పేదరిక నిర్మూలనే లక్ష్యం | The goal to eradicate extreme poverty | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలనే లక్ష్యం

Published Sun, Feb 7 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

పేదరిక నిర్మూలనే లక్ష్యం

పేదరిక నిర్మూలనే లక్ష్యం

టీమిండియా స్ఫూర్తితో కలిసి పనిచేద్దాం: అరుణ్ జైట్లీ
♦ అధిక వృద్ధిని సాధిద్దాం
♦ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీలో ఆర్థిక మంత్రి
♦ సాగుపై దృష్టి పెట్టాలన్న రాష్ట్రాలు
♦ అధిక నిధులకు డిమాండ్
 
 న్యూఢిల్లీ: దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కేంద్రం రాష్ట్రాలు కలసి పని చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. దేశం అధిక వృద్ధిరేటును సాధించాలంటే టీమిండియా స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం జరిగిన సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను జైట్లీ ముందుంచాయి. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలంటే తమకు అధిక నిధుల కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశాయి.

అంతేకాకుండా గత రెండేళ్లుగా వర్షాభావం వల్ల కునారిల్లిన వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాయి. ఇటీవల కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల దేశం అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తోందని జైట్లీ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాలు మరింతగా పెంచాలని, పేదరిక నిర్మూలన పథకాల అమలుపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు  సూచించారు. 14వ ఫైనాన్స్ కమిషన్ అమలుతో మరిన్ని నిధులు దక్కిన రాష్ట్రాలు ఆ మేరకు మౌలిక వనరుల కల్పన, సామాజిక సంక్షేమ పథకాలపై వెచ్చించాలని కేంద్రం ఆశిస్తోందన్నారు. 

ప్రతి రాష్ట్రమూ తనకున్న ఆర్థిక వనరులను సమర్థంగా వాడుకుంటూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను జైట్లీ ప్రశంసించారు. తద్వారా అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లేలా కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి రాష్ట్రానికీ కేంద్రం తన వంతు తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రాలు పురోగమిస్తే, దేశమూ వృద్ధి చెందుతుందన్నారు. దేశాన్ని అధికవృద్ధి బాటకు మళ్లించేలా.. ‘టీమ్ ఇండియా’ నినాదం స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేయాలన్నారు. కేంద్రానికొచ్చే పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను మరో 10 శాతం పెంచి ఏకంగా 42 శాతానికి చేర్చాలంటూ గతేడాది 14వ ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సూచించింది. దీనికి కేంద్రం కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. ఇక 7వ వేతన సంఘం దాదాపు ఒక కోటి మంది ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు పెంచాలంటూ నవంబర్‌లో సిఫార్సు చేసింది. దీంతో 2016-17లో ఖజానాపై అదనంగా రూ. 1.02 లక్షల కోట్ల మేర భారం పడనుంది. ఈ భారాన్ని అధిగమించేందుకు తమకు అధిక నిధులను కేటాయించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.  

 మరిన్ని నిధులివ్వండి... ఏడో వేతనసంఘం సిఫార్సులతో పాటు కేంద్ర పథకాల అమలు కోసం రాబోయే బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించాలంటూ వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు.  రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల దారుణంగా దెబ్బతిన్న వ్యవసాయ రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. కేంద్ర పథకాలైన సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, ఐసీడీఎస్, జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం వంటి వాటిని గతంలో మాదిరిగానే అమలు చేయాలని, తమ సొంత ఆర్థిక నిధులతో వాటిని నిర్వహించటం కష్టసాధ్యమని పేర్కొన్నారు.

అలాగే కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్‌టీ)ను దశలవారీగా ఎత్తివేతకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని కూడా సత్వరం విడుదల చేయాలని వారు కోరారు. ఇక 7వ వేతనసంఘం సిఫార్సుల అమలువల్ల పడే భారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రత్యేక సాయం అందించాలని, అటు 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రుణ సమీకరణ పరిమితినీ పెంచాలని కేంద్రానికి రాష్ట్రాలు విన్నవించాయి.నిర్దేశిత పరిమితులకు లోబడే మార్కెట్ నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను సమకూర్చుకునేలా వెసులుబాటు కల్పించాలని తాము కోరినట్లు అస్సాం ప్రతినిధి తెలిపారు.

14వఆర్థిక సంఘం సూచనల ప్రకారం తమ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందున కేంద్రం వెసులుబాటునిస్తే తాము వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించుకునేందుకు సాధ్యపడుతుందని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జయంత్ మలయా చెప్పారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిహారం చెల్లింపునకు తాజా బడ్జెట్‌లో తగు కేటాయింపులు జరపాలని తెలంగాణ, పంజాబ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలు కోరాయి. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమలు దిశగా సీఎస్‌టీని ఏటా 1 శాతం చొప్పున తగ్గిస్తూ, దశల వారీగా తొలగించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి ప్రతిగా జీఎస్‌టీ అమల్లోకి వచ్చే దాకా పరిహారాన్ని ఇచ్చేలా ప్రతిపాదనలు చేసింది. దానికి అనుగుణంగానే 2008 జూన్ నుంచి సీఎస్‌టీని నాలుగు శాతం నుంచి రెండు శాతానికి దశలవారీగా తగ్గించడం జరిగింది. అయితే, 2011-12 నుంచి రాష్ట్రాలకు పరిహారం లభించకపోవడంతో తాము నష్టపోతున్నామంటూ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎస్‌టీ పరిహారాన్ని సత్వరం విడుదల చేయాలని కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement