విద్యార్థుల సంక్షేమం పట్టదా?
– నాసిరకం భోజనంతో అనారోగ్యం
– మూడు గంటలపాటు విద్యార్థుల ఆందోళన
ఎస్కేయూ : వర్సిటీలోని హాస్టళ్లలో నాసిరకమైన భోజనం అందజేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. నిత్యం కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవన్నారు. ఇందుకు నిరసనగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వరకు విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బైఠాయించారు.
3 గంటలపాటు ఆందోళన చేశారు. కొందరు విద్యార్థులు టీసీలు ఇచ్చేస్తే వెళ్లిపోతామన్నారు. రెక్టార్ శ్రీధర్, రిజిస్ట్రార్ వెంకటరమణ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.లింగా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, క్రాంతికిరణ్, జయచంద్రా రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి , అంకే శ్రీనివాసులు, అశ్వర్థ, శ్రీనివాసులు, ఓబులేసు, బాలరాజు, నారాయణ రెడ్డి, గోవర్ధన్, లింగ, నల్లప్ప, మనోహర్, ఎస్‌ఎఫ్‌ఐ చంద్రశేఖర్, జీవీఎస్ అశోక్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.