ఈ నెల 12న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటి(19వ తేదీ)తో ముగిసింది. సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. పాలేరులో మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, మధిరలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
పాలేరులో తుమ్మల
ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దశర«థ్‌కు అందించారు. తుమ్మల వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తదితరులు ఉన్నారు. నామివేషన్ వేసిన అనంతరం తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గంలో దశాబ్దాల నుంచి కరువు పరిస్థితులు ఉండేవని, ప్రజల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి భక్తరాదాసు ప్రాజెక్ట్‌ను రూ.100కోట్లతో చేపట్టి పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కొత్తగూడెంలో వనమా
కొత్తగూడెంరూరల్: కొత్తగూడెంలో కూటమి (కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తరఫున ఆయన మనవరాళ్లు(తనయులు రాఘవేంద్రరావు, రామకృష్ణల కూమార్తెలు) డాక్టర్ అలేఖ్య, హర్షిణి, మనీషా, వనమా అల్లుళ్లు మనోహర్, లక్ష్మణ్‌రావు నామినేషన్ వేశారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీఫాంను ఎన్నికల అధికారికి అందజేశారు. కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఎంఎ రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, ముత్యాల వీరభద్రం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాసుల ఉమారాణి, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో సండ్ర
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సోమవారం నామినేషన్ వేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మధిరలో మల్లు భట్టి
మధిర: తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్ర మార్క సోమవారం రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాకూటమి బలపర్చి న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టి తన అనుచరులతో కలిసివెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతికి నామినేషన్ అందజేశారు. ఆయన మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంనుంచి తన సతీమణి మల్లు నందిని, కుమారులు మల్లు సూర్యవిక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్యలతో కలిసివచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే.శ్రీనివాసరావుకు అజయ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అజయ్‌కుమార్‌కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆర్‌వో కార్యాలయంలోకి వెళ్లారు. అంతకుముందు అజయ్ నగరంలోని పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానం, చెరువు బజార్ హనుమాన్ గుడిలో పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment