సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలని, ఇందులో ఏమాత్రం అలక్ష్యం వహించరాదని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని అందించాలని సూచించారు.
మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ
పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
అంగన్‌వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్‌వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి.
నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్‌ఎంఎఫ్ తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్‌వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్‌వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి.
దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు..
రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి.
కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ
రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది.
మనో వైకల్య బాధితులకు పెన్షన్లు
మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్‌లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్‌లో పెన్షన్లు మంజూరు కానున్నాయి.
పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్‌వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తద్వారా అంగన్‌వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment