప్పేమాట.. నా బీసీలు, నా ఎస్సీలు, ఎస్టీలు, నా మైనార్టీలు నావాళ్లు అని. ప్రతి రోజూ ప్రభుత్వం వీళ్ల మంచి కోసమే ఉంది. రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చదువు­కుం­టున్న పిల్లలు.. ఇలా ఎవరిని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా ప్రతి గడపకూ ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం మేలు చేస్తోంది. 

నమ్మకం ఉంది కాబట్టే..
రాష్ట్రంలో 62 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే 50 శాతం మంది రైతులకు కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉంది. ఒక హెక్టార్‌ లోపున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. దాదాపు కోటిమందికి పైగా ఉన్న వీరంతా క్రమం తప్పకుండా ఏటా జగనన్న దగ్గర నుంచి పెట్టుబడి సాయం కింద వైఎస్సార్‌ రైతు భరోసా వస్తుం­దన్న నమ్మకం ఉంది కాబట్టే ముందుకు అడు­గులు వేయగలుగుతున్నారు.

ప్రతి గ్రామంలో ఆర్బీ­కేలను తీసుకొచ్చి ప్రతి పంటనూ, ప్రతి ఎకరాన్ని ఈ–క్రాపింగ్‌ చేసి రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ఆ సీజన్న్‌  ముగియక ముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తోంది. ఉచితంగా బీమా చేయించి ప్రతి రైతన్నకు మంచి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

గత ప్రభుత్వం మోసాలు
గత సర్కారు కోటిమందికి పైగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రుణమాఫీ పేరుతో మోసగించ­డంతో బకాయిలు కట్టలేక డిఫాల్టర్లుగా మారి ‘డి’ గ్రేడ్‌కు పడిపోయాయి. ఆ కోటి మంది అక్కచెల్లె­మ్మ­ల­కు తోడుగా ఉంటూ మీ అన్న ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ అందిస్తూ అడుగులు ముందుకు వేసింది. గతంలో 18 శాతం ఎన్‌పీఏ, అవుట్‌ స్టాండింగ్‌గా ఉన్న గ్రూపులు ఇవాళ 0.5 శాతం లోపే ఉన్నాయంటే ఏ స్థాయిలో నిలదొక్కుకున్నాయో ఆలోచన చేయండి. గతంలో సి, డి గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ ఇవాళ ఏ, బీ గ్రేడ్‌లోకి వచ్చాయి.
లబ్ధిదారులకు జగనన్న చేదోడు చెక్కును అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

స్వయం ఉపాధికి చేయూత..    
రాష్ట్రంలో ఎవరిపైనా ఆధారపడకుండా తమ కష్టంతో బతుకున్న కుటుంబాలు దాదాపు 55 లక్షల పైచిలుకు ఉన్నాయి. వీరికి ఉద్యోగాలు ఉండవు. కిరాణా షాపులు, రోడ్డు పక్కన వ్యాపారాలు, తోపుడు బండ్ల మీద దోశెలు వేస్తూ, కూరగాయలు వి­క్రయిస్తూ కనిపించే వీరంతా స్వయం శక్తితో బ­తుకు పోరాటంలో అడుగులు ముందుకు వేస్తు­న్నా­రు. ఇలాంటి 27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు చే­యూతనిచ్చి ప్రభుత్వం నడిపిస్తోంది కాబట్టే రాష్ట్రం ఇవాళ పరుగులు పెడుతోంది.

అమూల్, ఐటీసీ, రిలయన్స్, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ లీవర్‌ లాంటి సంస్థలతో ఒప్పందాల ద్వారా అక్కచెల్లె­మ్మలు వ్యాపారాల్లో రాణించేలా అడుగులు ముందుకు వేయించాం. బ్యాంకుల ద్వారా తోడ్పాటు అందించగలిగాం కాబట్టే ఇవాళ రాష్ట్రం పరుగెడుతోం­ది. 

గజదొంగల ముఠా...
గత ప్రభుత్వం.. ఆ ముసలాయన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోండి. ఆ ప్రభుత్వంలో ఒక గజదొంగల ముఠా ఉండేది. దానికి దుష్టచతుష్టయం అని పేరు. ఆ ముఠాలో ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. ఇదీ గజదొంగల ముఠా. వీళ్ల స్కీం అప్పట్లో ఒకటే.. డీపీటీ! దోచుకో, పంచుకో, తినుకో అదే వీళ్ల స్కీం. గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది.

వీటిపై  ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయవు. టీవీ 5 మాట్లాడదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఇలాంటి వారి పరిపాలన కావాలా? లేక లంచాలు, వివక్ష లేకుండా నేరుగా బటన్‌ నొక్కే మీ బిడ్డ పరిపాలన కావాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు ముసలాయన మాదిరిగా ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు. దత్తపుత్రుడు నాకోసం మైక్‌ పట్టుకోకపోవచ్చు. నేను వీళ్లను నమ్ముకోలేదు.

వినుకొండకు వరాలు..
‘ఈ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు తాగునీటి కోసం సీపీడబ్ల్యూఎస్‌ పథకం ద్వారా రూ.12 కోట్లు మంజూరు చేయాలని, 50 పడకల సీహెచ్‌సీని రూ.15 కోట్లతో వంద పడ­క­లుగా మార్చాలని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనా­యుడు కోరారు. వాటిని మంజూరు చేస్తున్నాం వెంటనే పనులు ప్రారంభిస్తాం. వినుకొండలో రూ.10 కోట్లతో ముస్లిం మైనార్టీ కాలేజీ మంజూరు చేస్తు­న్నాం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు.

కార్యక్రమంలో మంత్రులు కారు­మూరి నాగేశ్వరరావు, విడదల రజిని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆళ్ల అయోధ్య  రామిరెడ్డి, ఎమ్మె­ల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కల్ప­లతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌­రెడ్డి, నంబూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 

పాలనలో ఇదీ తేడా
గతంలో కూడా పాలకులను చూశాం. ముఖ్యమంత్రి స్థానంలో ఒక ముసలాయన్ను చూశాం. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. గతం కన్నా మీ బిడ్డ చేస్తున్న అప్పులు కూడా తక్కువే. అయితే గతంలో ఎందుకు బటన్లు లేవు? రూ.1.92 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎందుకు రాలేదు? ఆలోచన చేయండి.. గతంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు ? మీ బిడ్డ పాలనలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయండి?  మీ బిడ్డ పరిపాలనలో బటన్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి.

క్యాస్ట్‌ వార్‌ కాదు.. క్లాస్‌ వార్‌
నేను నా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద, పేద వర్గాలనే నమ్ముకున్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్‌ వార్‌ కాదు (కులాల మధ్య యుద్ధం కాదు).. క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపున, పెత్తందార్లు మరోవైపున ఈ యుద్ధం జరుగుతోంది. మాటపై నిలబడే మీబిడ్డ ఒకవైపు ఉంటే.. వెన్నుపోట్లు, మోసాలు మరోవైపున యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నమ్మకం అంతా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలపైనే.

సింహంలా మీ బిడ్డ ఒక్కడే..
మీ బిడ్డకు పొత్తుల్లేవు.. వాళ్లమీదా వీళ్లమీదా ఆధారపడడు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా నడుస్తాడు. తోడేళ్లంతా గుంపుగా ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. మిమ్మల్ని, ఆ దేవుడ్ని నమ్ముకున్నాడు కాబట్టి భయం లేదు. మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మన స్కూళ్లు బాగుపడాలని, మన పిల్లలు ఇంగ్లిష్‌  మీడియంలో గొప్ప చదువులు చదవాలని, ఆసుపత్రుల రూపురేఖలు మారాలని, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ దేవుడ్ని  కోరుతున్నా.

ఆదుకున్నాం కాబట్టే పరుగులు..
రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే 15 లక్షల మందిని జగగన్న తోడు ద్వారా రూ.10 వేలు వడ్డీలేని బ్యాంకు రుణాలను అందించి ఆదుకున్నాం కాబట్టే రాష్ట్రం ఇవాళ వేగంగా పరుగెడుతోంది. మత్స్యకార భరోసా ద్వారా 1.20 లక్షల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. నేతన్న నేస్తం ద్వారా దాదాపు 82 వేల కుటుంబాలకు తోడుగా నిలిచాం. వాహనమిత్ర ద్వారా సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుకునే 2.75 లక్షల కుటుంబాలను భుజం తట్టి నిలబెట్టాం.

కాపునేస్తం ద్వారా 3.56 లక్షల కుటుంబాలు, చేదోడు ద్వారా 3.30 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో 4 లక్షల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ప్రభుత్వ తోడ్పాటుతో కోవిడ్‌లాంటి మహమ్మారిని సైతం ఎదిరించి నిలదొక్కుకోగలిగారు కాబట్టే ఈరోజు రాష్ట్రం 11.43 శాతం వృద్ధి రేటుతో అడుగులు ముందుకు వేస్తోంది.

30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు..
ఏకంగా 30 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మ­లకు దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా వారి పేరుతోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి 20 లక్షల ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం. సిమెంట్, స్టీల్‌ వినియోగం, కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధితో ఆర్థిక ప్రగతికి ఊతమిస్తూ రాష్ట్రం 11.43 శాతం గ్రోత్‌ రేట్‌తో వేగంగా దూసుకెళ్తుంటే గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

గర్భంలో ఉన్న శిశువుకూ సంక్షేమ పథకాలు 
జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుటుంబం 11 లక్షల ఆర్ధిక సాయాన్ని పొందింది. మొదటి విడత జగనన్న చేదోడు సాయంతో మిషన్, మెటీరియల్‌ కొనుక్కున్నా. రెండో విడత డబ్బులతో జిగ్‌జాగ్‌ మిషన్‌ కొనుక్కుని ఆర్థిక పరిస్ధితి మెరుగు పరుచుకున్నా. నా కుమారుడికి అమ్మ ఒడి వస్తోంది. నేను గర్భవతిని కావడంతో పౌష్టికాహారం అందచేస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువుకు కూడా మీ పథకాలను అందిస్తున్నారు. ఇంటి స్థలం కూడా వచ్చింది.

మా అత్తయ్యకు చేయూత పథకం డబ్బు­లు రావడంతో కిరాణా­షాప్‌ ఏర్పాటు చేసుకు­న్నారు. ఈ నెల నుంచి మా మామ­య్యకు రూ.2,750 పింఛన్‌ వస్తోంది. మామయ్యకు గుండెనొప్పి రావడంతో గుంటూరులోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.50 లక్షలకు పైగా విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. అంతేకాకుండా కోలు­కునేవరకు రెండు నెలల పాటు రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.పది వేలు ఆయన ఖా­తాలో జమ చేశారు. మీకు రుణపడి ఉంటాం.  
– సాయికుమారి, వినుకొండ

నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నా..
పన్నెండు ఏళ్లుగా కుల­వృత్తి (నాయీ బ్రాహ్మ­ణ) చేసుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వా­రా సాయం అందడంతో షాప్‌ డెవలప్‌ చేసు­కున్నా. మరో నలుగురికి జీవనోపాధి కల్పి­స్తు­న్నా. మా అమ్మకు పింఛన్‌ వస్తోంది. మేం కన్న బిడ్డల­మే అయినా మా తల్లిదండ్రులను మీరే బాగా చూసు­కుంటున్నారు. పెద్ద కుమారుడిలా, సొంత అన్నలా ని­లి­చారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధి పొందాం. 
– సైదులు, కొచ్చర్ల, ఈపూరు మండలం 

నాయకుడంటే నమ్మకం..
గతంలో ప్రభుత్వం ఏదైనా లోన్‌ ఇస్తే లబ్ధి­దారుడి కాంట్రిబ్యూ­షన్‌ పేరుతోరూ.3 వేలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా ఖా­తాల్లో జమ అవుతోంది. నాయీ బ్రాహ్మణులు వివక్షకు గురి కాకుండా ప్రత్యేక చట్టం తెచ్చారు. నాయకుడంటే గతంలో మోసం.. ఇప్పుడు నాయకుడంటే నమ్మకం. జగనన్న ఇచ్చిన భరోసా ఇదీ!
– చెల్లుబోయిన శ్రీనివాసగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement