తుమ్మల నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాత స్థానాన్ని పదిలపరుచుకునేందుకు టీఆర్‌ఎస్.. గత ఎన్నికల వరకు సుస్థిర స్థానంగా పేరున్న పాలేరును తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో పట్టు ఎవరిదనే అంశం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. సీపీఎం, బీజేపీ అభ్యర్థులతోపాటు మరో 10 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలు తాము చేసిన అభివృద్ధి, పార్టీకి ఉన్న అండదండల కారణంగా అత్యంత సునాయాసంగా విజయం సాధిస్తామని తొలుత భావించినా.. ఎన్నికల సమయం సమీపించే నాటికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
మంత్రి తుమ్మల ఈ నియోజకవర్గం నుంచి 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గా విజయం సాధించగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. మంత్రి తుమ్మల పాలేరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తేవడం, రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు, బోదకాలు బాధితులకు ప్రత్యేక పెన్షన్లు, నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గల చెరువుల్లో మండు వేసవిలోనూ జలకళ ఉట్టిపడేలా నీరు నిల్వ ఉండేలా చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ తీరానికి తీసుకెళ్తాయనే భరోసాతో ఉన్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ అండదండలు తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి విశ్వసిస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 2016 ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించగా.. అనేకసార్లు కాంగ్రెస్, పలు పర్యాయాలు సీపీఎం విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఈ సీటును కైవసం చేసుకోలేదు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందగా.. టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారి ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఊరూరా ప్రచారం..
ఈనెల 7న జరిగే ఎన్నికలను టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. నియోజకవర్గం కోసం తాను చేసిన అభివృద్ధి పనులను గ్రామగ్రామాన ప్రచారం చేయడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన ఉన్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తిరుమలాయపాలెం మండలంలో కరువు ఛాయలను రూపుమాపిన తీరును ఉదహరిస్తూ.. చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల అభివృద్ధితోపాటు సుదీర్ఘకాలంగా జిల్లా రాజకీయాలతో తనకు గల అనుబంధం విజయానికి సోపానం కాగలదని తుమ్మల భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య ప్రచార హోరు మాత్రం హోరాహోరీగా సాగుతోంది. ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల బలాలను, ఎదుటి పార్టీ అభ్యర్థుల బలహీనతలను ప్రధానంగా ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.
నియోజకవర్గంలో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలు ఉండగా.. దాదాపు అన్ని మండలాలు వ్యవసాయాధారిత మండలాలు కావడంతో గ్రామీణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధికి తాము భవిష్యత్‌లో చేసే పనులను ప్రణాళికాబద్ధంగా వివరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన కందాళ ఉపేందర్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో స్థానికతను ప్రచారాస్త్రంగా సంధిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై అవగాహన ఉందని చెబుతుండగా.. మంత్రి తుమ్మల ఇదే రీతిలో మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పాలేరు నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుని ఉందని, ఇక్కడి సమస్యలు, రైతాంగం ఇబ్బందులపై సమగ్ర అవగాహన ఉందని.. దీనికి అనుగుణంగానే భక్తరామదాసు ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చానని, సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసి తీరుతానని ఓటర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి, బీజేపీ అభ్యర్థి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి గుర్రం అచ్చయ్య నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం తమ పార్టీయే అని బీజేపీ అభ్యర్థి నినదిస్తుండగా.. అనేక ప్రజా ఉద్యమాలతో పాలేరు అభివృద్ధిలో భాగస్వామ్యమైన సీపీఎంకు మరోసారి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి పనులు చేయించే అవకాశం ఇవ్వాలని ఇంటింటి ప్రచారంలో సీపీఎం అభ్యర్థి కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment