ఫర్నిచర్‌ పేరిట దోపిడీ! | exploit in the name of furniture in nalgonda district | Sakshi
Sakshi News home page

ఫర్నిచర్‌ పేరిట దోపిడీ!

Published Mon, Feb 19 2018 5:31 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

exploit in the name of furniture in nalgonda district - Sakshi

నల్లగొండ : ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ వ్యవహారం వివాదాస్పదంగా  మారింది. హాస్టళ్లలో వార్డెన్లకు అవసరమయ్యే వీల్‌ చైర్, ఆఫీసు టేబుల్, కంప్యూటర్‌ టే బుల్, స్టీల్‌ బీరువాలు, ఐరన్‌ టేబుల్స్, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, ర్యాక్స్, డైనింగ్‌ టేబుల్స్‌ తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఫర్నిచర్‌ కొనుగోలుకు సంబం ధించి అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఫర్నిచర్‌ కొనాలనే నిబంధన ఉన్నప్పటికీ వస్తువుల ధరలు ఖరారు చేయడం.. నాణ్యత పరిశీలించడంలో అధికారులు తప్పులో కాలేశారు. సాధారణంగా ప్రైవేట్‌ ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించే క్రమంలో అనేక రకాల నిబంధనలు వర్తింపజేసే అధికారులు ఈ వ్యవహారంలో అవేమీ పాటించలేదు. జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలనే ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు రూ.1.13 కోట్ల ఆర్డర్‌ ఏకపక్షంగా కట్టబెట్టారు. జైలు అధికారులు ఖరారు చేసిన ధరలనే జిల్లా అధికారులు ఏకగీవ్రంగా ఆమోదించారు.

కనీసం వస్తువులకు సంబంధించిన శాంపిళ్లను కూడా ముందుగా పరిశీలించలేదు. ప్రైవేట్‌ ఏజెన్సీలు సప్లయ్‌ చేసే వస్తువుల్లో సాంకేతికరమైన లోపాలను గుర్తించడంలో జిల్లా కొనుగోలు కమిటీలో పరిశ్రమల శాఖ ప్రమేయం తప్పనిసరి. కానీ చర్లపల్లి జైలు నుంచి సప్లయ్‌ చేసిన ఫర్నిచర్‌ విషయంలో పరిశ్రమల శాఖ ప్రమేయం లేదనే చెప్పాలి. అధికారులు తాము అనుకున్నదే తడవుగా జైలు అధికారులు చెప్పిన ప్రతీదానికీ తలూపారు. దీంతో సప్లయ్‌ చేసిన వస్తువుల ధరలు, నాణ్యత పరిశీలిస్తే...ఓపెన్‌ మార్కెట్‌లో వాటి ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

ఓపెన్‌ మార్కెట్‌లో చూస్తే..
హాస్టళ్లలో ఫర్నిచర్‌ పరిశీలిస్తే అంత ధర ఉండదని చిన్నతరహా పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. ఫర్నిచర్‌ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వస్తువుల నాణ్యతలో రాజీపడలేదు కానీ ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని అంటున్నారు. బయటి మార్కెట్‌లో ఆఫీసు టేబుల్‌ ధర రూ.5 వేలకు మించి ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ జైలు అధికారులు ఆ టేబుల్‌ను రూ.14,500లకు సప్లయ్‌ చేశారు. జిల్లాలోని జనరల్, కాలేజీ హాస్టళ్లకు 61 టేబుల్స్‌ సరఫరా చేశారు. ఈ లెక్కన 61 టేబుళ్లకు అధికారులు చెల్లించింది రూ.8,84,500. అదే ఓపెన్‌ మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే 61 టేబుళ్ల ధర కేవలం రూ.3,05,000 మాత్రమే. అంటే ఒక్క ఆఫీసు టేబుల్‌ ధరలోనే సుమారు రూ. 5,79,500 వ్యత్యాసం కనిపిస్తోంది. సప్లయ్‌ చేసిన వీల్‌చైర్‌ కూడా సాధారణ రకానికి చెందినదనే అన్నారు. జైల్‌ నుంచి సప్లయ్‌ చేసిన వీల్‌ చైర్‌ ధర రూ.6,095. అంతే క్వాలిటీ కలిగిన చైర్‌ ధర ఓపెన్‌ మార్కెట్‌లో రూ.3 వేలకు మించదని పరిశ్రమల అధికారులు తెలిపారు. జిల్లాకు 61 చైర్లు సప్లయ్‌ చేశారు. ఈ లెక్కన 61 వీల్‌ చైర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ రూ.3,71,795 చెల్లించింది. ఓపెన్‌ మార్కెట్‌ ధరలతో పోల్చినప్పుడు 61 చైర్ల ధర కేవలం రూ.1,83,000 మాత్రమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.1,88,795 . ఇదేరకమైన తేడా మిగిలిన వస్తువుల ధరల్లోనూ కనిపిస్తోంది. సాధారణంగా జైలులో తయారు చేసే వస్తువుల పై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్‌ ఇవ్వడం గమనార్హం.

నిరుపయోగంగా ఫర్నిచర్‌..
సొంత భవనాలు కలిగిన హాస్టళ్లను మినహాయిస్తే అద్దె భవనాల్లోని హాస్టళ్లలో ఫర్నిచర్‌ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అద్దెభవనాల్లో స్థల సమస్య వల్ల కొంత మంది వార్డెన్లు ఫర్నిచర్‌ను తిప్పిపంపించారు. నల్లగొండలోని బాయ్స్‌ హాస్టల్‌ ‘ఏ’కు స్థలాభావం వల్ల నాలుగు లాంగ్‌ బేంచీలను తిప్పి పంపారు. హాస్టళ్లకు ఫర్నిచర్‌ చేరిందా..? లేదా..? అనేది కూడా అధికారులు పట్టించుకోలేదు. మొత్తం ఫర్నిచర్‌కు బిల్లులు మాత్రం చెల్లించారు. ఇక ప్రస్తుతం ఏ హాస్టల్‌కు కూడా కంప్యూటర్లు లేవు. బయోమెట్రిక్‌ మిషన్లు పనిచేయడం లేదు. సొంత భవనాల్లో కంప్యూటర్‌ టేబుళ్లు గతంలోనే ఉన్నాయి. కానీ మళ్లీ కొత్తగా టేబుళ్లు కొనుగోలు చేశారు. అద్దె భవనాలకు సప్లయ్‌ చేసిన టేబుళ్లు వృథాగా పడేశారు. హాస్టళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అడ్డగోలుగా ఫర్నిచర్‌ కొనుగోలు చేయడంలో లక్షల రూపాయల నిధులు వృథా అయ్యాయి.

రెండు రకాల ధరలు..
జైలు అధికారులు ముందుగా నిర్ణయించిన ధరలు కాకుండా రెండో సారి మార్పు చేశారు. ముందుగా ఖరారు చేసిన ధరల ప్రకారం ఆఫీసు టేబుల్‌ ధర రూ.18 వేలు ఉండగా.. ఆ త ర్వాత సవరించిన ధరల ప్రకారం టేబుల్‌ ధర రూ.14,500. ఇదేరకంగా స్టీలు అల్మారాల ధర రూ.15 వేలు ఉంటే దానిని రూ.11,900లకు తగ్గించారు. ఇలా అన్ని రకాల వస్తువుల్లోనే జరిగింది. ధరలు పెంచడం, ఆ తర్వాత వాటిని సవరించే అంతిమ నిర్ణయం కూడా జైలు అధికారులదే. అయితే ధరలు సవరించడాని కంటే ముందుగానే పాత ధరల ప్రకారమే  చర్లపల్లి జైలుకు రూ.1,37,24,000 బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ధరలు సవరించడంతో రూ. 1,13,21, 020ల బడ్జెట్‌ తగ్గింది. ఈ రెండింటి ధరల మధ్య వ్యత్యాసం రూ.24 లక్షలు. మిగిలిన బ్యాలెన్స్‌ రూ.24 లక్షలు వెనక్కి తెప్పించుకోవాల్సిన అధికారులు అలా చేయకుండా అదనంగా మరికొంత ఫర్నిచర్‌ తెప్పించారు. నిజంగానే చర్లపల్లి జైల్లోనే ఫర్నిచర్‌ తయారు చేస్తున్నారా..? లేదంటే కొనుగోళ్ల పేరిట మధ్య వర్తులను అడ్డంపెట్టుకుని బయటి నుంచి కొనుగోలు చేసి సప్లయ్‌ చేస్తున్నారా..? అనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. ట్రంక్‌ పెట్టెలు జైల్లో తయారు కావనే విషయం కూడా తెలుసుకోకుండా అధికారులు వర్క్‌ఆర్డర్‌ ఇవ్వడం అందుకు నిదర్శనం.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డర్‌ ఇచ్చాం
ప్రభుత్వ ఏజెన్సీ కావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు ఆర్డర్‌ ఇచ్చాం. జైలు నుంచి సప్లయ్‌ చేసిన వస్తువులు నాణ్యంగానే ఉన్నాయని వార్డెన్లు చెప్పారు. స్వయంగా పరిశీలన కూడా చేశాం. జైలు అధికారుల వద్ద కూడా ప్రైస్‌ లిస్ట్‌ ఉంటుంది. ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తుంటారు. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ధర ఒకరకంగా ఉంటే ఫర్నిచర్‌ సప్లయ్‌ చేసే నాటికి వాటి ధర తగ్గింది. దీంతో తగ్గిన ధర ప్రకారమే సప్లయ్‌ చేశారు. మిగిలిన బ్యాలెన్స్‌ నిధులతో అదనంగా ఫర్నిచర్‌ తెప్పించాం. నేను ఇన్‌చార్జిగా చేరకముందు నుంచే ఎస్సీ సంక్షేమ శాఖలో ఫర్నిచర్‌ ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ట్రెజరీ నుంచి నిధులు వెనక్కి Ððవెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఫైల్‌ తెప్పించి ఫర్నిచర్‌ కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం.
నరోత్తమ్‌ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement