మొదటిసారి అందకపోవడంతో రెండోసారి పేరు నమోదు చేసుకుని రూ.10,000 అందుకున్న గుంటూరుకు చెందిన ఇస్త్రీ బండి యజమాని నవీన్
సాక్షి, అమరావతి: ‘జగనన్న చేదోడు’ పథకం కింద అర్హులైన మిగిలిన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంలో భాగంగా.. గతంలో వివిధ కారణాలతో అవకాశం కోల్పోయిన 51,390 మంది టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం రూ.51.39 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు.
ఎన్ని అవాంతరాలెదురైనా ‘సంక్షేమం’ ఆగదు..
మంత్రి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలెదురైనా, కరోనా వంటి విపత్తులు వచ్చినా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులు వారి వృత్తి పనులకు ఉపయోగించుకునేందుకు ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు 2,47,040 మంది లబ్ధిదారులకు రూ.247.04 కోట్లను సీఎం అందించారన్నారు. అయితే ఆ సమయంలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సీఎం జగన్ నెల రోజులు అవకాశం కల్పించారని చెప్పారు.
ఇప్పుడు వారందరికీ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలయితే ఒక్కసారి కూడా సరిగ్గా సాయమందించేవి కావన్నారు. కానీ వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ సాయమందించేందుకు మళ్లీ నెల రోజులు అవకాశమిచ్చిందన్నారు. దీనివల్ల మరో 51,390 మందికి లబ్ధి జరిగిందన్నారు. ఇంత పారదర్శకంగా ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. తాజాగా సాయం అందుకున్న వారిలో టైలర్లు 24,336 మంది, నాయీబ్రాహ్మణులు 6,317 మంది, రజకులు 20,737 మంది ఉన్నారని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1,48,168 మంది రజకులు, నాయీబ్రాహ్మణులకు 148.16 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం టైలర్లను కూడా కలిపి కేవలం ఏడాదిలోనే ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 2,98,430 మందికి రూ.298.43 కోట్లు అందించిందన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులు తమ మనోగతాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment