కౌరవులతో పోరాడుతున్నాం | CM YS Jagan Comments in Kurnool District Yemmiganur Public Meeting | Sakshi
Sakshi News home page

కౌరవులతో పోరాడుతున్నాం

Published Fri, Oct 20 2023 3:21 AM | Last Updated on Fri, Oct 20 2023 3:21 AM

CM YS Jagan Comments in Kurnool District Yemmiganur Public Meeting - Sakshi

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రతీ అడుగులోనూ వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రేమ, బాధ్యత చూపిస్తున్న ప్రభుత్వం మనది. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడు ఓవైపు, పెత్తందారీ మరోవైపు ఉన్నాడు. యుద్ధం జరగబోయేది కులాల మధ్య కాదు.. జరగబోయే యుద్ధం క్లాస్‌ వార్‌! కౌరవులంతా ఓవైపు ఉన్నారు. తోడేళ్లంతా ఏకం అవుతాయి. ఆ గజదొంగల ముఠాల్లా మీ బిడ్డకు అర డజను టీవీ ఛానెళ్లు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి తోడూ ఉండదు. నేను నమ్ముకుంది దేవుడి దయ.. చల్లని దీవెనలను మాత్రమే.

మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. వారు చెప్పే మోసాలు, అబద్ధాలను నమ్మకండి. ఓటు వేసే ముందు ఒక్కటే ఆలోచించండి. మీ బిడ్డ వల్ల మీ ఇంటికి మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించండి. మంచి జరిగిందంటే మీరే మీ బిడ్డకు సైనికుల్లా అండగా ఉండండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ‘జగనన్న చేదోడు’ నాలుగో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.25 లక్షల మంది టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.325.02 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 

జీవన యానంలో తోడుగా నిలబడ్డాం..
వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తామని నా పాదయాత్ర సందర్భంగా మాటిచ్చా. ఈ 52 నెలల పాలనలో నవరత్నాలులోని ప్రతి కార్యక్రమం ద్వారా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగానని మీ బిడ్డగా సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నా. వారి జీవన ప్రయాణంలో తోడుగా నిలబడ్డాం. సొంత దుకాణాలున్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం.

క్రమం తప్పకుండా వరుసగా నాలుగో ఏడాదీ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనిద్వారా 1.80 లక్షల మంది టైలర్లు, 1.04 లక్షల మంది రజకులు, దాదాపు 40 వేల మందికిపైగా నాయీ బ్రాహ్మణులకు ఈరోజు మేలు జరుగుతోందని సంతోషంగా చెబుతున్నా. చేదోడు ద్వారా ఇవాళ జమ చేస్తున్న నగదుతో కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.1,252 కోట్లు కేవలం ఈ ఒక్క పథకం కోసమే ఖర్చు చేశాం. ఒక్కో పేద కుటుంబానికి రూ.40 వేల చొప్పున మేలు చేయగలిగాం. ఈ 52 నెలల్లో ప్రతీ అడుగు  మంచి కోసమే వేశాం. మొత్తంగా రూ.2.38 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష చూపలేదు. 

గతంలో ఎవరైనా ఆలోచించారా?
చిన్న షాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్న వారంతా బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఈ వ్యవస్థలు కుప్పకూలిపోవా? అని అడుగుతున్నా. ఇలాంటి వారి గురించి గతంలో ఎవరైనా ఆలోచించారా? ప్రతీ అడుగులోనూ పేదలకు తోడుగా నిలిచాం. చేదోడు, వాహనమిత్రతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహించే కార్యక్రమాలతో పేదలకు అండగా ఉన్నాం. ఏటా క్రమం తప్పకుండా సాయం చేస్తున్నాం. ప్రతీ పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా, వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉన్నా.  

అప్పుడూ ఇదే బడ్జెట్‌.. 
ఈ పథకాలన్నీ ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? అమలు జరిగాయా? అని అంతా ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తోడుగా నిలిచి వారి అభ్యున్నతికి అడుగులు పడింది మీ బిడ్డ నాలున్నరేళ్ల పాలనలోనే. ఈ ప్రభుత్వం వస్తుంది.. ఇలా పథకాలను ఇవ్వగలుగుతుంది... ఎక్కడా లంచాలు, వివక్ష ఉండదు... ఏ పార్టీకి ఓటేశారని అడగరు.. అర్హత ఉంటే చాలు ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎవరైనా అనుకున్నారా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేస్తున్నాం. అప్పుడూ ఇప్పుడూ అదే బడ్జెట్‌.. అదే రాష్ట్రం! మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల పెరుగుదల కూడా అప్పటి కంటే తక్కువే.

మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతున్నాయి? అని అంతా ఆలోచించాలి. గతానికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. మీ బిడ్డ మంచి మనసుతో బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళుతున్నాయి. అప్పట్లో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరికి తోడుగా దత్తప్రుత్రుడు... వీరంతా కలసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదీ. అప్పట్లో గజదొంగల ముఠా దోచేసే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మీ బిడ్డ బటన్‌ నొక్కితే నేరుగా ఖాతాల్లోకి వెళుతున్నాయి. 

మనందరి పాలనలో..
ఏ పేద కుటుంబమైనా, సంప్రదాయ వృత్తుల కుటుంబాలైనా, రైతులు, కూలీలు.. పేదరికంలో ఉన్న వారెవరైనా కోరుకునేది వారికి ఎప్పుడైనా వైద్యం అవసరమైతే మంచి మనసుతో అండగా నిలిచి ఎన్ని లక్షలైనా ఖర్చు చేసే ప్రభుత్వం కావాలనే! ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, లంచాలు లేకుండా వారి కుటుంబానికి ఇంటి ముందుకొచ్చి చేతికిచ్చిపోయే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు. ఇంటి స్థలం, ఇల్లు అవసరాన్ని గుర్తించి వాటిని అందించి, నిర్మించి ఇచ్చే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు.

నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేసేందుకు తమ పిల్లలను మంచిగా చదివించే మేనమామ స్థానంలో ఉండే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అవ్వాతాతలను ఆదుకునే పాలకుడు కావాలని కోరుకుంటారు. అక్కచెల్లెమ్మల సాధికారతకు అండగా నిలబడే మంచి అన్నయ్య, తమ్ముడు సీఎంగా కూర్చోవాలని ప్రతీ పేద కుటుంబం కోరుకుంటుంది. ఇలాంటి మార్పులన్నీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో కళ్లెదుట కనిపించే విధంగా పాలన అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ‘మా పాలన.. మనందరి పాలన.. మా బిడ్డ పాలన.. మా జగనన్న పాలన ’అని అంటారు.

కుప్పంలోనూ ఇళ్లు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే
చంద్రబాబు సాగించిన పాలనను చూస్తే కుప్పం ప్రజలు కూడా ఆయన్ను తమవాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు. మూడు విడతలుగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడ పేదవాళ్లకు ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ప్రభుత్వం అక్కడ 20 వేల ఇంటి పట్టాలను పేదలకు ఇచ్చింది. ఆ అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలివ్వడమే కాకుండా 8 వేల ఇళ్లను కూడా నిర్మిస్తోంది మన ప్రభుత్వమే. 

మాఫీ పేరుతో ముంచేశాడు..
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకాలతో లెటర్లు తీసుకొచ్చారు. టీవీ ఆన్‌ చేస్తే చంద్రబాబు ముఖం కనిపించేది. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టారు. తీరా చంద్రబాబు సీఎం అయ్యాక రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, బంగారం సంగతి దేవుడెరుగు అప్పటి వరకూ వస్తున్న సున్నా వడ్డీని కూడా ఎత్తేశాడు.

ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. సున్నా వడ్డీ పథకం రద్దయింది. బ్యాంకుల్లోని బంగారాన్ని వేలం వేసే పరిస్థితులు రావడంతో రెతన్న అష్టకష్టాలు పడ్డాడు. అందుకే ఆలోచించాలని అంతా  అడుగుతున్నా. 2019 మేనిఫెస్టోలో రైతుకు ఏం చెప్పామో అంతకంటే మిన్నగా చేస్తోంది మీ బిడ్డ ప్రభుత్వం. మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల తర్వాత చంద్రబాబు చెత్త బుట్టలో వేసిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. 

అక్కా.. మీరే చూడండి అంటూ
ఎన్నికల వేళ మీ బిడ్డ ఓ మాట చెప్పాడు. అందులో 99 శాతం హామీలను పూర్తి చేసి మేనిఫెస్టోని ప్రతి గడప వద్దకూ తీసుకెళ్లి ‘అక్కా.. జగనన్న మీకు ఈ మాట చెప్పాడు! ఆ మాటను నెరవేర్చాడు చూడండి..’ అంటూ మీ బిడ్డ ప్రభుత్వం పాలన చేస్తోంది. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకూ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ నుంచి ఫైబర్‌ గ్రిడ్‌ దాకా.. చివరకు మద్యంలోనూ దోచేయడం, పంచుకోవడం, తినుకోవడమే. ఇది మినహా నాడు ఏదీ కనిపించలేదు. 

ఆ మోసాలు.. గుర్తున్నాయా?
పొదుపు సంఘాలను మోసం చేస్తూ చంద్రబాబు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? నాడు టీవీల్లో ప్రకటనలు వచ్చేవి! ఓ అక్క, ఓ చెల్లెమ్మను చూపించేవారు. అందులో మంగళసూత్రం లాక్కుని వెళ్లే ఓ చేతిని మరో చెయ్యి పట్టుకుంటుంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు. ఆయన సీఎం అయ్యారు కానీ అప్పటివరకూ ఏ, బీ, గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. పొదుపు సంఘాలకు అప్పటివరకూ ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు.

అక్కచెల్లెమ్మలకు ఎన్నో ఇబ్బందులు కల్పించారు. ఆ దుస్థితి నుంచి కాపాడేందుకు మీకు మంచి అన్నయ్య, తమ్ముడు.. మీ బిడ్డ రూపంలో సీఎం స్థానంలోకి వచ్చాడు. వారందరికీ తోడుగా ఉన్నాడు. వైఎస్సార్‌ ఆసరాÆ, సున్నా వడ్డీ, చేయూతను తోడుగా ఇచ్చాడు. అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నాడు. దీంతో ఆ సంఘాలు తిరిగి ఏ, బీ గ్రేడ్‌గా చలామణీ అవుతున్నాయి. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు వస్తుంటే బ్యాంకర్లు సెల్యూట్‌ కొట్టి రుణాలు ఇస్తున్నారు. నాడు 18 శాతం ఉన్న ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌ రుణాలు నేడు 0.3 శాతానికి తగ్గాయి. రాష్ట్రమే కాదు దేశం మొత్తం మన పొదుపు సంఘాల వైపు చూస్తోంది.

ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు..
చంద్రబాబు హయాంలో పేదవాడు ఎలా బతుకున్నారో కనీసం ఆలోచించలేదు. ఇల్లు, ఇంటి స్థలం ఉందా? అని ఆలోచించి కనీసం ఒక్క సెంటు ఇచ్చిన పాపాన పోలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక 10, 20 లక్షలు కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలిచ్చాడు. ఒక్కో ఇంట్లో సగటున ముగ్గురు ఉన్నారనుకున్నా ఏకంగా కోటి మందికి మేలు చేసే కార్యక్రమం చేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా పేదల గృహాలను నిర్మిస్తున్నాం. ఈ తేడాను గమనించాలి.

చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలి.. అంటూ ప్రకటనలిచ్చారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగభృతి ఇస్తానని ఊదరగొట్టారు. బాబు సీఎం అయినా భృతి ఇవ్వకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఆపై మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. అందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 80 శాతం ఉద్యోగాలిచ్చాం.

మనుషులు చనిపోయినా పట్టని బాబు పాలన
గతంలో పింఛన్, రేషన్‌కార్డు లాంటి ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులే గుర్తుకొస్తాయి. చంద్రబాబు హయాంలో రైతులకు ఎరువులు, పురుగు మందులు కావాలంటే మండల కేంద్రానికి వెళ్లి క్యూలో నిల్చునేవారు. మనుషులు చనిపోయినా పట్టించుకోని పాలన ఆయనదైతే ఇప్పుడు మీ బిడ్డ పాలనలో అవన్నీ మన గ్రామంలో, మన గడప వద్దకే వలంటీర్లు చిరునవ్వుతో తెచ్చి సంక్షేమ ఫలాలను అందిస్తూ తోడుగా ఉంటున్నారు.

అప్పట్లో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలనే పాలన సాగింది. రాష్ట్రంలో 108,104 వాహనాలకు కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు పాలన పోయింది. మీ బిడ్డ పాలన వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఆదోనిలో కూడా మెడికల్‌ కాలేజీని నిర్మిస్తున్నాం. ఏకంగా 1,600 కొత్త 108, 104 వాహనాలను కొనుగోలు చేసి పేదవాడికి తోడుగా ఉన్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం వెయ్యి ప్రొసీజర్లు మాత్రమే ఉంటే ఈ రోజు 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం.

రోగులు ఆపరేషన్‌ అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో డాక్టర్ల సిఫారసు మేరకు నెలకు రూ.5 వేల చొప్పున వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇవాళ ప్రతీ గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చాం. వీటికి తోడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి మందుల నుంచి చికిత్స వరకూ అందిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 

పేద పిల్లలకు నాణ్యమైన చదువులు
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియానికే పరిమితం చేసి నారాయణ, చైతన్యలను పెంచి పోషించిన పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా రూపురేఖలు మార్చి 6 నుంచి పైతరగతులను డిజిటలైజ్‌ చేశాం. ప్రతి పేద పిల్లాడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం.

బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ గోరుముద్ద ద్వారా రోజుకో మెనూ అమలు చేస్తున్నాం. పిల్లలు చిక్కటి చిరునవ్వుతో ఉండాలని విద్యాకానుక కిట్లను ఇస్తున్నాం. బైజూస్‌ కంటెట్‌ తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, టోఫెల్‌ శిక్షణను సర్కారు స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చాం. గతంలో పేదవాడి గురించి ఏమాత్రం ఆలోచించిన పరిస్థితి లేదు. అహంకార ధోరణి, పెత్తందారీతనంతో అవమానించారు.

ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా..! ఖబడ్దార్‌ అని చంద్రబాబు హెచ్చరించలేదా? చివరకు అక్కచెల్లెమ్మలను సైతం అవహేళన చేసేలా కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజధాని నగరం అని పేరు పెట్టుకున్న చోట పేదవాడికి ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందంటూ నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి ఆయన నైజాన్ని చాటుకున్నారు.

జనవరిలో వైఎస్సార్‌ ఆసరా.. చేయూత
► నా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడాలని నాలుగేళ్లలో వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78,94,194 మందికి రూ.19,178 కోట్లు అందించాం. వచ్చే జనవరిలో మరో రూ.6,500 కోట్లు ఆసరా ద్వారా ఇవ్వనున్నాం.

► పొదుపు సంఘాలు తమ కాళ్లపై నిలబడాలని సున్నా వడ్డీ కింద రూ.4,960 కోట్లు ఇచ్చాం.

► వైఎస్సార్‌ చేయూత ద్వారా 45–60 ఏళ్లు ఉన్న 26,39,703 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్థాన్‌ లీవర్‌ లాంటి సంస్థలతో వ్యాపార అవకాశాలను కల్పిస్తూ నేరుగా రూ.14,189 కోట్లు అందించాం.  చేయూతకు జనవరిలో మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. 

► వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3,57,844 మందికి రూ.2,028 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని 4.40 లక్షల మంది పేదలకు రూ.1,257 కోట్లు సాయం అందచేశాం.

► మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి రూ.538 కోట్లు ఇవ్వగలిగాం.

► వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు రూ.982 కోట్లు అందించాం. 

► వాహన మిత్ర ద్వారా 275,931 మంది డ్రైవరన్నలకు రూ.1,302 కోట్లు ఇచ్చాం.

► జగనన్న తోడు ద్వారా ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లపై ఆధారపడే చిరువ్యాపారులకు పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలతో 15,87,492 మందికి రూ.2,956 కోట్లు అందచేశాం.

హంద్రీపై వంతెనకు రూ.47 కోట్లు
కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పత్తికొండ–గోనెగండ్లను కలిపేలా హంద్రీ–నదిపై వంతెన నిర్మాణం కోసం రూ.47 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. జగనన్న చేదోడు నిధుల విడుదల సందర్భంగా ఎమ్మిగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీలు మధుసూదన్, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, మేయర్‌ బీవై రామయ్య, కలెక్టర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement