పిల్లల్ని ఎగరేయడం ముద్దు. చదువుల్లోనూ వాళ్లను ఇలాగే ఎగరేయాలని అనుకోవద్దు.
చదువు దోషి కాదు.మార్కులు బోన్లో నిలబడక్కర్లేదు.ర్యాంకులు క్రైమ్ కాదు.లక్ష్యాలు శిక్షలు కావు. ఓటమి అపరాధం కాదు.లుపు చట్టం కాదు. పిల్లలు ఎగరాలనుకునే అమ్మానాన్న..వాళ్లకు రెక్కలు లేవని తెలుసుకోవాలి.ఉంటే.. ర్యాంకులు తెగిన పక్షుల్లాఇలా నేల రాలిపోతారా?!
‘‘అమ్మా.. అఖిల వాళ్లింటికెళుతున్నా! అఖిల చెల్లి హరిప్రియ రిజల్ట్స్ చూసుకొని బిల్డింగ్ పైనుంచి దూకేసిందటమ్మా! ఈ విషయం వాళ్లమ్మకింకా తెలియదట. అదొక్కతే వాళ్ల నాన్నతో పాటు వెళ్లి, ఆసుపత్రి నుంచి ఫోన్ చేసింది. హరిప్రియకు 20 పర్సంటే ఛాన్సెస్ అన్నారట’’.. అక్షిత గొంతు బొంగురుపోయింది. మరో అరగంటలో మళ్లీ ఫోనొచ్చింది... హరిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనీ, తను చనిపోయిందనీ! అక్షిత తల్లి అచేతనంగా నిలబడిపోయింది. (ఇటీవలే హైదరాబాద్‌లో జరిగి, మీడియా దృష్టికి రాని ఒక దుర్ఘటన ఇది. గోప్యత కోసం పేర్లు మార్చాం).
ఎంత పని చేశావే.. నా తల్లీ!
అల్లరల్లరిగా ముద్దులొలికిస్తూ ఆడిపాడే హరిప్రియ చనిపోయిందా? నమ్మలేకపోయింది అక్షిత తల్లి. ఏ తల్లి బిడ్డయితేనేం పద్దెనిమిదేళ్లు కడుపులో పెట్టుకొని పెంచుకున్న బంగారు తల్లి బలవంతంగా చావుని కోరి తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత త్వరగా వెళ్లినా ఆ అమ్మాయింటికి చేరేసరికి గంటన్నర పట్టింది. అదురుతున్న గుండెలతో వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టింది అక్షిత తల్లి. ఇంకా హరిప్రియను ఇంటికి తీసుకురాలేదేమో! హాల్లో నేలమీద పడి హరిప్రియ తల్లి తలబాదుకుంటోంది. ఆమె చేతిలో హరిప్రియ బర్త్‌డే కేక్ ఇవ్వడానికొచ్చినప్పుడు వేసుకొచ్చిన కొత్తబెల్ స్లీవ్స్ టాప్! దానిని గుండెలకి హత్తుకొని హత్తుకొని ఏడుస్తోంది. ఇంట్లో ఉన్నంతసేపూ అమ్మ చుట్టూ తిరిగే తన బిడ్డ చనిపోలేదనీ, ఎక్కడికో వెళ్లుంటుందనీ, తనకి ఒంటరిగా నిద్ర పట్టదు కాబట్టి ఎక్కడున్నా వచ్చేస్తుందనీ, తనను హత్తుకుని పడుకుంటుందనీ ఇలా ఏదో కలలోలా మాట్లాడుతోంది హరి తల్లి. మధ్య మధ్యలో నమ్మక తప్పని వాస్తవం ఆమె నవనాడుల్నీ మెలిపెట్టేస్తోంది కాబోలు గట్టిగా ఏడుపు. చూసే వాళ్ల కళ్లూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
నిన్న మళ్లీ.. హైద్రాబాద్‌లో
నిన్నటికి నిన్న ముద్దులొలికే జస్లీన్ కౌర్ ఆత్మహత్య పిల్లల తల్లిదండ్రుల్లో భయోత్పాతాన్ని సృష్టించింది. నీట్ (జాతీయ వైద్య విద్య)కు అర్హత సాధించలేకపోయానన్న కారణంతో.. పది అంతస్తుల మెట్లెక్కి మరీ దూకేసింది. తక్కువ ఎత్తులో నుంచయితే బతుకుతానేమోననే భయం కూడా ఉన్నట్లుంది! అన్ని మెట్లెక్కుతున్నప్పుడు ఒక్క మెట్టుదగ్గరైనా ఒక్క క్షణం ఆగి ఉంటే ఆ చిన్నారి ఆవేదన చల్లారేదేమో. కానీ ఏకబిగిన అన్నీ ఎక్కేసి అంతా దూకొద్దని కిందనించి అరుస్తున్నా వినిపించుకోకుండా దూకేసింది. అంతకన్నా విషాదం.. ఆమె తల్లి టీవీ విజువల్స్‌లో ఎవరి బిడ్డో దూకేస్తోందని చూస్తూ చివరికి అది తన కూతురేనని గుర్తించడం. ఏ రోజూ మార్కులు తక్కువొచ్చినందుకు ఆ తల్లి ఒక్కమాటా అనలేదు. అయినా జస్లీన్ తన నిండు నూరేళ్ల జీవితాన్ని బలవంతంగా ముగించుకుంది.
తమిళనాడులో.. ఢిల్లీలో
నీట్ పరీక్షలో సరైన ర్యాంకు రాలేదన్న బెంగతో నిరుపేద కుటుంబం తనపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశానన్న న్యూనతతో తమిళనాడులోని విలుపురం జిల్లా చెంజి పెరవలూరుకు చెందిన 19 ఏళ్ల ప్రతిభ పురుగుల మందు తాగేసి ఆత్మహత్య చేసుకొంది. నీట్‌లో అతి తక్కువ మార్కులు రావడమే ఆమె బలవన్మరణానికి కారణం. ఇది తమిళనాడులో నీట్‌నే రద్దుచేయాలనే డిమాండ్‌ని ముందుకుతెచ్చింది. ఇదే తమిళనాడు అసెంబ్లీని ఓ కుదుపు కుదిపేసింది. నిన్ననే ఢిల్లీలో ప్రవర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
మార్కులే మింగేశాయా?
దీనిని క్షణికావేదన అందామా? ఒత్తిడి అందామా? కేవలం మార్కులే వీళ్లందర్నీ మింగేసాయందామా? అప్పటి వరకూ వాళ్లు ఇల్లూ, స్కూలూ తప్ప లోకం తెలియని పిల్లలు. బాగా చదివే పిల్లలు కూడా ఎందుకిలా ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఒక్క వైఫల్యానికే మరణం దిశగా పయనించే పిరికితనం ఏమిటి? సరిగ్గా ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందనిపిస్తుంది. లోకం తెలియకుండా పెంచడం కూడా పిల్లల్లో సవాళ్ల నెదుర్కొనే మానసిక స్థైర్యాన్ని మాయం చేస్తోంది. ఎప్పుడూ.. మార్కులెక్కువొచ్చిన పిల్లలతోనే పోలిక, తక్కువొచ్చినా ఫరవాలేదు అనే భరోసా ఇవ్వకపోవడం, విజయం సాధించేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నించే అవకాశం మనచేతిలోనే ఉందంటూ లాలించే సున్నితత్వం ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ కొరవడడం వల్లనే చిన్నారుల మరణాలు సంభవిస్తాయా? మార్కుల మాయాజాలంతో పాటు పిల్లల్లో స్పోర్టివ్‌నెస్ క్షీణించడం కూడా ఇందుకు కారణం కావొచ్చు.
మెడిసిను, ఇంజినీరింగేనా?!
పెద్దలు పిల్లల గురించి పెద్దపెద్ద కలలకు కనడం కాదు. పిల్లలకు కలలు కనడం నేర్పాలి. ఆ కలలు సాకారమయ్యే అవకాశాలు ఒక్కటి కాదు, వందలు వేలున్నాయని చెప్పాలి. తన జీవితానికి ఒక్క మెడిసిన్, లేదంటే ఇంజనీరింగ్ ఒక్కటే కాదనీ ఇంకా మన ముందున్న ప్రత్యమ్నాయాలెన్నింటినో వారికి ప్రత్యక్షంగా చూపించాలి. బంధువుల్లోనే పడిలేచిన కెరటాలను వాళ్లకు పరిచయం చేస్తుండాలి. పదిసార్లు ఫెయిలయినా పదకొండోసారి 99 శాతం తెచ్చుకోవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. ఇది కాకపోతే ఇంకొకటి. అమ్మనాన్నలని బాధించేది తక్కువ మార్కులు కాదనీ, తమ బిడ్డల మరణమే వారిని చిత్రవధ చేస్తుందనీ వారికి తెలపాలి. ప్రేమగా, లాలనగా.. గుండెలకు చేర్చుకుంటే.. మన ప్రేమలోని ప్రతి స్పర్శా వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. వాళ్లని నిండు నూరేళ్లూ బతకనిస్తుంది.
దోషులు ఎవరు?
విజయాలనే కాదు అపజయాలనూ స్వీకరించాలనే మనస్తత్వం పిల్లలకు తల్లిదండ్రుల నుంచే రావాలి. గెలుపుఓటములు నాణేనికి చేరోవైపేననీ, ఈ రోజు అపజయం కూడా రేపటి విజయానికి బలాన్నిస్తుందనీ నేర్పగలిగే చైతన్యం పిల్లల్లో నే కాదు, తల్లిదండ్రుల్లోనూ రావాలి. ప్రతి ఓటమి నుంచి నేర్చుకునేదెంతో ఉంటుందని అధ్యాపకులు బోధించ గలిగే ఆరోగ్యకరమైన తరగతి గదులు కావాలి. పక్కింటి పిల్లాడికో, అమ్మాయికో తక్కువ మార్కులొచ్చాయని తెలిసీ ఫోన్‌చేసి గుచ్చి గుచ్చి అడిగే బంధువులో, ఇంకొకరో.. ఈ మరణాలకి కారణం కావొచ్చు. హరిప్రియ అయినా, జస్లీన్ కౌర్ అయినా, ప్రతిభ అయినా ఇలాంటి ఏదో ఒక కారణం వాళ్లని మనస్తాపానికి గురిచేసి ఉండొచ్చు. కేవలం ఉపాధ్యాయులో, తల్లిదండ్రులో, స్నేహితులో మారడం కాదు. చదువుల అర్థం కూడా మారాలి. విద్య పట్ల అవగాహన మారాలి. హరిప్రియ అక్క ఇదే అంటోంది. ‘‘నా చెల్లి మరణానికి మా ఇంటి పరిస్థితులో, లేక పాఠశాల పరిస్థితులో కారణం కాదు. సొసైటీయే కారణం. మేమేమీ అనకపోయినా మా బంధువులో, ఎక్కడో ఉన్న మా పరిచయస్తులో ఏదైనా అంటారేమోనని, నాన్న ప్రతినిత్యం జపించే పరువు పోతుందేమోనని హరి తనువు చాలించింది. అందుకే సొసైటీలో మార్పు రావాలి’ అంటోంది తను.
- అత్తలూరి అరుణ
ఆత్మహత్యల నివారణకు..!
తమ పిల్లల చదువుకంటే తమ పిల్లల నిండు జీవితమే చాలా ప్రధానమని తమ తల్లిదండ్రులు భావిస్తున్నారనే ఆలోచననను పిల్లలకు కలిగేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. పిల్లలు ఈ అభిప్రాయానికి వచ్చేలా తల్లిదండ్రుల మాటలు, చేష్టలు ఉండాలి. ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదనే ఆలోచనను పిల్లలో ఎప్పుడూ కలిగిస్తుండాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు మొదట్నుంచీ చదువు గొప్పదనాన్ని నిత్యం నూరిపోస్తూ... పరీక్షకు ముందెప్పుడో మార్కులు తక్కువచ్చినా పర్లేదులే అని మొక్కుబడిగా అంటారు. అది సరికాదు. ఈ మాటను మనస్పూర్తిగా పిల్లలకు చెప్పాలి. పిల్లల అపజయాలకు ఎప్పుడూ వారిని అవమానించకూడదు. కించపరచకూడదు. పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చనే కూడదు. పిల్లల్లో ఎవరికి వారే ప్రత్యేకం. చదువుతోపాటు పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి కావాల్సినవీ చేయాలి. అలా ఉండే పిల్లలే ఎలాంటి విజయాలైనా సాధిస్తారు.
- డాక్టర్ పద్మ పాల్వాయి సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment