తిరుమలాయపాలెం: పక్కపక్కనే ఉన్న జిల్లాలు.. వానొచ్చి వరదొస్తే తెగిపోయే సంబంధాలు.. వరద తగ్గేంతవరకు అటోళ్లు ఇటువైపు.. ఇటోళ్లు అటువైపు వెళ్లలేని పరిస్థితి. లోతట్టు వాగులపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ఏళ్లతరబడి ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా మూడు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి తీవ్రతను గుర్తించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రభుత్వం రూ.38.70కోట్ల నిధులను బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రహదారుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపుకోసం చెక్‌డ్యాంలు నిర్మించేందుకు మంజూరు చేసింది. ఆకేరు నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలతో అంతర్ జిల్లా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
ఆకేరు నదిపై చేపట్టిన మూడు బ్రిడ్జిల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఆకేరు నదిపై రవాణా మార్గం సరిగా లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించారు. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట పరిధిలోని రావిచెట్టుతండా, అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా, తిరుమలాయపాలెం పరిధిలోని ములకలపల్లి ప్రాంతాల్లో ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రోడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యాం పనులు చేపట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ.38,70కోట్లు మంజూరు చేయగా.. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. హైదర్‌సాయిపేట మీదుగా మహబూబాబాద్ జిల్లా ధర్మారం నుంచి మహబూబాబాద్ వెళ్లేందుకు తక్కువ దూరంలోనే ప్రయాణించొచ్చు. సుమారు 30 కిలో మీటర్ల మేర దూరం తగ్గుతుంది. పాతర్లపాడు రావిచెట్టుతండా వరకు రహదారి నిర్మాణంతోపాటు బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.14.10కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న సంస్థ అతి తక్కువ కాలంలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసింది. అయితే మహబూబాబాద్ జిల్లా ధర్మారం వద్ద భూ సేకరణ సమస్యతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం భూ సేకరణ పూర్తికావడంతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట ప్రాంతాల ప్రజలు మహబూబాబాద్ వెళ్లేందుకు దగ్గరి రహదారి ఏర్పడినట్లవుతుంది.
సౌకర్యవంతంగా...
అలాగే తిరుమలాయపాలెం మండల కేంద్రం నుంచి మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లికి వెళ్లేందుకు ఆకేరు నది ప్రవాహంతో గతంలో ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తిరుమలాయపాలెం నుంచి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.9.60కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో డోర్నకల్–తిరుమలాయపాలెం ప్రాంతాలకు దగ్గరి రహదారి ఏర్పడింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఆకేరు అవతల ఉన్న రాకాసితండాకు వెళ్లేందుకు బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో రెండు ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. వర్షాకాలంలో ఆకేరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పశువులు, మనుషులు నదిని దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలెన్నో. దీంతో ప్రభుత్వం రూ.15కోట్ల వ్యయంతో బ్రిడ్జితోపాటు చెక్‌డ్యాం నిర్మాణం, అజ్మీరతండా నుంచి రాకాసితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. ప్రస్తుతం 11 పిల్లర్లు, చెక్‌డ్యాం నిర్మాణం పూర్తికాగా.. బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఒకేసారి మూడు చోట్ల బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందనుంది.
త్వరలోనే పూర్తి చేస్తాం..
హైదర్‌సాయిపేట, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి పిల్లర్లు పూర్తి చేసి రెండు స్లాబ్ నిర్మాణాలు చేపట్టాం. నెల రోజుల్లోగా స్లాబులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం.
– శ్రీకాంత్, ఆర్‌అండ్‌బీ ఏఈ, తిరుమలాయపాలెం
Comments
Please login to add a commentAdd a comment