రేపటి నుంచి 'కులగణన' | CM Jagan Govt Caste Census in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి 'కులగణన'

Published Thu, Jan 18 2024 4:27 AM | Last Updated on Thu, Jan 18 2024 7:42 AM

CM Jagan Govt Caste Census in Andhra Pradesh - Sakshi

అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది.
– ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే రోజు రెండు చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ని ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కుల గణనకూ నాంది పలుకుతున్నారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా అడుగులు వేస్తున్నారు.

బాబా సాహెబ్‌ ఆశయాలను నెరవేరుస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు.  మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు.  సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధి­లోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు.  

ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.  రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని  పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది.

7 సచివాలయాల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టు పూర్తి
రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్‌గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్‌లైన్‌ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.   

726 కులాలు.. ప్రత్యేక యాప్‌
కులగణన ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్‌ యాప్‌లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్‌ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు.

ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్‌ (తేవర్‌), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్‌ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్‌ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్‌ తదితర విధానాలకు అవకాశం కల్పించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement