కూటమికి విరుగుడు  | TRS strategy to win more seats | Sakshi
Sakshi News home page

కూటమికి విరుగుడు 

Published Sat, Dec 1 2018 3:38 AM | Last Updated on Sat, Dec 1 2018 3:38 AM

TRS strategy to win more seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాకూటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రత్యేక ఎన్నికల వ్యూహం సిద్ధం చేసింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా ప్రణాళిక రూపొందించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వంద సీట్లలో గెలుపే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ప్రజాకూటమి నుంచి పోటీ ఉందని భావించే సెగ్మెంట్లలో ఈ వ్యూహానికి మరింత పదునుపెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి వ్యూహాలకు దీటుగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఉండేలా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆదేశాలిచ్చారు. ఒక్కో సెగ్మెంట్‌ వారీగా వ్యూహం ఎలా ఉండాలనేది వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముఖ్యులు రంగంలోకి దిగారు. ప్రజాకూటమి ప్రభావం ఉందని భావించే సెగ్మెంట్లలో ప్రత్యేక వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకున్న సీట్లను గెలుచుకునే విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాలు కీలకం కానున్నాయి. దీంట్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది.

ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉంది. అసంతృప్తులకు, అసమ్మతివాదులకు బుజ్జగింపుల ప్రక్రియను త్వరగా పూర్తి చేసింది. సోషల్‌ మీడియా ప్రచారంలోనూ ఇదే పంథా వ్యవహరించింది. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అమలు చేసిన ‘వంద ఓటర్లకు కమిటీ’వ్యూహాన్ని గ్రేటర్‌ హైదరాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేలా చేస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను, అభ్యర్థి విజయాలను... ఆయా నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరుకు చేరవేయడమే లక్ష్యంగా ‘వంద ఓటర్లకు కమిటీ’వ్యూహం అమలు చేయనున్నారు. ఇప్పటికే బూత్‌ స్థాయిలో ఉన్న టీఆర్‌ఎస్‌ కమిటీ కంటే మెరుగైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఉండేలా కొత్త విధానం ఉండనుంది. వంద మంది ఓటర్లే ఉండటంతో వీరు కచ్చితంగా పోలింగ్‌ బూతుకు వచ్చేలా, టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదేశించారు. బూత్‌ స్థాయిలో ఓటర్ల వివరాలను వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఇదే వ్యూహం అమలవుతోంది.  

ప్రచారంపై అధినేత సమీక్ష... 
కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి శనివారం విరామం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళిపై సమీక్షించనున్నారు. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులను అభ్యర్థులకు వివరించి తుది వ్యూహాలను ఎలా అమలు చేయాలో ఆదేశించనున్నారు. ఆదివారం నుంచి మళ్లీ ప్రచారం మొదలుకానుంది. గడువు ముగిసే డిసెంబర్‌ 5 వరకు వరుసగా ప్రచారం నిర్వహించనున్నారు. గజ్వేల్‌ బహిరంగ సభతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.  

నలుగురిపై వేటు.. 
టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా, ఇతర పార్టీ తరుఫున పోటీ చేస్తున్న నలుగురు నేతలను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి), గజ్జల నగేశ్‌ (కంటోన్మెంట్‌), జలంధర్‌రెడ్డి (మక్తల్‌), శంకర్‌ (షాద్‌నగర్‌)ను సస్పెండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. 

పరేడ్‌గ్రౌండ్‌లో హైదరాబాద్‌ నగర సభ! 
నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్‌ హైదరాబాద్‌లోని సెగ్మెంట్లకు కలిపి ఒకే సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై అస్పష్టత వీడటంలేదు. టీఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కలిసి ఉమ్మడిగా పీపుల్స్‌ ఎజెండా పేరుతో కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌ నగర టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారసభలో మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement