ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ‘అన్నమో.. రామకృష్ణ ప్రభూ’ అంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని వర్సిటీ అధికారులపై మండిపడ్డారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ప్లేట్లు, గ్లాసులతో వర్సిటీ ఎదురుగా ఉన్న అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. అంతకు ముందు వారు ‘మహానంది’ హాస్టల్ సిబ్బందిని బయటకు పంపి తాళం వేశారు. వార్డెన్‌గా ప్రొఫెసర్ వి.రంగస్వామి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు దాటినా ఏనాడూ తమ బాగోగులను పట్టించుకోలేదని విద్యార్థులు మండిపడ్డారు.
ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము తిన్నదాని కంటే మెస్ బిల్లులు ఎక్కువగా చెల్లిస్తున్నామని, అయినా ఆహారం నాణ్యతగా ఉండడం లేదని వాపోయారు. దాదాపు 600 మంది విద్యార్థులుంటున్న మహానంది హాస్టల్‌లో కొన్ని నెలల నుంచి మెనూ ప్రకారం ఆహారం అందించకపోయినా సర్దుకుపోయామని తెలిపారు. వారం రోజుల నుంచి పెరుగు లేకుండా భోజనం వడ్డిస్తున్నారని చెప్పారు. ఇదేమిటని స్టీవార్డులు, హెడ్‌కుక్‌లను అడిగితే తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్కేయూ రిజిస్ట్రార్ గోవిందప్ప, చీఫ్ వార్డెన్ ఫణీశ్వరాజు నచ్చజెప్పడానికి వచ్చారు. అయితే, విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘మీ పిల్లలకైతే ఇలాంటి భోజనం పెడతారా? మెనూలో పూరి, చపాతి, దోసె, ఇడ్లీ, వడ ఉన్నా ...అరకొరగానే ఇస్తున్నారు. అన్నంతో కూడిన అల్పాహారం పెడుతున్నారు. ఒకసారి హాస్టల్‌కు వచ్చి కూరలు, భోజనం రుచి చూస్తే అర్థమవుతుంద’ంటూ మండిపడ్డారు. దీంతో వారుమహానంది హాస్టల్‌కు చేరుకుని సిబ్బందితో ఆరా తీశారు. అధికారుల మెనూ ప్రకారమే విద్యార్థులకు ఆహారం అందజేస్తున్నామని, మూడు రోజుల నుంచి పెరుగు ఇవ్వడం లేదని వారు తెలిపారు. శనివారం నుంచి నాణ్యమైన ఆహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎస్కేయూ కార్యదర్శి ఒ.కొండన్న, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు రఘు, హరీష్‌కుమార్, గంగాధర్, నాగరాజు, చిదానంద, మనోజ్, సుఖేష్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేకుండా రోడ్డుపైకి వస్తే ఎలా?
అనుమతి లేకుండా ప్రతి చిన్న సమస్యకు రోడ్డుపైకి రావడం భావ్యం కాదని ఎస్కేయూ విద్యార్థులకు ఎస్‌ఐ శేఖర్ పేర్కొన్నారు. వర్సిటీలో సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని, ఇలా రోడ్డుపైకి వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురవుతుంద ని అన్నారు. వార్డెన్ రంగస్వామి స్పందించకపోవడంతోనే తాము ఇలా రావాల్సి వచ్చిందని విద్యార్థులు సమాధానమిచ్చారు. దీంతో వార్డెన్‌ను ఎస్‌ఐ ఫోన్‌లో సంప్రదించగా... ఆ విషయాన్ని డిప్యూటీ వార్డెన్ చూసుకుంటారని సమాధానమిచ్చినట్లు సమాచారం.
తిని చూడండి
Published Sat, Dec 14 2013 3:16 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement