జగనన్న తోడు చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. తేడా.. ముఖ్యమంత్రి మార్పు మాత్రమే. గతంలో చేసిన అప్పులతో పోల్చితే.. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఇప్పుడు తక్కువ. గతంలో 19 శాతం సీఏజీఆర్ ఉంటే ఇప్పుడు 15% మాత్రమే ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతోంది? ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు, అవినీతి లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
– సీఎం జగన్
80% అక్క చెల్లెమ్మలే
జగనన్న తోడు లబ్ధిదారుల్లో 80 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది ఒక విప్లవం కాగా ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలే 80 శాతం మంది ఉండటం మహిళా సాధికారిత, సామాజిక న్యాయానికి నిదర్శనం. గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వం. వారు బాగుంటే చాలనుకున్నారు. ఆ పెత్తందార్లకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వారికి మద్దతు పలికే దత్తపుత్రుడికి మంచి జరిగితే చాలనుకుంటారు.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచనను గత ప్రభుత్వం ఏ రోజూ చేయలేదని, గత పాలకులది పెత్తందారీ మనస్తత్వమని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. దుష్ట చతుష్టయానికి మంచి జరిగితే చాలనేది వారి విధానమన్నారు. గత సర్కారుది దోచుకో.. పంచుకో.. తిను (డీపీటీ) విధానమైతే ఇప్పుడు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. ‘అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్.. కానీ ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు? గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మారారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులకు ఏటా రూ.పది వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందించే జగనన్న తోడు పథకం ద్వారా కొత్తగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ.395 కోట్ల రుణాలను సీఎం మంజూరు చేశారు. ఆర్నెల్ల కు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులకు మరో రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాలకు జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలిలా ఉన్నాయి.
ఖాతాల్లోకి నగదు జమ చేసిన తరువాత లబ్ధిదారులను అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్
వ్యాపారం కాదు.. గొప్ప సేవ
దేవుడి దయతో ఇప్పటివరకు 15,03,558 కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.2,011 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించి మంచి చేస్తున్నాం. ఈరోజు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.395 కోట్ల మేర వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు కల్పిస్తున్నాం. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నాం. వీరంతా తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరికొంత మందికి పని కల్పిస్తున్నారు. నామమాత్రపు లాభాలనే సంతోషంగా తీసుకుంటూ సమాజానికి సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనేకంటే గొప్ప సేవ అనేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.
నడ్డి విరిచే వడ్డీలు..
బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారులకు అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక చిరువ్యాపారులతో పాటు సంప్రదాయ చేతివృత్తిదారులు పడుతున్న బాధలు నా పాదయాత్రలో కళ్లారా చూశా. చాలా సందర్భాల్లో రూ.వెయ్యికి రూ.100 చొప్పున రోజువారీ వడ్డీలు కట్టాల్సిన దుస్థితి. ఉదయాన్నే వడ్డీకి తీసుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన సరుకులను విక్రయించి సాయంత్రానికి వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి. రూ.100కు రూ.పది చొప్పున నడ్డి విరిచే ఈ వడ్డీల బారి నుంచి తప్పించి లక్షల కుటుంబాలకు అండగా ఉంటేనే వారి జీవితాలు బాగుపడతాయని పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆ మాటకు కట్టుబడి జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచింది.
దేశంలోనే అత్యధికంగా..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు 34 లక్షల మందికి ఇలా తోడ్పాటు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటే ఒక్క మన ఏపీలోనే అందులో సగభాగం అంటే 15.03 లక్షల మందికిపైగా బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటునిచ్చిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలు.
రుణ మొత్తం ప్రతి విడతకు రూ.వెయ్యి పెంచేలా..
ఈ 15.03 లక్షల మందికిపైగా లబ్ధిదారుల్లో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు దాదాపు 5.08 లక్షల మంది. సకాలంలో రుణాలు కడితే వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తిరిగి చెల్లించడమే కాకుండా బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆర్నెల్ల్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. రుణం తీరిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హులు. ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వెయ్యి చొప్పున పెంచేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. దీనివల్ల చిరు వ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ పది శాతం పెరుగుతుంది.
ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు
ఇప్పటివరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్ధిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారాన్ని మోస్తూ తిరిగి చెల్లించిన మొత్తం రూ.48.48 కోట్లు. ఇందులో భాగంగా గత ఆర్నెల్ల్లకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని ఇప్పుడు బటన్ నొక్కి రీయింబర్స్ చేస్తున్నాం.
నాడు.. రూపాయైనా విదల్చలేదు
ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లు, రోడ్ల పక్కన, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద వీధి వీధీ తిరిగి వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్, కూరగాయలు, పళ్లు లాంటి వాటిని విక్రయిస్తూ లక్షల మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరిని బాగు పర్చాలన్న ఆలోచన గత పాలకులకు రాలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నారనే సంగతి తెలిసి కూడా సాయం చేయలేదు.
మనసు లేని పాలకులు...
నిరుపేదలైన చిరువ్యాపారులే కాకుండా సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్క్స్ చేసేవారు, ఇతర సామగ్రి తయారు చేసేవారు, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులు.. వీరందరికీ వడ్డీ లేని రుణాలిచ్చే ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంగత ప్రభుత్వ హయాంలో జరగలేదు. గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు.
నాడు డీపీటీ.. నేడు డీబీటీ
దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో గత సర్కారు హయాంలో డీపీటీ స్కీం అమలు చేశారు. ఈ రోజు మన ప్రభుత్వంలో నేరుగా బటన్ నొక్కుతున్నాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీతో లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. ఈ రకంగా దాదాపు రూ.1.65 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం.
ప్రతి కుటుంబానికి 3 –4 పథకాలు
ఈ రోజు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న 15.03 లక్షల మందిలో చాలామందికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతి కుటుంబానికీ కనీసం 3 – 4 పథకాలు అందుతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేదు.
అన్న ఉన్నారనే ధైర్యం..
పాదయాత్రలో చిరు వ్యాపారులు తమ ఇబ్బందులను మీ దృష్టికి తెచ్చినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారస్తులు జలగల్లా పీడించిన రోజులు పోయి మా అన్న ఉన్నారనే ధైర్యం చిరు వ్యాపారుల్లో కనిపిస్తోంది. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్లకు వెళ్లినప్పుడు అది స్పష్టంగా తెలుస్తోంది. చిరువ్యాపారుల కుటుంబాలను ఆదుకుంటూ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. మా అన్న, మా తమ్ముడు అండగా ఉన్నారన్న సంతోషం వారిలో కనిపిస్తోంది.
– బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి
చిరు వ్యాపారులకు తోడు
సీఎంగా మీ ఆలోచనా విధానం, భావజాలం ఒక్కటే.. సమాజంలో ఏ వర్గం, ఏ వ్యక్తీ అభివృద్ధి, సంక్షేమానికి దూరం కాకూడదన్నదే మీ లక్ష్యం. అభివృద్ది, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలు, కాల్‌మనీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా జగనన్న తోడు చిరువ్యాపారులకు నిజమైన తోడుగా నిలిచింది. అవినీతికి ఆస్కారం లేకుండా రూ.1.65 లక్షల కోట్ల పైచిలుకు పేదలకు అందించారు.
– ఆదిమూలపు సురేష్, మునిసిపల్ శాఖ మంత్రి
మీరేంటన్నా.. తిరిగి డబ్బులిస్తున్నారు
నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నా కుమార్తెను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోయా. అప్పుడు మీరు సీఎంగా లేనందుకు బాధపడుతున్నా. అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లలో చేర్చాం. ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్న నా కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చా. మీరేంటన్నా.. మాకు తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మహిళలకు గుర్తింపు, భరోసా లభించింది. దిశ యాప్ వల్ల ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.లక్ష దాకా లబ్ధి పొందుతున్నా. టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. నేను పండ్ల వ్యాపారం చేస్తున్నా. నా భర్త టైలర్. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేశాం. వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోయేది. జగనన్న తోడుతో రూ.10 వేలు లోను వచ్చింది. సకాలంలో తీర్చడంతో వడ్డీ భారం తగ్గింది. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలి.
– షేక్ షాజిదా, గుంటూరు జిల్లా
మీలా ఎవరూ ఆలోచించలేదు..
ఇంటి దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తా. వడ్డీ వ్యాపారుల దగ్గరికి రూ.10 వేల కోసం వెళితే రూ.1,000 మినహాయించుకుని రూ.9,000 ఇచ్చేవారు. రూ.10,000 కట్టకుంటే మళ్లీ వడ్డీలు వేసేవారు. జగనన్న తోడు పథకాన్ని వలంటీర్ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేయడంతో రుణం వచ్చింది, కూరగాయల కొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నా. రోజూ రూ.500– రూ.800 ఆదాయం వస్తోంది. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. నా కుమార్తెకు అమ్మఒడి, నాకు సున్నావడ్డీ వచ్చింది. మా మామయ్యకు రైతుభరోసా వచ్చింది. పంటల బీమా వచ్చింది. మీలా గతంలో ఎవరూ ఆలోచించలేదు. నా కుటుంబం రూ.82 వేల దాకా లబ్ధి పొందింది.
– ఎం. మాధవి, పెద్దపాడు, కర్నూలు
మళ్లీ మళ్లీ.. మీరే
మాది చిన్న టిఫిన్ కొట్టు. కష్టపడినదంతా వడ్డీలకే సరిపోయేది. మాకు ఏమీ మిగిలేది కాదు. వలంటీర్ ద్వారా జగనన్న తోడు పథకం గురించి తెలుసుకుని రుణం తీసుకున్నా. రెండో విడత కూడా రుణం తీసుకుని వ్యాపారాన్ని పెంచుకున్నా. సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా వచ్చింది. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ కూడా అందింది. మా ఆయన చనిపోవడంతో పెన్షన్ కూడా వస్తోంది. మళ్లీ మళ్లీ మీరే సీఎంగా రావాలి.
– ఎం.లక్ష్మి రామతీర్ధం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment