చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు | CM Jagan Released Jagananna Thodu Loan Amount To Beneficiars Accounts | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు

Published Wed, Jun 9 2021 3:17 AM | Last Updated on Wed, Jun 9 2021 1:23 PM

CM Jagan Released Jagananna Thodu Loan Amount To Beneficiars Accounts - Sakshi

జగనన్న తోడు రెండో విడత చెక్కుతో సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి, అధికారులు, లబ్ధిదారులు

సాక్షి, అమరావతి: జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసిన తర్వాతే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తుండటం సంతోషం కలిగిస్తోందన్నారు. కరోనా కష్ట సమయంలో చిరు వ్యాపారులకు అండగా నిలవడంలో భాగంగా ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో విడతలో 3.70 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాలకు రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రెండో విడతతో కలిపి (తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ.535 కోట్లు) ఈ పథకం కింద 9.05 లక్షల మంది చిరు వ్యాపారులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు వడ్డీ లేని రుణం కింద రూ.905 కోట్లు అందించామని తెలిపారు. తిరిగి రుణాలను వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు  చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. దీనివల్ల రుణం తీసుకున్న వారిలో సకాలంలో తిరిగి చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. ఆ తర్వాత బ్యాంకులు తిరిగి వారికి రుణం ఇస్తాయని చెప్పారు. ఈ రకంగా ఈ పది వేల రూపాయలు రివాల్వింగ్‌ పద్దతిలో చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటుందన్నారు. అర్హులకు ఎవరికైనా రాకపోతే కాంగారు పడొద్దని, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో తనిఖీలు పూర్తి చేసి, ఆరు నెలల్లో వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను
– వ్యవస్థలను, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకు రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లు కచ్చితంగా భావించాలి. నా పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూశాను.
– చిన్న చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకి, వడ్డీలేని రుణాలు వారికి దొరుకుతాయా అంటే.. ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించ లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు.
– దేవుడు వీరి తలరాతలు మార్చే అవకాశం ఇస్తే, కచ్చితంగా మారుస్తాను అని మేనిఫేస్టోలో పెట్టాను. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నాం.
– జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయి. మిగిలిన 3.70 లక్షల మంది గురించి బ్యాంకులతో మళ్లీ మాట్లాడి, వారిపై ఒత్తిడి తెచ్చాం. బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీ నిధి వంటి బ్యాంకులను కూడా రంగంలోకి తీసుకువచ్చి ఈ రోజు రుణాలు ఇప్పిస్తున్నాం.

అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు
– గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
– పుట్‌ పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు చేసేవారు, లేస్, కళంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు కింద పదివేల రూపాయలు వడ్డీలేని రుణంగా అందజేస్తున్నాం.  
– రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. తొలి విడతలో 5.35 లక్షల మందికి ఇచ్చిన రుణాలకు సంబంధించి వారు సకాలంలో బ్యాంకుకు చెల్లించిన వడ్డీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో ఇవాళో, రేపో జమ చేస్తాం.

ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ
– 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు ఈ వడ్డీ లేని రుణం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా 1902 అనే నంబర్‌కు ఫోన్‌ చేస్తే పరిష్కరిస్తారు. అర్హత ఉన్న వారెవరైనా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్‌ జరుగుతుంది.
– ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చూసి, వాటిని పరిశీలించి, ఆరు నెలలకు ఒకసారి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. తమకు ఈ పథకం రాలేదని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు.
– ఈ కార్యక్రమం వల్ల 9.05 లక్షల మంది పేదింటి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.

చిరు వ్యాపారులకు పెద్ద సాయం
ప్రజలకు ఇచ్చిన మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా మంచి పాలన సాగుతుందో అందరం చూస్తున్నాం. రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ ఏం చేసినా, అది పేదల కోసమే ఆలోచించి చేస్తారనే మాట మరోసారి రుజువవుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్‌ పాలన ఆదర్శంగా నిలుస్తోంది. జగనన్న తోడు ద్వారా అందే రుణం చిన్నదిగా కనిపిస్తున్నా.. చిరు వ్యాపారులకు మాత్రం చాలా పెద్ద సహాయం.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి


చిరు వ్యాపారులైన పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో నా పాదయాత్రలో స్వయంగా చూశాను. చిన్న చిన్న మొత్తాలు అధిక వడ్డీతో అప్పుగా పొంది.. ఆ మొత్తంతో పండ్లు, కూరగాయలు కొనుక్కొని తలపై పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ ఎందరో తారసపడి వారి బాధలు చెప్పుకున్నారు. రూ.5 వేలు.. రూ.10 వేలు తక్కువ వడ్డీకి లభిస్తే మా జీవితాలు సాఫీగా సాగుతాయని ఆశ పడ్డారు. వారి కష్టం చూసి ఆ నాడు మాటిచ్చాను. ఆ మాట మేరకు ఇవాళ మొత్తంగా 9.05 లక్షల మందికి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించామని సగర్వంగా చెబుతున్నాను.

బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. మీరు రుణాలు ఇస్తే.. వారు సకాలంలో చెల్లిస్తారని చెప్పాను. అర్హత ఉంది అని తేలిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారుల జీవితాలను మార్చడానికి ఈ సాయం ఎంతగానో ఉపయోగ పడుతుంది.
 

మాకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే
జగనన్నా.. కరోనా కష్టకాలంలో మీరు అందరినీ ఆదుకుంటున్నారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే. మేం వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు ఆదుకున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీ పథకాల వల్ల పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా.  
– సరళాదేవి, తాడికొండ, గుంటూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement