సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీంతోపాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి.
సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా.. దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు వచ్చాయి. స్టడీ సర్కిల్ శిక్షణలతో సత్ఫలితాలు వస్తుండటంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది.
ఈనేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఆవశ్యకతను పరిశీలించాలని ఈశ్వర్ ఆదేశించడంతో ఆ శాఖ చర్యలకు ఉపక్రమించింది. స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ..వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయిం చింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగంలో కీలక ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశంతో పాటు డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్!
Published Mon, Dec 2 2019 3:14 AM | Last Updated on Mon, Dec 2 2019 3:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment