భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పాలగూడెం నుంచి మృతదేహాన్ని కావడితో మోసుకొస్తున్న దృశ్యం
గుండాల: రోడ్డు, సరైన రవాణా సౌకర్యం లేక ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటనే నిదర్శనం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ పాలకులు ఎంత గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల అవస్థలు మాత్రం వర్ణనాతీతం. కనీసం ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఎంతో మంది జ్వర పీడితులను, నిండు గర్భిణులను జెట్టీలు కట్టి మైళ్ల దూరం నడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మృతదేహానికీ ఈ తిప్పలు తప్పలేదు. ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు అతడి కుటుంబ సభ్యులు కావడి ద్వారా మోసుకురావాల్సిన పరిస్థితి ఎదురైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పాలగూడెంకు చెందిన కొడెం నరేష్ (20) కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కొడవటంచ వరకు వాహనంలో, అక్కడి నుంచి ఎడ్లబండి ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఎడ్లబండి కూడా అందుబాటులో లేకపోవడం, ఇటీవల వర్షాలకు రోడ్డు ఛిద్రమై కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కావడి ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని కొడవటంచ వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనం ద్వారా ఇల్లెందుకు తరలించారు. చినుకు పడితే తమకు కావడి తిప్పలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment