Transportation Facility
-
‘ఆకేరు’పై రయ్ రయ్యంటూ..
తిరుమలాయపాలెం: పక్కపక్కనే ఉన్న జిల్లాలు.. వానొచ్చి వరదొస్తే తెగిపోయే సంబంధాలు.. వరద తగ్గేంతవరకు అటోళ్లు ఇటువైపు.. ఇటోళ్లు అటువైపు వెళ్లలేని పరిస్థితి. లోతట్టు వాగులపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ఏళ్లతరబడి ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా మూడు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి తీవ్రతను గుర్తించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రభుత్వం రూ.38.70కోట్ల నిధులను బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రహదారుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపుకోసం చెక్‌డ్యాంలు నిర్మించేందుకు మంజూరు చేసింది. ఆకేరు నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలతో అంతర్ జిల్లా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఆకేరు నదిపై చేపట్టిన మూడు బ్రిడ్జిల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఆకేరు నదిపై రవాణా మార్గం సరిగా లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించారు. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట పరిధిలోని రావిచెట్టుతండా, అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా, తిరుమలాయపాలెం పరిధిలోని ములకలపల్లి ప్రాంతాల్లో ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రోడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యాం పనులు చేపట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ.38,70కోట్లు మంజూరు చేయగా.. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. హైదర్‌సాయిపేట మీదుగా మహబూబాబాద్ జిల్లా ధర్మారం నుంచి మహబూబాబాద్ వెళ్లేందుకు తక్కువ దూరంలోనే ప్రయాణించొచ్చు. సుమారు 30 కిలో మీటర్ల మేర దూరం తగ్గుతుంది. పాతర్లపాడు రావిచెట్టుతండా వరకు రహదారి నిర్మాణంతోపాటు బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.14.10కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న సంస్థ అతి తక్కువ కాలంలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసింది. అయితే మహబూబాబాద్ జిల్లా ధర్మారం వద్ద భూ సేకరణ సమస్యతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం భూ సేకరణ పూర్తికావడంతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట ప్రాంతాల ప్రజలు మహబూబాబాద్ వెళ్లేందుకు దగ్గరి రహదారి ఏర్పడినట్లవుతుంది. సౌకర్యవంతంగా... అలాగే తిరుమలాయపాలెం మండల కేంద్రం నుంచి మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లికి వెళ్లేందుకు ఆకేరు నది ప్రవాహంతో గతంలో ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తిరుమలాయపాలెం నుంచి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.9.60కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో డోర్నకల్–తిరుమలాయపాలెం ప్రాంతాలకు దగ్గరి రహదారి ఏర్పడింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఆకేరు అవతల ఉన్న రాకాసితండాకు వెళ్లేందుకు బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో రెండు ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. వర్షాకాలంలో ఆకేరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పశువులు, మనుషులు నదిని దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలెన్నో. దీంతో ప్రభుత్వం రూ.15కోట్ల వ్యయంతో బ్రిడ్జితోపాటు చెక్‌డ్యాం నిర్మాణం, అజ్మీరతండా నుంచి రాకాసితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. ప్రస్తుతం 11 పిల్లర్లు, చెక్‌డ్యాం నిర్మాణం పూర్తికాగా.. బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఒకేసారి మూడు చోట్ల బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందనుంది. త్వరలోనే పూర్తి చేస్తాం.. హైదర్‌సాయిపేట, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి పిల్లర్లు పూర్తి చేసి రెండు స్లాబ్ నిర్మాణాలు చేపట్టాం. నెల రోజుల్లోగా స్లాబులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. – శ్రీకాంత్, ఆర్అండ్బీ ఏఈ, తిరుమలాయపాలెం -
శవానికీ కావడే దిక్కు!
గుండాల: రోడ్డు, సరైన రవాణా సౌకర్యం లేక ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటనే నిదర్శనం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ పాలకులు ఎంత గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల అవస్థలు మాత్రం వర్ణనాతీతం. కనీసం ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఎంతో మంది జ్వర పీడితులను, నిండు గర్భిణులను జెట్టీలు కట్టి మైళ్ల దూరం నడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మృతదేహానికీ ఈ తిప్పలు తప్పలేదు. ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు అతడి కుటుంబ సభ్యులు కావడి ద్వారా మోసుకురావాల్సిన పరిస్థితి ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పాలగూడెంకు చెందిన కొడెం నరేష్ (20) కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కొడవటంచ వరకు వాహనంలో, అక్కడి నుంచి ఎడ్లబండి ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎడ్లబండి కూడా అందుబాటులో లేకపోవడం, ఇటీవల వర్షాలకు రోడ్డు ఛిద్రమై కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కావడి ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని కొడవటంచ వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనం ద్వారా ఇల్లెందుకు తరలించారు. చినుకు పడితే తమకు కావడి తిప్పలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. -
దేశంలో పొంచి ఉన్న ఉప్పు కొరత!
రాజ్‌కోట్: గుజరాత్‌లోని కచ్‌లో సుమారు 8 లక్షల టన్నుల ఉప్పు నిల్వలు పేరుకుపోయాయి. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉప్పు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో గుజరాత్ తీర ప్రాంతాల నుంచి ఎరువుల సరఫరాకే రైల్వే శాఖ ప్రాధాన్యమిస్తోంది. దీంతో ఉప్పు తరలింపు నిలిచిపోయింది. గుజరాత్‌లోని మొత్తం 20 ఉప్పు శుద్ధి కేంద్రాల్లో 14 కచ్‌లోని గాంధీదామ్‌లో ఉన్నాయి. కాండ్లా, ముంద్రా, టునా పోర్టుల్లో సుమారు 17 లక్షల టన్నుల ఎరువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నందున, ఉప్పుకు రైలు బోగీల కొరత ఏర్పడింది. దీంతో మరో మార్గం లేక ఉప్పు తయారీదారులు తమ సరుకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. -
మొక్కజొన్నకు దిక్కేది ?
కొనుగోలు కేంద్రంలోనే నిల్వలు గోడౌన్ల కొరతకుతోడు రవాణాకు ఇబ్బంది అమ్మకానికి ముందుకు రాని రైతులు తెనాలిటౌన్/కొల్లిపర : ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. మార్కెఫెడ్ అధికారులు రవాణా సౌకర్యం కల్పించకపోవటంతో మొక్క జొన్న నిల్వలు కొనుగోలు కేంద్రంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1310, తెల్లజొన్నకు రూ.1510 గా నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 43 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాత్లో ఐకేపీ, డీసీఎంఎస్, సొసైటీల ద్వారా కొనుగోలు చేయటానికి బాధ్యతలు మార్కెఫెడ్‌కు అప్పగిం చింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక, రవాణా సౌకర్యాల ఇబ్బం దులు, గోడౌన్ల కొరత వల్ల ైరె తులు మొక్కజొన్న,జొన్న పంటలను అమ్ముకునేందుకు రావటం లేదు. కొందరు రైతులు అమ్మకానికి తీసుకువచ్చినప్పటికి అక్కడ తేమ శాతం, నాణ్యత తదితరాలను చూసి కొనుగోలు చేస్తుండటంతో తరుగులు పోతున్నాయనే ఉద్దేశంతో రైతులు అమ్ముకోవటానికి రావడం లేదు. బయట మార్కెట్లో క్వింటాల్ మొక్కజొన్న రూ.1100 నుంచి 1150 వరకు కొనుగోలు చేస్తున్నారు. బయట వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడా సరైన వసతు లు కల్పించటంలో అధికారులు విఫలమవటంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. ఆరుబయటే మొక్కజొన్న బస్తాలు... కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో వసతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతనెల చివరి రోజున తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 2989 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. వాటిలో 1176 క్వింటాళ్లను మాత్రమే మార్కెఫెడ్ ఏర్పాటు చేసిన గోడౌన్‌కు తరలించారు. మిగిలిన వాటిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, ఆరుబయట ఉంచారు. దీంతో రైతులు ఎప్పుడు వాన వస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. లారీలు రాకపోవటంతో మొక్కజొన్నలు అక్కడే ఉండిపోతున్నాయి. రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు లారీలకు ఎత్తుతారో తెలియక, వేరే పనులకు వెళ్లలేక ఇక్కడే ఉండాల్సి వస్తోంది.