నయా పైసా దారి మళ్లలేదు | Cm kcr about SC Sub Plan Funding Cost | Sakshi
Sakshi News home page

నయా పైసా దారి మళ్లలేదు

Published Sat, Nov 18 2017 2:18 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

Cm kcr about SC Sub Plan Funding Cost - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ బిల్లు తెచ్చాక నయా పైసా నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత మూడున్నరేళ్లలో రూ. 26 వేల కోట్లు దారిమళ్లాయంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి వ్యయంపై పలువురు కాం గ్రెస్‌ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలోని దళిత, గిరిజనుల అభివృధ్ధికి ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృధ్ధికి ప్రభుత్వం పాటుపడుతోందని ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతి పైసాను నిజాయతీగా ఖర్చు చేస్తున్నామని, వారి అభివృద్ధికి జిల్లా, మండల, గ్రా మ స్థాయిల్లో ఖర్చు చేసిన వ్యయ రికార్డులను పెన్‌డ్రైవ్‌లో సభ్యులకు అందజేశామని, అందు లో ప్రతిపైసా ఖర్చును చూసుకోవచ్చన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే నిధుల పక్కదారి...
షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి వ్యయంపై కాంగ్రెస్‌ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, సంపత్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపులు రూ. 88,071 కోట్లుకాగా ఇప్పటివరకు రూ. 33,462 కోట్లు (అంటే 37.99 శాతం) ఖర్చు చేశామన్నారు. అలాగే ఎస్సీల ప్రత్యేక నిధి కింద రూ. 14,375.13 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ. 5,475.02 కోట్లు (38.09 శాతం) ఖర్చు చేశామన్నారు. ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ. 8,165.87 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ. 3,359.37 కోట్లు (41.13 శాతం) ఖర్చుపెట్టామన్నారు.

ప్రగతి పద్దు కింద ఖర్చు చేసిన మొత్తాలకన్నా ఎస్సీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవమని, తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 2,651 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో రూ. 6,711 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్‌ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తున్నామని, టీఎస్‌ ప్రైడ్‌ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, వంద శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు ఇస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలనుకుంటోంది తప్ప పారిపోవాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. గడువులోగా పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించుకోవాల్సి ఉందని, ఈ దృష్ట్యా సమావేశాలను ప్రొరోగ్‌ చేయకుండా గ్లోబల్‌ సమ్మిట్‌ ముగిశాక ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రెండు రోజులు, బీసీల నిధుల ఖర్చుపై ఒక రోజు కచ్చితంగా చర్చ చేపడదామని సీఎం ప్రతిపాదించారు. అప్పుడు ఎవరి హయాంలో ఎంత ఘనకార్యం జరిగిందో బయటకొస్తుందన్నారు. నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్సీ నిధులు దారి మళ్లాయి: సంపత్, గీతారెడ్డి
అంతకుముందు ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎస్సీ రుణాలను 71 వేల మందికి ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా 31,600 మందికి ఇవ్వనే లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,966 ఎకరాల భూ పంపిణీ మాత్రమే జరిగింది. 3.30 లక్షల మందికి మిగతా భూ పంపిణీ ఎప్పుడు చేస్తారు? సబ్‌ప్లాన్‌ నిధులూ పక్కదారి పడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో నేరెళ్ల, మానుకొండూరు వంటి సంఘటనలు జరిగాయి’’అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సంపత్‌ మైక్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి కట్‌ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

అనంతరం సంపత్‌ వ్యాఖ్యలను సీఎం తప్పుబడుతూ ఎస్సీ నిధులు పక్కదారి పట్టలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎస్సీలకు నిధుల విడుదలలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మా నిధులు మాకు ఖర్చుపెట్టడం లేదు. గత మూడున్నరేళ్లలో రూ. 26 వేల కోట్ల నిధులు దారి మళ్లాయి’’అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనా అభ్యంతరం తెలిపిన సీఎం కేసీఆర్‌...లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

చివరగా టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీలకు ఎక్కడా లేని అన్యాయం జరుగుతోందని, వారి నిధులు దారిమళ్లాయని ఆరోపించగా సీఎం మరోమారు జోక్యం చేసుకున్నారు. ‘‘45 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాక చివరి ఏడాదిలో ఎస్సీ బిల్లు తెచ్చారు. దానికి ఎలాంటి రూల్స్‌ నిర్ణయించలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. బిల్లు వచ్చాక ఎన్నికలకు వెళితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. దీనిపై రెండ్రోజులు చర్చిస్తే అందరి ఘనకార్యాలు బయటకొస్తాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై జీవన్‌రెడ్డి అభ్యం తరం తెలుపుతూ ‘‘మీరు మాట్లాడి మాకు అవకాశం ఇవ్వరా?’’అంటూ ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ అందరికీ అవకాశం ఇస్తామన్నారు. తనకు మైక్‌ ఇవ్వాలని కోరినా స్పీకర్‌ ఇవ్వకపోవడంతో జీవన్‌రెడ్డి ఆగ్రహించిన జీవన్‌రెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.


మీ పంచాయితీ నేనే తేల్చాలా?
కాంగ్రెస్‌ సభ్యులకు సీఎం చురకలు
ఇదే అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుల మధ్య సమన్వయం కొరవడటం స్పష్టంగా కనిపించింది. సభలో సంపత్‌ మాట్లాడాక స్పీకర్‌ మధుసూదనాచారి గీతారెడ్డికి అవకాశం ఇవ్వగా సంపత్‌ మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ‘‘మీ పార్టీ సీనియర్‌ సభ్యురాలు మాట్లాడుతుంటే గౌరవం లేదా?’’అని ప్రశ్నించారు.

దీంతో కల్పించుకున్న గీతారెడ్డి తన సమయాన్ని సంపత్‌కే ఇవ్వాలని కోరగా స్పీకర్‌ అంగీకరించలేదు. మరోసారి గీతారెడ్డి మాట్లాడటం మొదలు పెట్టగానే సంపత్‌ మళ్లీ అడ్డుపడటంతో స్పీకర్‌ ఆమె మైక్‌ కట్‌ చేసి జీవన్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయినా సంపత్‌ పదేపదే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండటంతో ముఖ్యమంత్రి లేచి ‘‘మీ పంచాయితీని మేమే తేల్చాలా. ఎవరో ఒకరు తేల్చుకొని మట్లాడండి’’అని చురకలంటించారు. అనంతరం సంపత్‌కు స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement