జమ్మికుంటలోని ఎస్సీ హాస్టల్‌లో దుప్పట్లు పంపిణీ చేస్తున్న వార్డెన్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: దుప్పట్లు లేక సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. చలికాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు, బెడ్‌షీట్లు, కాస్మోటిక్ చార్జీలు అందని వైనాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘వణుకుతున్న వసతి’శీర్షికతో ఈనెల 17న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టల్ విద్యార్థులకు ముందస్తుగా రగ్గులు, కార్పెట్ల (జంపఖానా)లను పంపిణీ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపక్రమించింది. దుప్పట్ల పంపిణీకి చర్యల్ని మరింత వేగిరం చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 686 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 58 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. చలికాలాన్ని తట్టుకునే విధంగా నాణ్యమైన రగ్గులు, కార్పెట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ.. టెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 విలువైన రగ్గు, కార్పెట్‌ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన స్టాకును రెండు రోజుల క్రితం టెస్కో ప్రతినిధులు ఎస్సీ అభివృద్ధి శాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ నిమిత్తం అధికారులు జిల్లాలకు తరలించారు. స్టాక్‌ను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంక్షేమాధికారులను ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ఆదేశించారు. శుక్రవారం నాటికి జిల్లా కేంద్రాలకు దుప్పట్లు చేరుకోగా.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పరిధిలో శుక్రవారం రాత్రే పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment